ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 40 లక్షలకు టోపీ పెట్టిన యువకులు.. ఇంతకీ ఏం చేశారంటే?

ABN , First Publish Date - 2022-06-09T09:58:57+05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు నలుగురు యువకులు టోపీ పెట్టారు. మోసం చేసి సుమారు రూ.40 లక్షల విలువైన వస్తువులు కాజేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది...

ఫ్లిప్‌కార్ట్‌కు రూ. 40 లక్షలకు టోపీ పెట్టిన యువకులు.. ఇంతకీ ఏం చేశారంటే?

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు నలుగురు యువకులు టోపీ పెట్టారు. మోసం చేసి సుమారు రూ.40 లక్షల విలువైన వస్తువులు కాజేశారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో వెలుగు చూసింది.


ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ అమ్మిన కంపెనీ కి అనుమానం రావడంతో ఈ మోసం బయట పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..  రాహుల్ సింహ్, దిలీప్ స్వామి ఉరఫ్ మాహీ శర్మ ఇద్దరూ జైపూర్ వాసులే. అక్కడే అజయ్ కాంత్, సునీల్ నాయక్ అనే వాళ్లు కూడా వీళ్లకు జతకలిశారు. వీళ్లలో దిలీప్ స్వామి వివిధ నెంబర్లతో ఫ్లిప్‌కార్ట్ అకౌంట్లు తీసుకున్నాడు. వాటితో ఐఫోన్లు ఆర్డర్ చేసి, ముందుగానే  డబ్బులు కూడా చెల్లించేవాడు. అవి డెలివరీకి వచ్చిన సమయంలో డెలివరీ బాయ్‌ను కూడా బుట్టలో వేసేవాళ్లు. డెలివరీ బాయ్‌కు రూ.4 వేలు లేదా ఐదు వేల రూపాయలు ఇచ్చి రెండు గంటల తర్వాత రమ్మనేవాళ్లు. అతను అలా వచ్చేటప్పటికి అసలు మొబైల్ స్థానంలో నకిలీ ఫోన్ పెట్టేసి రిటర్న్ చేసేవాళ్లు. దాన్ని అందుకున్న డెలివరీ బాయ్.. ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు కంపెనీకి మెసేజ్ చేసేవాడు. దాంతో రెండు, మూడు రోజుల్లోనే దిలీప్ డబ్బులు రిటర్న్ వచ్చేసేవి. తిరిగొచ్చిన మొబైల్‌లో లోపం ఏంటో చూసేందుకు ప్రయత్నించిన కంపెనీ.. బాక్సులో ఉన్న నకిలీ ఫోన్ చూసి ఆశ్చర్యపోయింది. దీంతో అసలు విషయం గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. 


రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులు నలుగురినీ అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఈ విచారణలో తాము ఇప్పటి వరకు 30 నుంచి 40 సార్లు ఇలా మోసాలు చేసినట్లు వాళ్లు అంగీకరించారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-06-09T09:58:57+05:30 IST