పొగమంచు దిగులు

ABN , First Publish Date - 2021-12-27T06:01:02+05:30 IST

డిసెంబర్‌ నెల రెండుగంటల రాత్రి ఒంటేలు పోసుకుందామని ఆరు బయటకు రాగానే కనిపించింది ఎప్పుడో...

పొగమంచు దిగులు

డిసెంబర్‌ నెల రెండుగంటల రాత్రి

ఒంటేలు పోసుకుందామని

ఆరు బయటకు రాగానే కనిపించింది

ఎప్పుడో... ఎక్కడో చూసినట్లనిపించిన

శీతాకాలపు రాత్రి ‘చలి’.

‘నిన్నెక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు’

అన్నాను

‘చాన్నాళ్ల క్రితం నగరానికి వెళ్లినపుడు

ఆదివారపు ఫుట్‌పాత్‌ పాత పుస్తకాల సంతలో

నీకు దొరికిన అనువాద కథల పుస్తకంలో-

ఒక కథలోని రాత్రి వీధిలో నన్ను చూసావు’

అంది చలి.

పొరలు పొరలుగా జ్ఞాపకం వచ్చిందా

ఆ అద్భుతమైన కథ.

ఏంలేదు-

భరించలేని ఒంటరితనపు

అస్తిత్వ అగాధ వంతెనపై నడుస్తున్న యాత్రలో

కాళ్లకింద కమ్ముకున్న

చేదు జ్ఞాపకాల శీతల రాత్రుల్ని

మిణుగురుల వెలుతురులో దాటిన

ఒక మనిషి కథ అది.

అప్పుడు ఆ చలిని కళ్లతో చూసాను

ఇప్పుడు అదే చలిని

చర్మపు చక్షువులతో చూస్తున్నాను

ఆ పుస్తకం ఎప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నానో

మాత్రం జ్ఞాపకం లేదు

ఖీ ఖీ ఖీ

వచ్చినపని అయిపోయినట్లు

మరో కళాత్మక ధన్యతను వెదుక్కుంటూ

ఎటో బయలుదేరిందా చలి.

నక్షత్రాల కింద ఒంటేలు పోసుకొని

ఒంటరి నా గదిలోకి వెళ్లాక అనిపించింది

‘ఎన్నో ఏళ్లు గడిచిపోయాక

ఈ శీతలరాత్రి ఆ కథలోని చలి

పుస్తకంలోంచి నడిచివచ్చినట్లుగా వచ్చి

నా కోసం ఇంటిముందు

ఎందుకు తచ్చాడిందో’ అని.

ఖీ ఖీ ఖీ

తెల్లవారు ఝామున నాకు...

నా హృదయాన్ని నిశ్శబ్దంగా చుట్టుకునే

పొగమంచు దిగులు-

గదిలో ఇంకా చదవకుండా మిగిలిపోయిన

పాత పుస్తకాల్లోని కొన్ని పేజీలమీద పడుతోన్న

లేత సూర్యకిరణాలతో

కొత్తగా స్నేహం చేసినట్లు కలొచ్చింది

భగవంతం

Updated Date - 2021-12-27T06:01:02+05:30 IST