Abn logo
Feb 28 2021 @ 03:33AM

పోలవరంపై ‘కూటమి’ కుట్ర!

పరిహార భారం తగ్గించుకునేందుకు ఎత్తు తగ్గించే యోచనలో జగన్‌

అందుకు బీజేపీలో ఒక వర్గం సహకారం

ఢిల్లీలో వెదిరె శ్రీరామ్‌ ప్రయత్నాలు

ఆయన భార్యకు రాష్ట్ర ప్రభుత్వ పదవి

‘ఏబీఎన్‌’ డిబేట్‌లో వక్తల ధ్వజం


అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు... ఇలా ఆంధ్రప్రదేశ్‌ ఆత్మగౌరవానికి, అభివృద్ధి చిహ్నాలు ఒక్కొక్కటిగా చిక్కుల్లో పడుతుండగా... వాటిని కాపాడుకోవాల్సిన బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? సమస్యలు పరిష్కరిస్తున్నారా? లేక... కొత్త సమస్యలు సృష్టిస్తున్నారా? రాష్ట్రంలో అధికారపక్షమైన వైసీపీలో అనధికార ‘కూటమి’ కట్టి తెరవెనుక ఎలాంటి తతంగం నడుపుతున్నారు? ఈ అంశాలపై శనివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన చర్చలో పాల్గొన్న నిపుణులు ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తిలేదని బీజేపీ నేతలు చెబుతుండగా... మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ శిల్పారెడ్డి భర్త, తెలంగాణ బీజేపీ నేత అయిన కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామి రెడ్డి ద్వారా ప్రాజెక్టు ప్రయోజనాలకు గండికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘‘ఎత్తు తగ్గించి పరిహార భారం తగ్గించుకోవాలని రాష్ట్ర సర్కారు ఆలోచన. అయితే, ఈ దశలో డిజైన్లను మార్చడం కుదరదని కేంద్ర జలసంఘం స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ... జగన్‌ సర్కారు తరఫున వెదిరే శ్రీరామ్‌ ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గం కూడా సహకరిస్తోంది’’ అని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంపై బీజేపీ ఎందుకు బుసలు కొడుతోంది? ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా అభివర్ణించే పోలవరం ప్రాజెక్టును బ్యారేజీ స్థాయికి తగ్గించే ప్రయత్నాలకు ఎందుకు సహకరిస్తోంది? కేంద్ర జలసంఘం అంగీకరించినప్పటికీ... పోలవరం ఎత్తుపై వెదిరె శ్రీరామ్‌ ఎందుకు సమీక్షిస్తున్నారు? ఈ అంశాలపై ‘ఏబీఎన్‌’ నిర్వహించిన చర్చలో నిపుణులు ఏం చెప్పారంటే...


శ్రీరామ్‌ భార్యకు పదవి ఎందుకిచ్చారు?

‘పోలవరం ఎత్తు రెండు, మూడు మీటర్లు తగ్గిస్తే ఏమవుతుంది. ఏపీ సీఎంతో మాట్లాడాను. ఆయన కూడా ఒప్పుకున్నారు’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. డాక్టర్‌ శిల్పారెడ్డి ఏ సలహాలూ ఇవ్వకున్నా వెదిరే శ్రీరామ్‌ కోసం ఆమెకు పదవి ఇచ్చారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సమ్మతించిన తర్వాత కూడా పోలవరం అంచనా వ్యయం 55,548కోట్ల నుంచి ఇప్పుడు ఎందుకు తగ్గుతోంది. తెలంగాణలో రాజకీయపరమైన లబ్ధి కోసం ఒక వర్గమైన బీజేపీ నేతలు కుట్ర చేస్తున్నారు. ఎత్తు తగ్గితే భవిష్యత్తులో నీటినిల్వ, కేటాయింపులపై ప్రభావం పడుతుంది. ముఖ్యమంత్రి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారా? తెలంగాణలో తనకున్న వేలకోట్ల రూపాయల ఆస్తులు కాపాడుకోవడానికి...గోదావరి జలాలను వాళ్ల భూభాగం ద్వారా తరలించేందుకు ప్రగతి భవన్‌లో తలూపి వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేతులు కలిపేందుకు జగన్‌ సిద్ధపడ్డారు.

- టీడీపీ అధికార ప్రతినిధి, పట్టాభిరామ్‌


కిమ్మనని జగన్‌..

పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్‌ను ఒప్పించానని గత ఏడాది తెలంగాణ అసెంబ్లీలోనే ఆ రాష్ట్ర ముఖ్యమ్రంతి కేసీఆర్‌ ప్రకటించారు. దీనిపై జగన్‌ స్పందించనేలేదు. పోలవరం ఎత్తు 150 అడుగుల నుంచి 135 అడుగులకు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారు. పోలవరంపై కుట్ర చేస్తున్న శ్రీరామిరెడ్డి భార్యను సలహాదారుగా ఎందుకు నియమించారు? నిపుణుల కమిటీ పోలవరం డీపీఆర్‌ ఆమోదించినా ఆర్థిక శాఖ ఆమోదం ఎందుకు పొందలేకపోయారు? ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే శిల్పారెడ్డిని సలహాదారు పదవి నుంచి తొలగించాలి. పోలవరాన్ని చంపేసి... పోతిరెడ్డిపాడు కోసం వేల కోట్లు అప్పులు చేసి విస్తరించడం ఎందుకు? నీరే లేనప్పుడు నిర్మాణాలెందుకు?

- లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు


వదిలే ప్రసక్తి లేదు!

కేంద్రం దగ్గర డబ్బులు లేవా? ఒక జాతీయ ప్రాజెక్టుకు ఏడు వేల కోట్లు ఇవ్వలేరా? ఏదో ఒక కొర్రీ పెట్టి పోలవరాన్ని ఆపేయాలన్నదే లక్ష్యం. ఒకసారి ఖరారు చేసిన ప్రాజెక్టు ఎత్తుపై సమీక్ష చేసే అధికారం ఎవరికీలేదు. నిర్మాణం ఆలస్యం అయ్యేకొద్దీ ధరలు పెరుగుతాయి. ముఖ్యమంత్రులకు అవేవీ తెలీకుంటే ఎలా? ప్రత్యేక హోదా విలువ రూ.12 లక్షల కోట్లు. ఇదేమన్నా తక్కువా? స్టీల్‌ ప్లాంట్‌ ఎవడబ్బ సొమ్మని విక్రయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల్ని వదులుకొనే ప్రసక్తేలేదు. పోలవరం ఎత్తు తగ్గించేవాళ్ల ఇంటి ముందు సాధువులతో కలిసి కూర్చుంటా? దమ్ముంటే తట్టుకోమనంది!

-జీవీఆర్‌ శాస్త్రి, అమరావతి పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు


హక్కులపై అడుక్కోవడమా?

పోలవరానికి రావాల్సిన అనుమతులన్నీ 2014 నాటికే వచ్చేశాయి. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లకంటే అంగుళం కూడా తగ్గదని, 2022 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తామని జగన్‌ చెప్పారు. చివరికి... విభజన చట్టంలో ఉన్న పోలవరాన్ని అడక్కుండా అడుక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు.   

- సత్య, జనసేన అధికార ప్రతినిధి

Advertisement
Advertisement
Advertisement