నిర్వాసితులకు న్యాయం చేయండి..తర్వాత పనులు పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-04-13T06:05:17+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ సమాంతరంగా నిర్వహించకుండా నిర్వాసితులను గాలికి వదిలేస్తున్నారని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ప్రతినిధి అయినాపురపు సూర్యనారాయణ అన్నారు.

నిర్వాసితులకు న్యాయం చేయండి..తర్వాత పనులు పూర్తి చేయండి

  అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్‌

భానుగుడి (కాకినాడ), ఏప్రిల్‌ 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ సమాంతరంగా నిర్వహించకుండా నిర్వాసితులను గాలికి వదిలేస్తున్నారని ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ ప్రతినిధి అయినాపురపు సూర్యనారాయణ అన్నారు. పోలవరం నిర్మాణ పనులను తక్షణం నిలుపుదల చేసి నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ ఏపీఎన్‌జీవో హోంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మోనటరింగ్‌ జిల్లా కమిటీ సభ్యులు అయితాబత్తులు రామేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సూర్యనారాయణ, పోలవరం నిర్వాసితుల సంఘం సభ్యుడు కారం వెంకటేశ్వరరావు, యునైటెడ్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ ఫోరం ప్రతినిధి తుమ్మల నూకరాజు, ఆదివాసీల మహాసభ సభ్యులు సోమాల దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. పోలవరం పూర్తయితే ఆనుకుని ఉన్న 371 గ్రామాలు ముంపునకు గురవుతాయని, 164 గ్రామాలకు ఆర్‌అండ్‌ఆర్‌ కల్పించేందుకు సీసీఎల్‌ఏ నుంచి అనుమతి పొందినా 2020 చివరి నాటికి 12 గ్రామాలకు మాత్రమే పాక్షికంగా కల్పించారన్నారు. మిగిలిన 192 గ్రామాల నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వడం లేదన్నారు. దీంతో నిర్వాసితులు ప్రధానంగా గిరిజనులు అభద్రతాభావంతో జీవిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పోలవరం ప్రాజెక్టు విషయంలో అవగాహన ఒప్పందం లేదని, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పదం కుదుర్చుకోవాలని కోరారు.  

Updated Date - 2021-04-13T06:05:17+05:30 IST