పోలీసులే అకారణంగా కాల్పులు జరిపారు

ABN , First Publish Date - 2021-10-19T06:23:02+05:30 IST

లంబసింగి ఘాట్‌లో తనతోపాటు వున్న గాలిపాడు గిరిజనులపై నల్గొండ పోలీసులు అకారణంగా కాల్పులు జరిపారని, దీనికి బాధ్యులైన పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని అన్నవరం సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు డిమాండ్‌ చేశారు.

పోలీసులే అకారణంగా కాల్పులు జరిపారు
సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు



మాపైనా తుపాకులు ఎక్కువపెట్టారు

చేతులు పైకెత్తడంతో వదిలేశారు

అన్నవరం సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు

నల్గొండ పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌



చింతపల్లి, అక్టోబరు 18: లంబసింగి ఘాట్‌లో తనతోపాటు వున్న గాలిపాడు గిరిజనులపై నల్గొండ పోలీసులు అకారణంగా కాల్పులు జరిపారని, దీనికి బాధ్యులైన పోలీసులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని అన్నవరం సర్పంచ్‌ పాంగి సన్యాసిరావు డిమాండ్‌ చేశారు. నల్గొండ పోలీసులు గాలిపాడులో గిరిజనులను అదుపులోకి తీసుకోవడం నుంచి లంబసింగి ఘాట్‌లో కాల్పుల వరకు జరిగిన సంఘటనలు ఆయన మాటల్లోనే...

గాలిపాడు గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు శుక్రవారం సాయంత్రం వంతలపాడులో మా ఇంటికి వచ్చారు. కొద్దిసేపటి క్రితం రెండు కార్లలో కొంతమంది వ్యక్తులు వచ్చి కొర్ర భీమరాజుని తీసుకుపోయారని, వాళ్లు ఎవరో చెప్పలేదని వివరించారు. శనివారం ఈ విషయాన్ని అన్నవరం ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లాము. అదే రోజు మధ్యాహ్నం పనసలపాడుకు చెందిన నార లోవరాజు... అతని తమ్ముడు సాయికి ఫోన్‌ చేశాడు. గాలిపాడుకు చెందిన కిల్లో బాలకృష్ణ, భీమరాజు, నేను(లోవరాజు) నల్గొండ పోలీసుల అదుపులో ఉన్నామని, గ్రామ పెద్దలు వచ్చి మాట్లాడితే విడిచిపెడతామని చెబుతున్నారని సాయి నాతోపాటు గాలిపాడు గిరిజనులు చెప్పాడు. దీంతో ఆదివారం అన్నవరం ఎస్‌ఐని మరోసారి కలిసి విషయం చెప్పి, నల్గొండ పోలీసులను కలిసి వస్తామని చెప్పాము. తరువాత లోవరాజు తన తమ్ముడు సాయికి ఫోన్‌చేసి, లంబసింగి రమ్మని చెప్పాడు. మధ్యాహ్నం నేను, ఎంపీటీసీ సభ్యుడు కొర్ర సూరిబాబు, గ్రామ పెద్దలు పది మంది కలిసి జీపులో బయలుదేరి రెండు గంటలకు లంబసింగి చేరుకున్నాము. 15 నిమిషాల తరువాత రెండు కార్లు లంబసింగి మీదుగా చింతపల్లివైపు వెళుతున్నాయి. మాతో వచ్చిన గాలిపాడు గిరిజనులు... ఈ  కార్లే మొన్న మన గ్రామానికి వచ్చాయని చెప్పారు. మాతోపాటు వున్న సాయి తన అన్న లోవరాజుకు ఫోన్‌చేసి, మేము లంబసింగిలో ఉన్నామని చెప్పగా, లోతుగెడ్డ బ్రిడ్జి వద్దకు రమ్మని కారులో వున్న వ్యక్తులు లోవరాజుతో చెప్పించారు. దీంతో మేము కూడా జీపులో లోతుగెడ్డ జంక్షన్‌ వైపు బయలుదేరాము. కృష్ణాపురం మలుపు వద్ద వాళ్లు కార్లను వెనక్కి తిప్పి తిరిగి లంబసింగి వైపు ప్రయాణమయ్యారు. మేము కూడా జీపుని వెనక్కి తిప్పాము. లంబసింగి ఘాట్‌లో జీసస్‌ విగ్రహం వద్ద లారీ ఆగిపోయివడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో మేము జీపు దిగి, సుమారు 30 మీటర్ల దూరంలో వున్న పోలీసులు వున్న వాహనాల వద్దకు నడుచుకుంటూ వెళుతున్నాం. కిల్లో కామరాజు, కిల్లో రాంబాబు, మరో ఇద్దరు వేగంగా నడుచుకుంటూ వెళ్లి పోలీసు వాహనాలను అపే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంటనే కిందకు దిగి వారిపై కాల్పులు జరిపారు. మాపైన కూడా తుపాకులు గురిపెట్టడంతో చేతులు పైకిఎత్తాము. ఇంతలో ట్రాఫిక్‌ క్లియర్‌ కావడంతో పోలీసులు నర్సీపట్నంవైపు వెళ్లిపోయారు. కాల్పుల్లో గాయపడిన కామరాజు, రాంబాబులను మా జీపులోనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాం.  

Updated Date - 2021-10-19T06:23:02+05:30 IST