పబ్లిక్ టాయ్‌లెట్లలో ఫోన్‌ నెంబర్, ఈమెయిల్ రాశారంటూ ఆమెకు వందలకొద్దీ ఫోన్లు.. ఎవరి పనో తెలిసి..

ABN , First Publish Date - 2022-04-21T18:04:19+05:30 IST

ఆమె కాలేజీలో లెక్చరర్.. 31 ఏళ్లుగా ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంది.. రచయితగా చాలా పుస్తకాలు రాసింది..

పబ్లిక్ టాయ్‌లెట్లలో ఫోన్‌ నెంబర్, ఈమెయిల్ రాశారంటూ ఆమెకు వందలకొద్దీ ఫోన్లు.. ఎవరి పనో తెలిసి..

ఆమె కాలేజీలో లెక్చరర్.. 31 ఏళ్లుగా ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉంది.. రచయితగా చాలా పుస్తకాలు రాసింది.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకుంది.. అలాంటి మహిళకు కొన్ని రోజులుగా వందల కొద్దీ ఫోన్లు వస్తున్నాయి.. తమ శృంగార కోరికలు తీర్చాలంటూ ఎంతో మంది ఆమెకు ఫోన్లు చేస్తున్నారు.. అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నారు.. విసిగిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


కేసు దర్యాఫ్తు చేసిన మంగుళూరు పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ ముగ్గురూ ఆమె కాలేజీకే సంబంధించిన వ్యక్తులు కావడం విశేషం. 58 ఏళ్ల ఆ ఉపాధ్యాయిని పరువు తీసేందుకు ఆ ముగ్గురూ ఆమె ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్‌లను బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలోని పబ్లిక్ టాయ్‌లెట్స్‌లో రాశారు. శృంగార కోరికలు తీర్చుకోవాలంటే ఆ నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఒక్క మంగుళూరులోనే కాదు.. మైసూరు, మదికెరి, చిక్‌మంగుళూరు, బలేహానర్, ఎన్ఆర్ పుర వంటి ప్రాంతాల్లో కూడా రాశారు. 


ఆ నెంబర్లను చూసిన వారు బాధిత మహిళకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడేవారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దర్యాఫ్తు చేసిన పోలీసులు ఎంతో మందిని విచారించి నిందితులు ప్రదీప్ (ఎకనామిక్స్ లెక్చరర్), ప్రకాష్ షెనాయ్ (కాలేజ్ కరస్పాండెంట్), బీఎస్ షెట్టి (ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్)ను అరెస్ట్ చేశారు. వివిధ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలించి వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2022-04-21T18:04:19+05:30 IST