పోలవరం భూసేకరణ ఖర్చులో.. భారీ కోత!

ABN , First Publish Date - 2020-09-23T10:13:33+05:30 IST

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో కేంద్రప్రభుత్వం భారీగా కోతపెట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లకు ఆమోదించిన కేంద్ర జలశక్తి శాఖ..

పోలవరం భూసేకరణ ఖర్చులో.. భారీ కోత!

7,931 కోట్లకు కేంద్రం కత్తెర

అంచనా వ్యయం 47,725 కోట్లకే ఆమోదం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పోలవరం ప్రాజెక్టు భూసేకరణ వ్యయంలో కేంద్రప్రభుత్వం భారీగా కోతపెట్టింది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.47,725.74 కోట్లకు ఆమోదించిన కేంద్ర జలశక్తి శాఖ.. భూసేకరణ ఖర్చులో రూ.7,931.24 కోట్ల మేర కోత విధించింది. భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం ప్రతిపాదించిన ధరలపై తొలి నుంచీ ఈ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా తన మాట నెగ్గించుకుంది. భూసేకరణ సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.33,168.23 కోట్లు అంచనా వేయగా.. రూ.28,172.21 కోట్లకు మాత్రమే పరిమితం చేసి.. రూ.4,996.24 కోట్ల మేర కత్తెర వేసింది. అదేవిధంగా కుడి ప్రధాన కాలువ డిజైన్ల మేరకు భూసేకరణ, నిర్మాణ పనులు అక్కర్లేదంటూ రూ.1,453.33 కోట్లు తగ్గించేసింది. ఎడమ ప్రఽధాన కాలువ డిజైన్ల ప్రకారం సేకరించిన భూమి, కాంక్రీట్‌ పనులు అవసరం లేదంటూ రూ.1,481.89 కోట్లు తీసేసింది. దీంతో మొత్తంగా భూ సేకరణ వ్యయంలో రూ7,931.13 కోట్ల మేర కోత విధించినట్లయింది. రివర్స్‌ టెండర్‌ విధానం వల్ల రూ.780 కోట్లు ఆదా అయినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. ఆ లెక్కలు జలశక్తి శాఖ గణాంకాల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.


జగన్‌ సర్కారు మౌనం

వాస్తవానికి 2019 ఫిబ్రవరిలో రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని సాంకేతిక సలహా మండలి (టీఏసీ) ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని జగన్మోహన్‌ గుప్తా నేతృత్వంలోని కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో సమావేశమై.. భూసేకరణ చెల్లింపులకు భారీగా కత్తెర వేస్తూ రూ.47,725.74 కోట్ల అంచనాలకు అంగీకరించింది. అయితే 2017-18లో రాష్ట్ర జల వనరుల శాఖ పంపిన లెక్కల్లో హెడ్‌వర్క్స్‌కు రూ.9,734.34 కోట్లు.. జల విద్యుత్కేంద్రం అంచనా వ్యయం రూ.9,734.34 కోట్లను మాత్రం యథాతథంగా ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కి రూ.108 కోట్లు చెల్లించాలని.. దీనిని కూడా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో ప్రధానాంశమైన భూసేకరణ వ్యయానికి భారీ కోత విధిస్తున్నట్లుగా ఫిబ్రవరిలోనే కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం నుంచి రావలసిన రూ.1,850 కోట్లు చెల్లించాలంటే.. రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయాన్ని అంగీకరించాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖ షరతు విధించింది.


కావాలంటే తర్వాత అంచనాలను సవరించుకోవచ్చని గుప్తా కమిటీ  చేసిన సూచనకు జగన్‌ ప్రభుత్వం అంగీకరించడంతో.. రూ.1,850 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేసింది. అనంతరం భూసేకరణ వ్యయంలో భారీ కోత పెట్టినా జగన్‌ సర్కారు మౌనంగా అంగీకరించింది. తాజాగా ఈ విషయాలు బహిర్గతం కావడంతో.. జరిగిన అన్యాయంపై ప్రభుత్వ వర్గాలే గాక నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నాయి.



Updated Date - 2020-09-23T10:13:33+05:30 IST