పోలవరం: హామీ కాదు, హక్కు

ABN , First Publish Date - 2020-11-19T06:01:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడంలో అనుసరించిన దుర్మార్గ పద్ధతినే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా కేంద్రప్రభుత్వం అవలంభిస్తోంది...

పోలవరం: హామీ కాదు, హక్కు

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టుకు ప్రామాణికం. దానికి విరుద్ధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎట్టి ఒప్పందాలు చేసుకున్నా న్యాయ స్థానం ముందు నిలబడవు. ప్రత్యేక హోదాకు మంగళం పాడే సందర్భంలో డొంక దారులు అవలంబించినట్లు పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ సాకులు చెబుతున్నారు. అందులో భాగమే సెక్షన్ 90కి లంకా దినకర్ వక్ర భాష్యాలు.


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎగ్గొట్టడంలో అనుసరించిన దుర్మార్గ పద్ధతినే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా కేంద్రప్రభుత్వం అవలంభిస్తోంది. ఒక్కసారిగా హతమార్చకుండా ‘స్లో పాయిజన్’ ఇచ్చే  అతి క్రూరమైన ఫాసిస్ట్ విధానాన్ని ప్రత్యేక హోదా అంశంలో అమలుపరిచింది. పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అంతే. నరేంద్ర మోదీ ప్రభుత్వ మోసపూరిత వైఖరిని కప్పిపుచ్చేందుకు లంకా దినకర్, (ఇప్పుడు ఏ పార్టీయో తెలియదు) పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు రాబట్టడానికి ఇప్పుడున్న చట్టనిబంధనలు సరిపోవనే సరికొత్త వాదన చేశారు. (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి ‘ పోలవరం:పోరాటాలతో ప్రయోజనం లేదు’). పైగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన అంటూ ఒక కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంతేకాకుండా, పోరాటాలతో పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టడం కుదరదని  కొన్ని ఉచిత సలహాలు కూడా దినకర్ అందించారు. ఆయన వాదనలో నిజాయితీ లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చట్టబద్ధమైన హక్కు అయిన పోలవరం ప్రాజెక్టు సాకారమయ్యేందుకు తోడ్పడదు. ఎందుకో చూద్దాం. 


2014 ఫిబ్రవరి 20న బీజేపీ నేతల ప్రోద్బలంతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి ఒక ప్రకటన చేశారు. ఆ తరువాత, కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఆ ప్రకటన విషయమై ఆయన ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించి ప్రణాళికాసంఘానికి పంపారు. 2014 మేలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ సంవత్సరాంతం వరకు మిన్నకుండిన ప్రధాని మోదీ ఉన్నపళంగా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ఏపీ ప్రత్యేక హోదాను కోల్డ్‌స్టోరేజ్‌కి చేర్చారు. మన్మోహన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయవలసిన గురుతర బాధ్యతను ఆయన విస్మరించారు. దరిమిలా ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదనే వాదనను మెల్లగా తెర మీదకు తెచ్చారు. అప్పటి వరకు ఏ రాష్ట్రానికీ చట్టం ద్వారా ప్రత్యేక హోదా అమలు చేయలేదు కదా అని నిలదీస్తే 14 వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా చేసిందని, నిధుల కేటాయింపు లేనందున ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని మోదీ సర్కార్ చెప్పింది. అలా ప్రత్యేక హోదాకు, మంగళం పాడారు. అదే సమయంలో ప్రత్యేక హోదాకు పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదని చెబుతూ 2017లో ప్రత్యేక హోదా పొందే రాష్ట్రాలకు 20 ఏళ్లకు గాను


27వేల కోట్ల రూపాయలు పారిశ్రామిక రాయితీల కింద కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో మంజూరు చేశారు. ప్రస్తుతం పోలవరం విషయంలో జరుగుతున్న సంఘటనలుపరిశీలిస్తే ప్రత్యేక హోదాకు తిలోదకాలు ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వం ఎన్నిరకాల కుంటి సాకులు వెతికిందో, పోలవరం ప్రాజెక్టును మట్టిటలో కలపడానికి అదే విధంగా వ్యవహరిస్తోందని విశదమవుతోంది. 2016లో ప్రత్యేక ప్యాకేజీ అమలు సందర్భంగా విడుదల చేసిన నోట్ను 2017లో కేంద్ర మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని కేంద్ర ఆర్థికశాఖ తెరమీదకు తెచ్చింది. తాజాగా లంకా దినకర్ ఇంకొక అడుగు ముందుకు వేసి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటనను ఒక కారణంగా చూపెట్టారు. ఇప్పుడు ఉన్న చట్టనిబంధనలను కూడా లంకా దినకర్ అర్థ సత్యాలతో నింపి మసిపూసి మారేడుకాయ చేశారు.


అదృష్టం కొద్దీ పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా లాగా ఒక హామీ కాదు. అది, నవ్యాంధ్ర ప్రజల చట్టబద్ధమైన హక్కు. ఇప్పుడున్న విభజన చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉంది. లంకా దినకర్ తన వ్యాసంలో సెక్షన్ 90(1)గురించి పచ్చి అబద్ధం చెప్పారు. సెక్షన్ 90(4)గురించి అర్థ సత్యాలు వల్లెవేశారు. తన అసంబద్ధ వాదనకు ముసుగు తగిలించేందుకు ఒకటి రెండు మూడు అంశాలంటూ ఉల్లేఖించారు. మన్మోహన్ సింగ్‌ను తెర మీదకు తేవడమంటే ఈ పాపం ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఏ పాపం ఎరుగదని చెప్పడమే. వ్యాసకర్త వాదనను పరిశీలిస్తే రాష్ట్ర విభజన చట్టంలోని 90వ సెక్షన్‌ను స్వయంగా చదివారా? లేక ఎవరైనా చెబితే విని రాశారా? లేదా ఉద్దేశ పూర్వకంగా రాశారా? అనే అనుమానం కలుగక మానదు.


ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 90లో పొందుపరిచిన అంశాల ప్రకారం నాటి కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ప్రాజెక్టులో సాగునీటి విభాగాన్ని (ఇరిగేషన్ కాంపొనెంట్) పూర్తి చేయడానికి తాను కట్టుబడి ఉన్నట్లు తెలిపిందని వ్యాసకర్త పేర్కొన్నారు.’ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (1)లో ఎక్కడైనా ఇరిగేషన్ కాంపొనెంట్ అనే పదం ఉందా? ఇంత పచ్చి అబద్ధం చెప్పడమంటే నిస్సిగ్గుగా కేంద్రప్రభుత్వాన్ని బలపర్చడమే కాదూ? రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (1)లో ‘ద పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఈజ్ హియర్ బై డిక్లేర్డ్ టు బి నేషనల్ ప్రాజెక్ట్’ అని ఉంది. ఇంతకు మించి ఆ సబ్‌సెక్షన్లలో మరో పదం లేదు. అయినా దినకర్ బరి తెగించి ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రం భరిస్తామనే విషయం ఆ చట్టంలో ఉన్నట్లు పచ్చి అబద్ధం చెప్పారు. 


ఇలాగే సెక్షన్ 90(4) గురించి కూడా దినకర్ కప్పదాటు వేశారు. ‘ప్రాజెక్టు నిర్మాణంతో పాటు పర్యావరణ అటవీశాఖ అనుమతులను సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులను తానే రాబడతానని తెలియజేసింది’ అని పేర్కొని, దానికి తన భాష్యంగా కేవలం అనుమతులు మాత్రమే రాబడుతుందనే ప్రస్తావన ఉందని వక్రీకరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాలతో కేంద్రానికి సంబంధం లేదనే అర్థసత్యాన్ని ఆయన చాటుతున్నారు.


రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (4)లో కింది విధంగా ఉంది:‘ ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ఎక్జిక్యూట్ ది ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ రిక్విజిట్ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంటల్ అండ్ రీ సెటిల్మెంట్ నామ్స్’– రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 90 (4)పూర్తి పాఠమిది. ఇంత స్పష్టంగా ఉన్నా ఇరిగేషన్ కాంపోనెంట్ అనే పదం ఎక్కడా లేకున్నా దినకర్ ఊహాజనితమైన వాదన చేశారు. ఇందులో కూడా నష్టపరిహారం పునరావాసం బాధ్యత కేంద్రప్రభుత్వానిది కాదని ఎక్కడైనా ఉందా? కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుందని (షల్ ఎక్జిక్యూట్) అన్ని అనుమతులు తీసుకువచ్చే బాధ్యత తనదేనని స్పష్టంగా చెప్పింది.  


మోదీ ప్రభుత్వం ఇప్పుడు నాటి మన్మోహన్ మంత్రి వర్గం చేసిన తీర్మానం గురించే చెబుతోంది. కేంద్ర మంత్రివర్గం తీర్మానాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. అందులో కూడా 2013 నాటి నుండి నిర్మాణ వ్యయం భరిస్తామని ఉంది తప్ప 2013 నాటి అంచనాల గురించి ప్రస్తావన లేదు. దినకర్ తన వ్యాసంలో చంద్రబాబు విడుదల చేసిన ప్రకటన గురించి ఎందుకు తప్పు పట్టలేదు? ఒకవేళ అప్పట్లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 2013 నాటి అంచనాలకు అంగీకరించి 2016 లో ఒప్పందం చేసుకుని ఉంటే ప్రస్తుత ప్రభుత్వాలు అధికారిక పత్రాలను విడుదల చేయాలి. కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం హేయమైన చర్య. ఒకవేళ అలాంటి ఒప్పందం చేసుకున్నా అది చట్ట విరుద్ధమవుతుంది. ఎందుకంటే దినకర్ చెప్పినట్లు సెక్షన్ 90 పోలవరం ప్రాజెక్టుకు ప్రామాణికం. దానికి విరుద్ధంగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా న్యాయస్థానం ముందు నిలబడవు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ 90 ఒక్కటే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ప్రత్యేక హోదాకు మంగళం పాడే సందర్భంలో డొంకదారులు అవలంబించినట్లు పోలవరం ప్రాజెక్టు అంశంలో కూడా దినకర్ విభజన చట్టం సెక్షన్ 90ని శూలశోధన చేసి వక్ర భాష్యాలు చెప్పారు. రాష్ట్ర విభజన చట్టానికి భిన్నంగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఎన్ని ఒప్పందాలు చేసుకున్నా న్యాయస్థానం ముందు నిలబడవు. 

వి. శంకరయ్య 

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - 2020-11-19T06:01:20+05:30 IST