పొలం బడి..మొక్కుబడి

ABN , First Publish Date - 2022-08-06T04:53:33+05:30 IST

సంక్షోభిత వ్యవసాయంలో రైతులు లాభాల తీరం చేరాలంటే అవగాహన అవసరం. రైతులు సాగు వ్యయం తగ్గించుకోవాలి.

పొలం బడి..మొక్కుబడి

  1. ఏడాదిగా విడుదల కాని నిధులు
  2. కాగితాల్లోనే కేటాయింపులు 
  3. తల పట్టుకుంటున్న ఆర్‌బీకేల అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు 

కర్నూలు(అగ్రికల్చర్‌):  సంక్షోభిత వ్యవసాయంలో రైతులు లాభాల తీరం చేరాలంటే అవగాహన అవసరం. రైతులు సాగు వ్యయం తగ్గించుకోవాలి. అధికోత్పత్తి సాధించాలి. దీనికి శాస్త్రీయ వైఖరి ఉండాలి. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేదాకా సలహాలు, సూచనలు అవసరం. దీని కోసం ప్రభుత్వం పొలం బడి పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.  వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతో మాట్లాడి మార్గదర్శకత్వం వహించాలి. కానీ   వైసీపీ అధికారంలోకి వచ్చాక పొలం బడికి నిధులు ఇవ్వడం లేదు. గత ఏడాది  ఖరీఫ్‌,  రబీలలో నిర్వహించిన పొలం బడి కార్యక్రమం  బిల్లులు ఇప్పటికీ మంజూరు కాలేదు.  ఇది పొలంబడి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.

వ్యవసాయ రంగంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చే పొలం బడి పథకం వైసీపీ ప్రభుత్వంలో మొక్కుబడిగా మారింది. దాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.90 లక్షల దాకా పొలం బడి బిల్లులు పెండింగ్‌ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.   ప్రస్తుత ఖరీఫ్‌ సీజన నుంచి ఈ పొలం బడి కార్యక్రమానికి బడ్జెట్‌ను రెండింతలు చేశారు. గత సంవత్సరం వరకు పొలం బడి  నిర్వహణకు రూ.9లక్షలు కేటాయించగా.. ఈ సంవత్సరం ఖరీఫ్‌ నుంచి ఈ బడ్జెట్‌ను రూ.20,514కు పెంచారు. ప్రతి ఆర్‌బీకే పరిధిలో ఈ పొలంబడిని తప్పనిసరిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం కేటాయించిన రూ.20,514లను ముందుగానే విడుదల చేస్తే.. తాము ఈ కార్యక్రమాన్ని రైతుల సమక్షంలో వారికి అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందని, నిధులు విడుదల చేయకుండా మొదట మీరు ఖర్చు చేయండి.. తర్వాత బిల్లులు పెడితే.. మేము ఇస్తామని ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని ఆర్‌బీకేల అసిస్టెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పొలంబడి కార్యక్రమానికి డా.వైఎస్సార్‌ పొలంబడిగా మార్పు చేశారు. 2020-21 సంవత్సరంలో ఖరీఫ్‌లో 1,290 పొలంబడులు, అదే విదంగా రబీలో 399 పొలం బడులు నిర్వహించారు. 2021-22 సంవత్సరం ఖరీఫ్‌లో 848 పొలం బడులు, రబీలో 696 పొలం బడులను నిర్వహించారు.  ఈ సంవత్సరం ప్రస్తుత ఖరీఫ్‌లో 460 పొలం బడులు, రబీలో 411 నిర్వహించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతి ఆర్‌బీకే కేంద్ర పరిధిలో వీటిని నిర్వహించాల్సి ఉంది. అయితే గత సంవత్సరం రబీలో నిర్వహించిన 696 వైఎస్సార్‌ పొలం బడి కార్యక్రమానికి సంబంధించి ఇప్పటిదాకా బిల్లులు మంజూరు చేయలేదు. కొన్ని నియోజకవర్గాల్లో ఖరీఫ్‌లో నిర్వహించిన పొలం బడులకు బిల్లులు రాలేదని అధికారులు చెబుతున్నారు. 

పొలం బడి నిర్వహణ ఇలా..

  సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు వ్యవసాయం చేయడానికి  వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు  నేరుగా  పొలాలకే వెళ్లి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలి. వ్యవసాయంలో వస్తున్న అవరోధాలు వారితో చర్చించాలి. వాటిని ఎలా విధంగా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. ఇందు కోసమే పొలం బడి కార్యక్రమాన్ని దశాబ్ద కాలంగా అమలు చేస్తున్నారు. పది హెక్టార్ల పరిధిలో 30 మంది రైతులను కూడగట్టి ఒక రైతు పొలాన్ని పొలం బడి కార్యక్రమం నిర్వహణకు ఎంచుకుంటారు.  ఆ సీజనలో వచ్చే  తెగుళ్లు, కీటకాలను ఎలా నివారించాలి?   రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ విధానంలో అధికోత్పత్తి ఎలా సాధించాలి? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. చెప్పడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం ఈ పొలంబడి కార్యక్రమాన్ని రైతుల చెంతకు తీసుకెళ్లలేకపోతున్నారు. గత సంవత్సరం వరకు ఈ పొలం బడికి రూ.9వేలు కేటాయించారు. అయితే ఆ డబ్బులు ఏ మాత్రం చాలవని వ్యవసాయాధికారులు ప్రభుత్వం ప్రస్తుత ఖరీఫ్‌ సీజన నుంచి ఒక్కో పొలంబడి నిర్వహణకు రూ.20,514లను కేటాయిస్తూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. 

దేనికి ఎంతంటే..

పొలంలో 75 శాతంతో బయోపెస్టిసైడ్స్‌ మొదలైన వాటి వినియోగానికి రూ.5,500 కేటాయించారు. రైతులకు అవసరమైన పనిముట్ల కోసం రూ.1000, మరో రూ.1000 పొలంబడి ప్రదేశంలో బోర్డు, శిక్షణకు అవసరమైన మెటీరియల్‌, ఫొటోలు మొదలైన వాటికి  ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.3,500 ఐబీఎం పరికరాలు, మీటింగుకు హాజరైన రైతులకు స్వీట్లు, టీ, రిజిస్టర్లకు ఖర్చు చేసేందుకు వినియోగించాలి. మరో రూ.1,800 ఇద్దరు శిక్షణ ఇచ్చే వారికి కేటాయించాలి.  14 వారాల పాటు నిర్దేశించిన పొలంలో తరచుగా పరిశీలించేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేందుకు రూ.5,040 వాడాలి. మిగిలిన రూ.2,674లను పొలంబడికి ఎంచుకున్న రైతుకు చెల్లించాలి. ఈ కేటాయింపులు కాగితాల్లో చూసేందుకు బాగానే ఉన్నా.. ఇవన్నీ ప్రస్తుతం ఆర్‌బీకేల అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు మాత్రమే ముందుగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో తాము ఎక్కడి నుంచి ముందుగా డబ్బులు తెచ్చి చెల్లించాలని వారు ప్రశ్నిస్తున్నారు.

అంతా మొక్కుబడే: 

ఈ సంవత్సరం ఖరీఫ్‌, రబీ సీజన్లలో పెద్ద ఎత్తున వైఎస్సార్‌ పొలం బడి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఖరీఫ్‌లో 460 ఆర్‌బీకేలు, రబీలో 411 ఆర్‌బీకేలు ఉమ్మడి జిల్లా పరిధిల్లో నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువే ఈసారి రూ.20,514 కేటాయించినందున రైతుల పొలంలోనే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే.. వీటి నిర్వహణ, పర్యవేక్షణ ఏడీఏ స్థాయి నుంచి మండల వ్యవసాయాధికారులే చూడాల్సి ఉంది. చాలా వరకు ఆర్‌బీకేల పరిధిలో జరుగుతున్న ఈ పొలంబడుల నిర్వహణను గత సంవత్సరం నుంచి కేవలం ఆ కేంద్రాల అగ్రికల్చర్‌ అసిస్టెంట్లే చేపడుతున్నారు. ఏడీఏలుగానీ, మండల వ్యవసాయాధికారులు గానీ ఈ పొలంబడుల వైపు కన్నెత్తి చూడడం లేదని రైతుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ పొలంబడుల నిర్వహణ మండల వ్యవసాయాధికారులే చూసేవారు. అప్పట్లో వీటిని నిర్వహించకున్నా.. బిల్లులు మాత్రం ప్రభుత్వానికి పంపి నిధులు స్వాహా చేశారని ఆయా గ్రామాల రైతుల నుంచి పెద్ద ఎత్తున  ఆరోపణలు వినిపించాయి. మరోవైపు ఈ సంవత్సరం నుంచి వైఎస్సార్‌ పొలంబడి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను విడుదల చేసే అవకాశం లేదని తెలుసుకున్న మండల వ్యవసాయాధికారులు, ఏడీఏలు వీటి బాధ్యతను ఆర్‌బీకేలలోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్లకే వదిలిపెట్టేశారు. తాము పొలం బడి నిర్వహణకు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు చేయాలని ఆర్‌బీకేల అసిస్టెంట్లు లబోదిబోమంటున్నారు. వీటిని నిర్వహించకుంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 

పొలం బడి కార్యక్రమం నిర్వహణ వివరాలు: 

----------------------------------------------------------------

సంవత్సరం ఖరీఫ్‌ రబీ

పొలం బడుల సంఖ్య  పొలం బడుల  సంఖ్య 

----------------------------------------------------------------

2020-21 1290  399

2021-22 848 696

2022-23 లక్ష్యం  460 411

----------------------------------------------------------------


పొలం బడులను సక్రమంగా నిర్వహిస్తాం..

- వరలక్ష్మి, జిల్లా వ్యవసాయాశాఖ అధికారి: 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డా.వైఎస్సార్‌ పొలం బడి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌ను కూడా రెట్టింపు చేసింది. అందువల్ల పెద్దగా ఇబ్బందులు ఉండకపోవచ్చు. గతంలో మాదిరి కాకుండా నిధులను కూడా వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఈ పొలం బడుల నిర్వహణ ఆర్‌బీకేల పరిధిలోనే జరుగుతుంది. వీటిని సక్రమంగా నిర్వహించేందుకు, రైతుల్లో అవగాహన పెంచేందుకు ఏడీఏలు, మండల వ్యవసాయాధికారులు తప్పనిసరిగా బాధ్యతలు తీసుకోవాలి.


Updated Date - 2022-08-06T04:53:33+05:30 IST