యువతిపై పోకిరీల వేధింపులు అడ్డుకున్న ... ఆర్‌ఎస్‌ఐపై దాడి

ABN , First Publish Date - 2020-10-31T05:51:29+05:30 IST

ఇద్దరు ఆకతాయిలు ఓ యువతిని వేధించడంతో ప్రశ్నించిన ఆర్‌ఎస్‌ఐపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునే ఓ బృందం పోలీసు స్టేషన్‌ ముందే దాడి చేసింది.

యువతిపై పోకిరీల వేధింపులు అడ్డుకున్న ...  ఆర్‌ఎస్‌ఐపై దాడి
త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద గుమిగూడి ఉన్న దృశ్యం

ఏలూరు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందే ఘాతుకం

అధికార పార్టీ ప్రజాప్రతినిధి అనుచరుల హల్‌చల్‌

జడ్పీటీసీ అభ్యర్థి ఆధ్వర్యంలో దాడి జరిగినట్టు ఆరోపణలు


ఏలూరు క్రైం, అక్టోబరు 30 : ఇద్దరు ఆకతాయిలు ఓ యువతిని వేధించడంతో ప్రశ్నించిన ఆర్‌ఎస్‌ఐపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునే ఓ బృందం పోలీసు స్టేషన్‌ ముందే దాడి చేసింది. ఆ యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించింది. ఇంత జరుగుతున్నా అక్కడే వున్న పోలీసులు ఏం చేయలేక మిన్నకుండిపోయారు. ఏలూరులో శుక్రవారం జరిగిన ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. జిల్లాలోని ఓ ప్రాంతంలో పనిచేస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇటీవల కరోనాతో మరణించారు. ఆయన కుటుంబం ఏలూరు ఏటిగట్టు ప్రాంతంలో ఉంటున్నది. ఆయన కుమార్తె(15) శుక్రవారం మధ్యాహ్నం అమ్మమ్మ ఇంటికి అమీనాపేట ఏటిగట్టు రోడ్డులో నడుస్తూ వెళుతోంది. ఆ సమయంలో ఇద్దరు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి ఆ యువతిని వేధిస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. భయపడిన ఆమె తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా వెంటపడ్డారు. తమ ఇంట్లోనే అద్దెకు ఉంటున్న ఆర్‌ఎస్‌ఐ వెంకటేష్‌కు విషయం చెప్పింది. ఆయన బయటకు వచ్చి వారిద్దరినీ మందలించారు. ఈ ప్రాంతంలో మళ్లీ కనిపిస్తే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో వారు ఆయనతోనే వాగ్వాదానికి దిగి మేం ఏమిటో చూపిస్తామంటూ వెళ్లిపోయారు. కొంతసేపటికి పది మంది మోటారు సైకిళ్లపై ఆ యువతి ఇంటికి వచ్చి దురుసుగా ప్రవర్తిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. వీరిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఆర్‌ఎస్‌ఐ, ఆ యువతి వెళ్తుండగా దాడి చేశారు. ఆ యువతి బంధువులు, ఆర్‌ఎస్‌ఐ, మరో ఇద్దరు ఏఆర్‌ కానిస్టేబుల్స్‌ త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లేటప్పటికి మరో 20 మంది వచ్చి వీడేనా మన వాళ్లకు వార్నింగ్‌ ఇచ్చిందంటూ ఆ ఆర్‌ఎస్‌ఐని దాడి చేసి కొట్టారు. అడ్డు వచ్చిన ఆ యువతిని వడిలోకి లాగేసుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. తాము ఎమ్మెల్యే మనుషులమని, తమ వారిపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి పెదవేగి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయ్‌బాబు ఆధ్వర్యంలో దాడి జరిగినట్టు బాధితురాలి బంధువులు చెబుతున్నారు. ఇదంతా పోలీస్‌స్టేషన్‌ ముందే జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శలు వస్తున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ యువతిని వేధించిన పెదవేగి మండలం రాట్నాలగుంటకు చెందిన మెరుగు రాజేష్‌, గడ్డం నాగేంద్రలతోపాటు మరి కొంతమందిపై ఐపీసీ 354 (డి), 323, రెడ్‌విత్‌ 34, సెక్షన్లతోపాటు 12 సెక్షన్‌ ఆఫ్‌ ఫోక్సో యాక్టు కింద త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్‌ఎస్‌ఐ ఫిర్యాదుపైన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఏలూరులో జరిగిన ఓ వివాహానికి వచ్చినట్లు గుర్తించారు. అల్లరి గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేయడానికి త్రీ టౌన్‌ ఇన్‌ఛార్జి సీఐ వై.బాలరాజాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఓ ప్రజా ప్రతినిధి మనుషులు ఆర్‌ఎస్‌ఐపై దాడి చేశారని తెలియడంతో ఏఆర్‌ సిబ్బంది త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. శాంతి భద్రతల కోసం తామంతా కష్టపడి పనిచేస్తుంటే ఇలా దాడి చేయడం దారుణమని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఎస్‌ఈబీ సిబ్బందిపై సారా తయారీదారుల దాడి 

ఏలూరు క్రైం, అక్టోబరు 30:సారా బట్టీలను ధ్వంసం చేయడానికి వెళ్లిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బందిపై  శుక్రవారం రాత్రి సారా తయా రీ దారులు దాడి చేశారు. పెదవేగి మండలం భోగాపురం పంచాయతీ పరిధిలోని పోలవరం కాల్వ పక్కన సారా బట్టీలను పెట్టి సారా తయారీ చేస్తు న్నారని ఏలూరులోని ఎస్‌ఈబీ అధికారులకు సమా చారం అందింది.  దీంతో ఎస్‌ఈబీ ఎస్‌ఐ రిజ్వాన్‌, కానిస్టేబుళ్లు ఎస్‌కే బాజీ, ఇస్సాక్‌లు కలిసి శుక్ర వారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సారా బట్టీ తయారీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఉన్న సారా తయారీదారులు గుంపుగా వచ్చి వీరిపై దాడి చేసి వారి వద్ద ఫోన్లను లాక్కుకున్నారు. అక్కడ నుంచి బయటపడిన ఎస్‌ఈబీ సిబ్బంది పెదవేగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రాత్రి పదిన్నర ప్రాంతంలో ఘటనా స్థలికి చేరుకు న్నారు. అప్పటికే దాడికి పాల్పడినవారు అక్కడ నుంచి పారిపోయారు.  పోలీసులు దాడికి పాల్ప డిన వారిని గుర్తించి వారి కోసం గాలింపు చేప ట్టారు. బట్టీల వద్ద ఉన్న సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2020-10-31T05:51:29+05:30 IST