పోలవరం జాప్యం.. రైతులకు శాపం!

ABN , First Publish Date - 2022-01-13T08:07:27+05:30 IST

పోలవరం ప్రాజెక్టును 2020కే పూర్తిచేసి ఖరీ్‌ఫకు నీరిస్తామని ఒకసారి.. 2021 ఖరీ్‌ఫకని ఇంకోసారి.. డిసెంబరు నెలాఖరునాటికి పూర్తి చేస్తామంటూ మరోసారి.. జగన్‌ ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తోంది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం 2022 ఏప్రిల్‌ నాటికే పూర్తిచేయాల్సి ఉండగా..

పోలవరం జాప్యం..  రైతులకు శాపం!

  • ఏటా రూ.5,000 కోట్ల నష్టం!!
  • ప్రాజెక్టు పూర్తి చేయకుండా రెండున్నరేళ్లుగా వాయిదాలు
  • తాజాగా కేంద్రాన్ని మరో ఏడాది సమయం కోరిన జగన్‌ సర్కారు
  • గోదావరిలో ఇప్పటికే రబీకి ఇక్కట్లు
  • ప్రాజెక్టు పనుల కారణంగా చాలినంత నీరందని వైనం
  • 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు బ్రేకు


పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. లక్ష్యం మేరకు పనుల పూర్తిలో రాష్ట్రప్రభుత్వం విఫలమవుతోంది. పనులు చేసే గడువును ఎప్పటికప్పుడు పొడిగించుకుంటోంది. తాజాగా మరో ఏడాది గడువివ్వాలని కేంద్రాన్ని కోరడంతో రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సాగు నీరందక ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టును 2020కే పూర్తిచేసి ఖరీ్‌ఫకు నీరిస్తామని ఒకసారి.. 2021 ఖరీ్‌ఫకని ఇంకోసారి.. డిసెంబరు నెలాఖరునాటికి పూర్తి చేస్తామంటూ మరోసారి.. జగన్‌ ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తోంది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం 2022 ఏప్రిల్‌ నాటికే పూర్తిచేయాల్సి ఉండగా.. ఇప్పుడు మరో ఏడాది గడువు కావాలని కేంద్రాన్ని కోరడం రైతులకు అశనిపాతంలా మారింది. నిజానికి ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 23.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. విశాఖకు తాగు, పారిశ్రామికావసరాలకూ గోదావరి జలాలు అందుతాయి. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను పట్టిసీమ ఎత్తి పోతల పథకం ద్వారా ఎత్తిపోయడం ద్వారా 13.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించడంతో పాటు చేపలు, రొయ్యల చెరువులకూ నీరివ్వొచ్చు. ఇన్ని లాభాలున్న ప్రాజెక్టును నిధుల లేవంటూ జగన్‌ ప్రభుత్వం వాయిదాలు వేస్తూనే ఉంది.


ముందస్తుగా ఖర్చు చేయకుండా కేంద్ర నిధులవైపే చూస్తుండడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా రెండేళ్లుగా గోదావరి డెల్టా రైతులు రబీలో పూర్తిస్థాయిలో వరి వేసేందుకు వీల్లేని పరిస్థితులు తలెత్తాయి. ఈ ఏడాది రబీలో పది లక్షల ఎకరాల్లో వరి వేశారు. నాట్లకు నీరందించేందుకు పోలవరం ఇంజనీరింగ్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు నిర్మించడంతో 300మీటర్ల మేర వరద వస్తోంది. స్పిల్‌వే నుంచి మందకొడిగా జలాలు పారుతుండడంతో.. 20 టీఎంసీలు తక్కువగా నీరందుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పోలవరం పనులు 2020 జూన్‌ నాటికి.. 2021 డిసెంబరు నాటికి పూర్తి చేస్తామని బల్లగుద్ది చెప్పి చతికిలబడిన సర్కారు.. ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి పూర్తి చేసి నీరందిస్తామని ధీమాగా చెప్పలేకపోవడం గమనార్హం.


అంచనాలు రివర్స్‌ చేయరేం?

2017-18 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లని గత ప్రభుత్వ హయాంలో చెబితే.. నాటి ప్రతిపక్ష నేతగా జగన్‌ విమర్శలు గుప్పించారు. ఇందులో భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. కానీ తాను గద్దెనెక్కాక మరింతగా రూ.55,656.87 కోట్లకు పెంచారు. పనుల విషయంలో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లిన జగన్‌.. అంచనా విషయంలో ఆ విధానం పాటించి ఎందుకు కుదించడం లేదని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి నిర్మాణ సంస్థను మార్చకుండా యథాతథంగా కొనసాగించి ఉంటే.. ఈపాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని చెబుతున్నారు. రివర్స్‌ టెండర్‌లో రూ.629 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప.. పనులు పూర్తి చేయించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని విమర్శిస్తున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యాలు చేరుకోవడంలో జాప్యం జరుగుతుందని.. కాలాతీతమయ్యే కొద్దీ అంచనా వ్యయం పైపైకి వెళ్తుందని కేంద్రం హెచ్చరించింది కూడా. అంచనా వ్యయం పెరిగితే రాష్ట్రమే భరించాల్సి ఉంటుందని కూడా కరాఖండీగా చెప్పింది. అయినప్పటికీ జగన్‌ రివర్స్‌లోనే వెళ్లారు. ఫలితంగా పనులు జాప్యమయ్యాయి. ఇప్పుడు టెండర్‌ నిబంధనల మేరకు.. 2021-22 అంచనా వ్యయం మేరకు కాంట్రాక్టు సంస్థకు చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని అంటున్నారు.


తిట్టిన పట్టిసీమే దిక్కయింది

ముడుపుల కోసమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టారని జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా నిత్యం ఆరోపణలు చేశారు. అయితే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కృష్ణా డెల్టా పరిధిలో సాగు, ఆక్వా రైతులకు నీరందించేందుకు గత ఐదేళ్లుగా పట్టిసీమే ప్రధాన వనరుగా మారింది. 80టీఎంసీల గోదావరి జలాలు కృష్ణాడెల్టాకు ఎత్తిపోస్తున్నారు. 13.5లక్షల ఎకరాలకు సాగు నీరందుతోంది. ఏటా రూ.వేల కోట్ల వ్యవసాయ దిగుబడులు రైతులకు అందుతున్నాయి.


45.72 మీటర్లకు భూసేకరణ చేయాల్సిందే: కేంద్రం

నిధుల్లేవన్న వాదనతో పోలవరం ప్రాజెక్టును తొలివిడతలో 41.15 మీటర్ల కాంటూరుకే పరిమితం చేయాలన్నది జగన్‌ ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం రూ.8,002 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది. ఇందులో రూ.4,805 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంకో రూ.3,197 కోట్లు వ్యయం చేసేసి.. 91 టీఎంసీలను నిల్వచేసి ప్రాజెక్టు పూర్తిచేశామంటూ ప్రచారం చేసుకోవాలని సర్కారు చూస్తోంది. ఇదే జరిగితే పోలవరం ప్రాజెక్టు రిజర్వాయరుగా కాకుండా.. ఎత్తిపోతల పథకంగా మిగిలిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం కూడా 45.72 మీటర్ల కాంటూరు దాకా భూసేకరణ చేయాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అలా చేయాలంటే రూ.35,669 కోట్లు కావాలి. ఇందులో రూ.6,654 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినందున మరో రూ.29,014 కోట్లు అవసరం. అంటే.. కాంక్రీట్‌ పనులు పూర్తయినా భూసేకరణ సహాయ పునరావాసం సమగ్రంగా జరిగితేనే.. ప్రాజెక్టు సంపూర్ణమైనట్లుగా కేంద్రం నిర్ధారిస్తుంది. ఇంకోవైపు.. ప్రాజెక్టు పూర్తికాక.. 7.20 లక్షల కొత్త ఆయకట్టు రాలేదని.. గోదావరి డెల్టాలో రబీ పంటకు నీరందించలేకపోతున్నారని.. ఇది రైతులపాలిట శాపంగా పరిణమించిందని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏటా దాదాపు రూ.5,000 కోట్ల మేర వారు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-01-13T08:07:27+05:30 IST