కరుగుతున్న పోలవరం కట్ట!

ABN , First Publish Date - 2022-05-10T06:31:06+05:30 IST

రాష్ట్రానికి జీవనాడి పోలవరం కాల్వకట్ట కరుగుతోంది. కాల్వకట్ట పొడవునా యథేచ్చగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి.

కరుగుతున్న పోలవరం కట్ట!

యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు 

 స్థలాల మెరక కోసం ట్రక్కుకు రూ.వెయ్యి

 ప్రజలు, పశువులకు పొంచి ఉన్న ముప్పు 

 పట్టించుకోని అధికారులు 

విజయవాడ రూరల్‌, మే 9 : రాష్ట్రానికి జీవనాడి పోలవరం కాల్వకట్ట కరుగుతోంది. కాల్వకట్ట పొడవునా యథేచ్చగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. నున్న, పాతపాడు, కుందావారి కండ్రిక, పీ నైనవరం తదితర ప్రాంతాల నుంచి కాల్వకట్ట మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. అనుమతులు ఉన్నాయనే పేరుతో ఇష్టానుసారంగా కట్టను తవ్వి మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపున ఆరులైన్ల జాతీయ రహదారి కోసమని, మరోవైపు జగనన్న లే అవుట్‌లలోని స్థలాల మెరక కోసమని మట్టిని అక్రమంగా తరలించేస్తున్నారు. పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్నామని చెబుతూ, ట్రక్కుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నారు. లారీల్లో మట్టి కావాల్సి వస్తే, అక్రమార్కులు ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. కాల్వ కట్టను తవ్వేయడంతో పోలవరం కాల్వ రెండు వైపులా కట్టలు మాయమవుతున్నాయి. దీనివల్ల స్థానికులకు, పశువులకు ప్రమాదం పొంచి ఉందనే భయాందోళనలు వ్యక్తమవుతన్నాయి. ఎవరికి వారు ఎస్కవేటర్లతో రేయింబవళ్లు కట్టన తవ్వేస్తూ అమ్మేసుకుంటున్నా, సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. విజయవాడ రూరల్‌ మండలంలోని ఏడు గ్రామాలతోపాటు విజయవాడ అర్బన్‌కు చెందిన వారికి నున్నలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. నాలుగు లే అవుట్‌లలో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలను మెరక చేసుకుందామంటే, మట్టి దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాల్వ కట్ట మట్టి మొత్తం తవ్వేయడంతో, స్థలాల మెరకకు డిమాండ్‌ పెరుగుతోంది. దీనిని ఆసరా చేసుకుని ట్రాక్కుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వసూలు చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పోలవరం కాల్వ కట్ట మట్టిని తవ్విన చోటల్లా ఆక్రమణలు వెలుస్తున్నాయి. ఇంత జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు అధికారులు ఆ చాయలకు కూడా రావడంలేదు.

రోడ్డు నిర్మాణం చేపడితే..

పోలవరం కాల్వకుడి కట్టపై రాజమహేంద్రవరం వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో అక్కడక్కడా రోడ్డు నిర్మాణం జరగ్గా, ఆ తర్వాత పనులు ఆగిపోయాయి. మళ్లీ రోడ్డు నిర్మాణం చేపడితే మట్టి అవసరం ఉంటుంది. కనీసం ఆ విషయాన్ని కూడా పోలవరం ప్రాజెక్టు అధికారులు పట్టించుకోకుండా మట్టి తవ్వకాలకు అక్రమంగా అనుమతులు ఇచ్చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మట్టి తవ్వకాలు ఇలానే కొనసాగితే, కాల్వకట్టపై రోడ్డు నిర్మాణానికి మళ్లీ మట్టిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇంజనీర్లు వ్యాఖ్యానిస్తున్నారు.  ఇప్పటికైనా పోలవరం కాల్వకట్ట మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.


Read more