Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఇలానే పంపేస్తారా..?

twitter-iconwatsapp-iconfb-icon
ఇలానే పంపేస్తారా..?

ముంపు గ్రామాల్లో గందరగోళం

 పీకల్లోతు వరదల్లో జనం

 తరలిపోతే పరిహారం అంటూ ప్రకటనలు 

 వేల కోట్లు సమకూర్చడం సాధ్యమేనా

 ఉత్తుత్తి ప్రకటనలతో అనేక అవస్థలు

 సర్కారు చెప్పేది ఒకటి..చేసేది ఒకటి 


పోలవరం ప్రాజెక్టు కోసం వారంతా సర్వం దారపోశారు. పుట్టి పెరిగిన ఊరును, పూర్వీకులు కూడబెట్టిన భూములను త్యాగం చేశారు. పిల్లా పాపలతో బతికేందుకు అనువైన సౌకర్యం కల్పిస్తే జ్ఞాపకాలు చెరిపేసుకుని ఊర్ల నుంచి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. చరిత్ర పుటల్లో మిగిలిపోవాలను కున్నారు. కానీ సర్కారు మాత్రం వీరితోనే చెడుగుడు ఆడుతోంది.


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

‘‘నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం వచ్చేనెలలో పూర్తిగా ఇచ్చేస్తాం.. వారంతా కాలనీలకు వెళ్లిపోతారు..’’ అంటూ వరదల సమయంలో పర్యటనకు వచ్చినప్పుడు సీఎం చేసిన ప్రకటనలు నిర్వాసిత కుటుంబాలను గందరగోళ పరుస్తున్నాయి. ఇప్పటికే ప్రతీ నిర్వాసిత కుటుంబానికి లక్షల్లో ప్రభుత్వం బకాయి పడింది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూనే ఉంది.తడవుకోసారి ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నది. పరిహారం పూర్తిగా తమకు చెల్లించనిదే ఊరు విడిచి వెళ్లేది లేదంటూ నిర్వాసితులు తెగేసి చెబుతున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా వచ్చేనెలలో కోట్లలో ఉన్న పరిహారాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యమేనా ? ఇప్పటికి వరదల్లో ఉన్న వేల కుటుంబాలు మాత్రం అరకొర సౌకర్యాలతో పుట్టెడు కష్టాలతో బతుకు ఈడుస్తున్నారు. 


చెప్పేది ఒకటి..చేసేది ఒకటి

పోలవరం నిర్వాసితులతో వైసీపీ సర్కారు ఆది నుంచి దోబూచు లాడుతోంది. గోదావరి వరదలు వచ్చినపుడల్లా ఊర్లను ఖాళీ చేయిస్తామంటూ ప్రకటన చేయడం పరిపాటి అయ్యింది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటికే అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. నెలరోజులు వ్యవధిలో రెండుసార్లు వరదలు చుట్టుముట్టినపుడు మండల వాసులు పూర్తిగా వరద పాలయ్యారు. చెప్పుకునే దిక్కులేక వినే నాధుడే లేక విలవిల్లాడుతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సరైన న్యాయం చేస్తామంటూ ప్రకటనలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికావడానికి పలుమార్లు ముహూర్తాలు ఖరారు చేసినట్లుగానే నిర్వాసితులను ఊళ్లను ఖాళీ చేయించి కాలనీలకు తరలిస్తామంటూ ప్రతీ ఏటా తేదీలు ఖరారు చేస్తూనే వచ్చారు. అప్పటి జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌ అయితే ‘‘ఇంకే ముంది ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తాం.. ఈలోపే అంటే వచ్చే జూన్‌ నాటికే నిర్వాసితులందరిని ఖాళీ చేయిస్తాం.. పరిహారం కూడా ఇచ్చేస్తాం..’’అంటూ 2020 లోనూ ప్రకటించారు. గడిచిన మూడేళ్లలో పదే పదే ప్రాజెక్టు పూర్తి దగ్గర నుంచి  నిర్వాసితులను ఊళ్లనుంచి ఖాళీ చేయడంపై వరుస ప్రకటనలు చేస్తూనే వచ్చారు. కానీ ఈ మధ్యన ముంపు మండలాల్లోకి వరద చొచ్చుకొచ్చినపుడు ఊళ్లకు ఊళ్లే మునిగి పోయాయి. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్మోహనరెడ్డి వేలేరుపాడు మండలాన్ని సందర్శించారు. ఇదే సందర్భంలో నిర్వాసితుల తరలింపుపై ఆయన కీలన ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు 41.75 కాంటూరు పరిధిలో ఉన్న వారందరికీ పూర్తి పరిహారం సెప్టెంబరులో చెల్లించి తరువాత ఊళ్లను ఖాళీ చేయిస్తామని స్పష్టంగా ప్రకటించారు. ఒక వైపు వరద కష్టాలు తీరకమునుపే సీఎం చేసిన ఈ కీలక ప్రకటనపై అప్పట్లోనే నిర్వాసితులు విసిగిపోయారు. వరద కమ్మేసిన సమయంలో తమను ఆదుకోవాల్సింది పోయి కేవలం నెల అంటే నెల అన్నట్లుగా సీరియస్‌గా ప్రక టించడాన్ని అప్పట్లోనే తప్పు పట్టారు. 


 వ్యక్తిగత పరిహారం  మాటేమిటి..?

ఎన్నికల ముందు వ్యక్తిగత ప్యాకేజీ పది లక్షలు వరకు పెంచుతామని అప్పట్లో వైసీపీ అధ్యక్షుడిగా జగన్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు.గతేడాది ఈ పరిహా రాన్ని పెంచుతూ జీవో కూడా జారీచేశారు. నిర్వాసితులను సర్దుబాటు చేసేం దుకు వారిలో ఉన్న ఆగ్రహం అసంతృత్తి చల్లార్చే విధంగా ఆగమేఽఘాలు మీద జీవో జారీ చేశారు. కానీ ఆచరణకు వచ్చే సరికిమాత్రం వెనుకడుగు వేసింది. ఇదే విషయాన్ని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం నిర్వాసితుల కుటుం బాలు నిలదీస్తూనే వచ్చాయి.ముఖ్యమంత్రి గతనెలలో వేలేరుపాడుకు వరద బాధితులను పరామర్శించేందుకు వస్తున్నపుడు అధికారులు ఎంపిక చేసిన కొంతమంది ఖాతాల్లో ఐదులక్షలు చొప్పున జమచేసి చేతులు దులుపుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఏడు ముంపు మండలాల్లో పరిహారం పేరిట పూర్తిగా చెల్లింపు చేయాల్సి వస్తే దాదాపు మూడున్నర వేల కోట్లు అవుతుందని అంచనా. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా పదికోట్లు మాత్రమే నిర్వాసితుల ఖాతాల్లో జమచేసి చేతులెత్తింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ఉన్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తాన్ని  నెల వ్యవఽఽధిలో చెల్లించడం పూర్తిగా అసాధ్యమే. కానీ ప్రభుత్వం మాత్రం ఇచ్చేస్తాం.. మీరు వెళ్లిపోండి.. అంటూ నిర్వాసితులకు స్థ్థిమితం లేకుండా చేస్తోంది.. 


పెండింగ్‌ సంగతి వదిలేశారా 

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వేల మంది నిర్వాసితులకు ఇప్పటికే వ్యక్తిగత పరిహారంతో పాటు కోల్పోయే ఇళ్లకు పరిహారం చెల్లించాల్సి ఉంది. వీటిని ఎకెక్కడెక్కడ ఎన్ని ఇల్లు పరిహారం జాబితాలోకి వస్తున్నాయి.. పరిహారం విలువ వ్యక్తుల సంఖ్యతో కూడిన జాబితాలను విడుదల చేస్తామని పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకు అతీగతి లేదు.‘‘ఉన్న పలంగా వెళ్లిపోయేం దుకు మేము సిద్ధంగా లేము..మాకు ఇవ్వాల్సింది అంతా ఇచ్చేయండి.. కోల్పో యిన ఇళ్ల పరిహారం కూడా కలిపి మంజూరు చేయాల్సిందే’’ అంటూ నిర్వాసి తులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే పునరావాస కాల నీల్లో అసౌకర్యాలు లేమి స్పష్టంగా ఉంది. ఆయా కాలనీల్లో పనులు పూర్తి చేసి నివాసానికి వీలుగా సిద్ధం చేయాల్సింది పోయి నిర్వాసితుల చేత మాత్రం ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించడాన్ని ప్రజాసంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ మధ్యనే కొందరు హైకోర్టును ఆశ్రయించి పోలవరం ప్రాజెక్టు కారణంగా తాము నిర్వాసితు లుగా మారామని తమకు కూడా పరిహారం చెల్లించాలంటూ వేడుకున్నారు.ఆయా గ్రామాల్లో ఉండటం లేదు కాబట్టి పరిహారం చెల్లించడం లేదని ఎక్కడున్నా సరే పరిహారం ఇప్పించేట్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రత్యేక వాజ్యం వేశారు. హైకోర్టు సైతం దీనికి సానుకూలంగా స్పందించింది. నిర్వాసితులు కొందరు ఇపుడు అదేబాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.