పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-25T06:03:43+05:30 IST

‘పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను వేగవంతం చేయండి. మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి కావాలి’ అని పోలవరం ప్రాజెక్టు అథార్టీ సీఈ ఏకె ప్రధాన్‌ అధికారులకు సూచించారు. ఆయనతో పాటు డిప్యూటీ డైరెక్టర్‌ ఎ.ప్రవీణ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చి అక్కడి నుంచి ఆదివారం తుని నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు.

పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేయండి
గవరయ్యకోనేరు వద్ద హైవేలో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఏకె ప్రధాన్‌

  • పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈ ఏకే ప్రధాన సూచన
  • తుని నుంచి ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించిన బృందం
  • నేడు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన

 (రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

‘పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను వేగవంతం చేయండి. మిగిలిన పనులన్నీ త్వరగా పూర్తి కావాలి’ అని పోలవరం ప్రాజెక్టు అథార్టీ సీఈ ఏకె ప్రధాన్‌ అధికారులకు సూచించారు. ఆయనతో పాటు డిప్యూటీ డైరెక్టర్‌ ఎ.ప్రవీణ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చి అక్కడి నుంచి ఆదివారం తుని నుంచి పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. దార్లపూడి ప్రాంతంలోని బ్రిడ్జిని, గవరయ్యకోనేరువద్ద జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్‌ ఎల్‌ఎంసీ పనుల వివరాలను ఈ బృందానికి వివరించారు. ఇప్పటివరకు 71 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. పలుచోట్ల పలు పనులు నత్తనడక నడవడానికి గల కారణాలపై బృందం ఆరా తీసిం ది. పనులను వేగవంతం చేయాలని ప్రధాన్‌ సూచించారు. నిధుల కొరత వల్ల పనులు నెమ్మదించిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ బృందం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించనుంది. స్పిల్‌వే పనులు పరిశీలించిన తర్వాత జిల్లాలోని ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలను పరిశీలిస్తారు. 27వ తేదీన తిరిగి హైదరాబాద్‌ వెళతారు. 

ప్రతిష్టాత్మకమైన పోలవరం పనుల్లో పెద్దగా పురోగతి లేదు. దీనికి ప్రధాన కారణం బిల్లులు పెండింగులో ఉండ డమే. సుమారు రూ.800కోట్ల వరకు కాంట్రాక్టర్‌కు  ప్రభుత్వం చెల్లించవలసి ఉన్నట్టు సమాచారం. అయినా కాంట్రాక్టరు స్పిల్‌వే గేట్లకు సంబంధించిన పనులు, వరదల సమయంలో చేపలు ఎదురీది పాపికొండలు వైపు వెళ్లడానికి ఉప యోగపడే ఫిష్‌లేడర్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎగవ కాఫర్‌ డ్యామ్‌ పనులు ఇంచుమించు పూర్తి కావస్తున్నాయి. దిగువ కాఫర్‌డ్యామ్‌ పనుల్లో గ్యాప్‌లు లేకుండా చేస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాతే ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులు చేపట్టవలసి ఉంది. రెండు కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేసి వాటి మధ్యలో ఉన్న నీటిని తోడిన తర్వా తే ప్రధాన ప్రాజెక్టు పనులు మొదలయ్యే అవకాశం ఉంది. వాటికి తోడు నిధులు కూడా ఉండాలి. మరోపక్క పునరావాస కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆందో ళనలు కూడా ఉన్నాయి. స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేసినా ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ కట్టకపోతే, పోలవరం పూర్తయినట్టు కాదు. అసలు ప్రాజెక్టు అదే. దానివల్లే రిజర్వాయరు ఉంటుంది. అది పూర్తయ్యే వరకు ఎగువ కాఫర్‌డ్యామ్‌ వద్ద ఎంతనీరు ఉన్న అది స్పిల్‌వే గుండా రాజమహేంద్రవరం వైపు పంపించడమే కానీ మరో ఉపయోగం లేదు. గ్రావెటీ ద్వారా కుడి ఎడమ ప్రధాన కాలువలోకి కొంతవరకు మళ్లించవచ్చనే వాదన ఉంది. కానీ ప్రభుత్వం దీని గురించి ఆలోచించకుండా ప్రాజెక్టు ఎగువ భాగంలో మరో ఎత్తిపోతల పథకం పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్తున్నారు. ఇదిలా ఉంటే  పవర్‌ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ మొత్తం పనులు చేస్తోంది. ఇప్పటికే పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించిన  రెండు టన్నెళ్లు పూర్తి చేసింది. మరో  10 టన్నెళ్ల పనులు జరుగుతున్నాయి.

 


Updated Date - 2021-10-25T06:03:43+05:30 IST