మోదీ ఎస్‌ అంటేనే!

ABN , First Publish Date - 2020-10-23T08:27:01+05:30 IST

పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలపై కేంద్ర ఆర్థిక శాఖ వైఖరి తెలిశాక.. నిర్మాణ పనులు, సహాయ పునరావాస కార్యక్రమాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టు

మోదీ ఎస్‌ అంటేనే!

లేదంటే పోలవరంపై ప్రతిష్టంభనే

భూసేకరణ వ్యయంలో భారీ కోత ఫలితం

మూడింట రెండొంతులు కుదించిన కేంద్రం.. 12,313 కోట్లు చాలని నిర్ధారణ

పరిహారం, పునరావాసమూ అందులోనే!.. 34,354 కోట్లకు రాష్ట్రం అంచనా

తేడా రూ.22,040 కోట్లు.. నిర్వాసితులను ఆదుకోవడమెలా?

ఇంత మొత్తం భరించగలమా?.. అయోమయంలో జగన్‌ ప్రభుత్వం

నేడు నిర్మల, షెకావత్‌లతో బుగ్గన భేటీ?.. త్వరలోనే పీపీఏ సమావేశం?


ప్రధాని మోదీ జోక్యం చేసుకుంటే తప్ప పోలవరం ప్రాజెక్టుపై పడిన పీటముడి విడిపోయేలా లేదు. తుది అంచనా వ్యయాన్ని తెగ్గోసిన కేంద్ర ఆర్థిక శాఖ.. అందులో భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చును పూర్తిగా తగ్గించేసింది. 2013-14 అంచనాలకే కట్టుబడి ఉంటామంటూ.. రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని రూ.20,398.61 కోట్లకు విరగ్గోసింది. అందులో ఒక్క ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీనే మూడింట రెండొంతులు కోసేసింది.  దీంతో నిర్వాసితుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. ఏం చేయాలో జగన్‌ సర్కారుకు అంతుపట్టడం లేదు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలపై కేంద్ర ఆర్థిక శాఖ వైఖరి తెలిశాక.. నిర్మాణ పనులు, సహాయ పునరావాస కార్యక్రమాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితుల్లో ఆందోళన పెల్లుబుకుతోంది. కేంద్ర ఆర్థిక శాఖను కాదని జలశక్తి శాఖ చేయగలిగిందేమీ లేకపోవడంతో.. ఇక ప్రధాని మోదీ కలగజేసుకుంటే తప్ప తుది అంచనాలపై ప్రతిష్టంభన తొలగిపోదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


ఆయన సరేనంటేనే ఇక పనులు ముందుకు సాగుతాయని.. లేదంటే ఇబ్బందేనని చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస వ్యయం మొత్తం కలిపి రూ.20,398.61 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తేల్చేయడం.. ఇప్పటికే పలు విడతల్లో విడుదల చేసిన నిధులను, రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తాన్ని మినహాయిస్తే.. రూ.4,819.474 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తాయని.. దీనికి ఆంధ్రప్రదేశ్‌ను ఒప్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) అధికారికంగా స్పష్టం చేసిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ‘పోలవరానికి షాక్‌’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం జగన్‌ ప్రభుత్వాన్ని ఆందోళనలో పడేసింది. ఇక ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భూసేకరణ, సహాయ పునరావాస (ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీకి 12,313.90 కోట్లు చాలని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొనడం వారిని, రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేస్తోంది.


2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ పరిహారం, నిర్వాసితులకు సహాయ పునరావాసాన్ని లెక్కిస్తే రూ.34,354,65 కోట్లు అవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. అయితే కేంద్రం మాత్రం 2013-14 లెక్కలను పరిగణనలోకి  తీసుకుని.. రూ.12,313.90 కోట్లు సరిపోతాయంటోంది. అంటే మూడింట రెండొంతులు.. రూ.22,040.75 కోట్ల మేర కోత పడింది. తెలంగాణ నుంచి ఏడు మండలాలు రాష్ట్రంలో విలీనమయ్యాక.. పరిహారం చెల్లింపులు కొంత  జరిగినా.. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ముంపు ప్రాంతాల వారికి పునరావాసం కల్పించేందుకు వీలుగా కాలనీల నిర్మాణం, పాఠశాలల భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. 3.25 లక్షల మందికి గృహసదుపాయం, 2.85 లక్షల మందికి పరిహారం చెల్లించాలంటే.. రూ.34,354.65 కోట్లు తప్పనిసరని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కేంద్రం కోత పెడితే ఈ కుటుంబాల పరిస్థితేమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం రాష్ట్ర సర్కారులో గుబులు రేపింది.


తుది అంచనాలను 2013-14కే పరిమితం చేయడంపై కేంద్రాన్ని సంప్రదించాలని భావిస్తోంది. జలశక్తి, ఆర్థిక శాఖలను సంప్రదించాలని.. పీపీఏకి కూడా లేఖ రాయాలని యోచిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణమంటే.. పిల్లర్లు లేపి.. గేట్లు బిగించి.. నీటిని నిల్వ చేసి కిందకు వదలడం కాదని.. ఆఖరి నిర్వాసితుడి వరకూ పరహారం చెల్లింపు, పునరావాసం అమలు చేస్తేనే.. ప్రాజెక్టు పూర్తయినట్లని.. నీటి విడుదలకు అప్పుడే కేంద్రం అనుమతిస్తుందని జల వనరుల శాఖ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు కేంద్రమే భూసేకరణ ఖర్చును భారీగా తగ్గిస్తే పరిహారం చెల్లింపు, పునరావాసం కింద 22 వేల కోట్లకుపైగా భరించడం రాష్ట్రప్రభుత్వం వల్ల కాదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను కలవనున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఇంకోవైపు.. కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రప్రభుత్వానికి వివరించేందుకు పీపీఏ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనుంది.

Updated Date - 2020-10-23T08:27:01+05:30 IST