Abn logo
Oct 20 2021 @ 01:12AM

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట

సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

  • పోలవరం నిధుల కోసం నవంబరులో పోరాట కార్యాచరణ
  • రాష్ట్ర అప్పులపై వెంటనే శ్వేతపత్రం ప్రకటించాలి
  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 19: ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబాట కార్యాచరణతో సమర శంఖారావం పూరిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడించారు. ప్రజాసమస్యల పరిష్కారంకోసం రానున్న కాలంలో చేపట్టబోయే ఉద్యమాలకు సీపీఐ పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాజమహేంద్రవరం వై.జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో సీపీఐ శాఖ కార్యదర్శుల వర్కుషాప్‌ నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు కార్మిక, రైతు, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరానికి రావాల్సిన నిధులు రాబట్టడంలోనూ సీఎం విఫలమయ్యారని విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు శాఖల నిర్మాణ నివేదికను విడుదల చేశారు. నల్లా రామారావు, తోకల ప్రసాద్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రవి అధ్యక్షవర్గంగా జరిగిన వర్కుషాపులో రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు టి.అన్నవరం, కూండ్రపు రాంబాబు, చెల్లుబోయిన కేశవశెట్టి, దేవ రాజేంద్రప్రసాద్‌, సత్తిబాబు పాల్గొన్నారు.