సరిహద్దులో వాయుసేన శిబిరం..పాక్-చైనాకు చెక్..!

ABN , First Publish Date - 2020-09-27T15:28:05+05:30 IST

ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన చాలా పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి.

సరిహద్దులో వాయుసేన శిబిరం..పాక్-చైనాకు చెక్..!

లద్దాఖ్: ఈ ఏడాది ఆరంభం నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన చాలా పత్రికలు పలు కథనాలు ప్రచురించాయి. ఒకవేళ యద్ధమే వస్తే భారత్‌పై చైనాతోపాటు పాకిస్తాన్ కూడా దాడి చేస్తుందని, దాంతో భారత్ ఉక్కిరిబిక్కిరి అయిపోతుందని సదరు చైనా పత్రికలు పేర్కొన్నాయి. అయితే ఈ బెదిరింపులను భారత్ అసలు పట్టించుకోవడం లేదు. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో ప్రాణనష్టం జరగడంతో ఇక డ్రాగన్‌ను ఎంతమాత్రం ఉపేక్షించరాదని భారత ప్రభుత్వం, సైన్యం నిర్ణయించుకున్నాయి.


ఒకవేళ చైనాతో యుద్ధమే వస్తే దీటుగా స్పందించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ సిద్ధంచేసుకుంటోంది. ఈ క్రమంలోనే పీవోకే, చైనా సరిహద్దుల్లో భారత వాయుసేన ఓ ఫార్‌వర్డ్ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేసి పహారా కాస్తోంది. ఈ శిబిరం పాక్‌కు కేవలం 50కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అలాగే వ్యూహాత్మకంగా ముఖ్యమైన దౌలత్ బేగ్ ఓల్డీకి కేవలం 80కిలోమీటర్ల దూరంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాక్, చైనా రెండూ కలిసి దాడి చేసినా దీటుగా ఎదుర్కునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వాయుసేన స్పష్టంగా ప్రకటించింది కూడా.


భారత్-చైనా దళాల మధ్య గల్వాన్ నదీ తీరంలో ఘర్షణ జరిగింది. ఈ నది కొంత దూరం ప్రవహించిన తర్వాత ష్యాక్ నదిలో కలుస్తుంది. ఈ ష్యాక్ నదీతీరంలో ఉన్న ఖర్దూంగా పాస్‌లోనే భారత వాయుసేన ఫార్వర్డ్ శిబిరం ఏర్పాటు చేశారు. ఇక్కడ సు-30ఎమ్‌కేఐ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్టులు ఎగరడానికి 24గంటలూ రెడీగా ఉన్నాయట. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ కోసం సీ-130జే సూపర్ హెర్క్యూలిస్, ఇయూషిన్-76, ఆంటన్-32 వంటి ప్లేన్స్‌ ఉన్నాయి.


చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ శిబిరం 24గంటలూ పహారా కాస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. రాత్రి, పగలూ రెండు పూట్లా గస్తీ తిరుగుతోందని అధికారులు చెప్పారు. అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా సైనిక బృందాలు, ఆహార పదార్థాలు, ఆయుధ సామగ్రి వంటివి తీసుకెళ్లి తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఎల్‌వోసీ వెంబడి ఉన్న సైనిక శిబిరాలకు చేరుస్తున్నాయి.


చైనా, పాకిస్తాన్ ఏక సమయంలో దాడి చేస్తే భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది? అని వాయుసేన ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. తాము పూర్తి శిక్షణ తీసుకొని ఉన్నామని, రెండు వైపుల నుంచి దాడి జరిగినా దీటుగా బదులిస్తామని వాళ్లు స్పష్టంచేశారు. దేశ కీర్తి ఆకాశాన్ని తాకాలనే భారత వాయుసేన సిద్ధాంతాన్ని అనుసరించే తాము జీవిస్తామని, అదే తమకు స్ఫూర్తి అని చెప్పారు.


ఏ దేశ వాయుసేనకైనా రాత్రి పూట చేసే ఆపరేషన్లు కష్టమే. ఈ విషయంలో కూడా భారత వాయుసేన పూర్తి సంసిద్ధతతో ఉందని ఐఏఎఫ్ అధికారులు స్పష్టంచేశారు. గతంతో పోల్చుకుంటే దేశ యుద్ధ సామర్ధ్యం చాలా మెరుగైందన్న అధికారులు.. పగలు, రాత్రితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఆపరేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మిషన్స్ కోసం ఫార్వర్డ్ శిబిరం నుంచి ఏ క్షణమైనా కదిలేందుకు వాయుసేన రెడీగా ఉందని తేల్చిచెప్పారు.


జూన్ మాసంలో చైనాకు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఓ పాక్‌ ఎయిర్‌బేస్‌కు రావడంతో భారత వాయుసేన అప్రమత్తమైంది. పాక్‌పై కూడా నిఘా పెంచింది. ఈ చైనా విమానం గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని స్కార్డు ప్రాంతంలో ల్యాండయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ష్యాక్ నదీతీరంలో వాయుసేన ఫార్వర్డ్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డే-నైట్ ఆపరేషన్స్‌ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. 

Updated Date - 2020-09-27T15:28:05+05:30 IST