మున్సిపాల్టీ దోపిడీ.. పోలీసుల బాదుడు!

ABN , First Publish Date - 2022-05-16T03:46:26+05:30 IST

కావలిలో పార్కింగ్‌ స్థలాలను సైతం అనధికారికంగా లీజుకు ఇచ్చి వ్యాపారులను మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తుండగా వినియోగదారులను పెనాల్టీల పేరుతో పోలీసులు బాదేస్తున్నారు.

మున్సిపాల్టీ దోపిడీ.. పోలీసుల బాదుడు!
రైతు బజారు వద్ద రోడ్డుపైకి వచ్చిన చిరువ్యాపారులు

ఆందోళనలో వ్యాపారులు, వినియోగదారులు

పార్కింగ్‌ స్థలాలకు అనధికార లీజు

వాహన దారులకు తస్సని తిప్పలు

కావలి, మే 15 : కావలిలో పార్కింగ్‌ స్థలాలను సైతం అనధికారికంగా లీజుకు ఇచ్చి వ్యాపారులను మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తుండగా వినియోగదారులను పెనాల్టీల పేరుతో పోలీసులు బాదేస్తున్నారు. దీనిని నియంత్రించే వారే కరువై అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పట్టణ ప్రధాన కూడళ్లు సైతం ఆక్రమణల చరలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో వాహనాలకు పార్కింగ్‌ స్థలాలు లేక ఎవరైనా పొరపాటున రోడ్ల పక్కన వాహనాన్ని ఒక్క నిమిషం పార్కింగ్‌ చేస్తే మరుక్షణం పోలీసులు ఫొటో తీసి పెనాల్టీ విధించినట్లు మొబైల్‌కు మెసేజ్‌ వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కావలి ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌, డీఎస్పీ కార్యాలయం మధ్యలో కావలి రైతు బజారు ఉంది. ఈ రైతు బజారును నిర్మాణ సమయంలో లోపలవైపు ముందు భాగాన ఉన్న స్థలం వాహనాల పార్కింగ్‌కు కేటాయించారు. అయితే ఆస్థలాన్ని మున్సిపల్‌ అధికారులు, కాంట్రాక్టరు చిరు వ్యాపారులకు లీజుకు ఇచ్చి వారి నుంచి నగదు వసూలు చేస్తున్నారు. అలాగే రైతు బజారు ముందుభాగాన రోడ్డు పక్కన ఉన్న స్థలంలో ద్విచక్ర వాహన పార్కింగ్‌ చేసుకునేవారు. ఆస్థలం కూడా కొందరు అధికారపార్టీ నేతలు మున్సిపల్‌ అధికారులను మేనేజ్‌ చేసుకుని తమ ఆధీనంలోకి తీసుకుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా దానిని కూడా చిరు వ్యాపారులకు లీజ్‌కు ఇచ్చి వారు నగదు వసూలు చేస్తున్నారు. దీంతో రైతు బజారు వద్ద రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. రైతు బజారుకు ఇరు వైపులా ఒకటో పట్టణ పోలీ్‌సస్టేషన్‌, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నా వారు ఏమి ఆశించారో తెలియదుకాని తమ కార్యాలయాల వద్ద ఆక్రమణలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతు బజారుకు ఎదురుగా గతంలో ఉన్న పాత కూరగాయల మార్కెట్‌ స్థలం కూడా మున్సిపాల్టీ కూరగాయల వ్యాపారులకు లీజ్‌కు ఇచ్చింది. వారు కూడా నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు మీదకు వచ్చారు. అయితే కూరగాయలు కొనుగోలు చేసేందుకు మోటారు సైకిళ్లపై వచ్చిన వినియోగదారులు తమ వాహనాలను రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసి కూరగాయలు కొనుగోలు చేసుకుని వచ్చే లోపు పోలీసులు ఫొటోలు తీసి వందలకు వందలు పెనాల్టీ వేస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ వాహనాలు ఎక్కడ పార్కింగ్‌ చేసుకోవాలని ప్రశ్నిస్తూ పోలీసుల బాదుడుతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఇలాంటి సమస్య నిత్యం ఎదురవుతోంది. పోలీసులు ఆక్రమణదారులను పట్టించుకోకుండా కొన్ని నిమిషాలు రోడ్డు పక్కన పార్కింగ్‌ చేసిన వాహనదారులపై జులుం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి పార్కింగ్‌కు స్థలం చూపించి పోలీసుల బాదుడు నుంచి ఉపశమనం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-05-16T03:46:26+05:30 IST