కవిత్వపు నీటిపుట్ట భళ్లున పగిలిపోయింది

ABN , First Publish Date - 2020-11-23T06:46:17+05:30 IST

పైకి ఏమీ పట్టించుకోనట్టు ఉండే ఈ కవిలో ఇన్ని ఎలా సిద్ధించాయి అంటే, అది నిత్యం లోపల రగిలే నిప్పు- అది కవిత్వమా! జర్నలిజమా! సినిమాయా! ప్రయోగమా! కాదు...

కవిత్వపు నీటిపుట్ట భళ్లున పగిలిపోయింది

పైకి ఏమీ పట్టించుకోనట్టు ఉండే ఈ కవిలో ఇన్ని ఎలా సిద్ధించాయి అంటే, అది నిత్యం లోపల రగిలే నిప్పు- అది కవిత్వమా! జర్నలిజమా! సినిమాయా! ప్రయోగమా! కాదు వీటన్నిటినీ మించి వాటిని తాను సాధించ గలననే ఒక ధీమా!


‘‘అడవీ/ నువ్వంటే నాకిష్టం/ రేపటి దేశానికి/ ఈనాటి తల్లివి నువ్వు/ రేపటి ఆకాశానికి/ ఈనాడే పూసిన సూర్యపుష్పానివి నువ్వు’’ అంటూ దేశ భవిష్యత్తును కాంక్షించిన అమ్మచెట్టు నిలువునా కూలిపోయింది. కవిత్వపు నీటిపుట్ట భళ్లున పగిలిపోయింది. తుపానుతుమ్మెద తీరం దాటిపోయింది. చివరికి పిట్ట కూడా ఎగిరి పోయింది. శనివారం హైదరాబాద్‌లో తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన దేవిప్రియ, పైన తన కవిత్వంలో చెప్పిన అన్నీ తనే అయి మౌనంగా వెళ్లిపోయాడు. మౌనంగా, ముభావంగా, పలకరిస్తే తప్ప పలకనట్లుండే దేవిప్రియ లోలోపల చెట్లున్నాయి, నీటిపుట్టలున్నాయి, గంధకుటిలున్నాయి, అరణ్యాలున్నాయి, గాలిరంగులున్నాయి, చేపచిలుకలున్నాయి, వీటన్నిటితో దాదాపు నలభై దశాబ్దాల తెలుగు పాత్రికేయ, సాహిత్య, సినీ, కళారంగాలలో ఒక బలమైన ముద్ర వేశాడు దేవిప్రియ. 


గుంటూరు జిల్లా తాడికొండలో పుట్టిన దేవిప్రియ, నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే ప్రజావాహిని పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు- అక్కడ మొదలైన దేవిప్రియ పాత్రికేయ వ్యక్తిత్వం వికసించి ‘ప్రజాతంత్ర’ వార పత్రికలో శ్రీశ్రీ చేత ఆత్మకథ రాయించడం, అది సంచలనాలకు గురికావడం, ‘అనంతం’ ఆత్మచరిత్రాత్మక కథనం పేరుతో పుస్తకంగా రూపొందడం అందరికీ తెలిసిందే. కవిత్వాన్ని, పాత్రికేయ వృత్తిని జోడుగు ర్రాల్లా స్వారీ చేసిన కవి మరొకరు కనిపిం చరు. ‘‘నాకు రెండు నిధులున్నాయి/ నాలుక మీద కవిత్వం/ తల మీద దారిద్య్రం/ నాకు రెండు విధులున్నాయి/ కవిత్వ నిత్య నిబద్ధం/ దారిద్య్ర విముక్తి యుద్ధం’’ అని ‘నీటిపుట్ట’లో ప్రకటించిన దేవిప్రియ చివరి శ్వాస వరకు ఆ రెంటి మీద యుద్ధం ప్రకటించాడని, ఆయన రచనలు, వృత్తి జీవితం, నిబద్ధత తెలియ చెప్తాయి. వజ్రానికి బహుకోణాలు ఉన్నట్టు దేవిప్రియ సాహితీ, వృత్తిగత, వ్యక్తి జీవితంలో అనేక పార్శ్వాలు తళుక్కున మెరుస్తాయి. అవేమీ ఆయనకు అలవోకగా సిద్ధించినవి గావు. ఎప్పటికప్పుడు తనను తాను వాటి కోసం సిద్ధం చేసుకుంటూ, అందివచ్చినప్పుడు సంతృప్తిపడీ, కలిసిరానప్పుడు నిర్వే దపడీ కాకుండా ఒక స్థితప్రజ్ఞత్వంతో దాన్ని సాధించుకున్నాడు.


పైకి ఏమీ పట్టించుకోనట్టు ఉండే ఈ కవిలో ఇన్ని ఎలా సిద్ధించాయి అంటే, అది నిత్యం లోపల రగిలే నిప్పు- అది కవిత్వమా! జర్నలిజమా! సినిమాయా! ప్రయో గమా! కాదు వీటన్నిటినీ మించి వాటిని తాను సాధించగలననే ఒక ధీమా! ఒక నమ్మకం! ఒక విశ్వాసం! అది దేవిప్రియ కలిగి ఉండటమే కాదు, దశాబ్దాల తెలుగు సాహితీ కళా ప్రపంచాలకు కలిగించాడు, నిరూపించాడు. ఆయన సినిమా ప్రయత్నాల జయాపజయాలను పక్కనపెడితే, ప్రజావాగ్గేయకారుడు గద్దర్‌ మీద రూపొందించిన ‘ప్రజాయుద్ధనౌక గద్దర్‌’ లాంటి డాక్యుమెంటరీ మళ్లీ మళ్లీ మనం నిర్మించుకోగలమా అనిపిస్తుంది. ఒక పక్క కవిత్వంలో ‘అమ్మ చెట్టు’ నుండి మొదలుపెట్టి... ‘ఇంకొకప్పుడు’ వరకూ దాదాపు పది సంపుటాల కవిత్వంలో దేవిప్రియ రాసింది ఎప్పుడూ తుడవ లేదు. పైగంబర కవులతో ప్రారంభం అయిన ఆయన కవితా ప్రస్థానం సమాజంలోని అన్ని గాలులను సాదరంగా ఆహ్వానించింది. తొలి నుండీ కవిత్వంలోనూ, జీవితంలోనూ వామ పక్షానికి రెక్కచాపిన దేవిప్రియ అస్తిత్వ ఉద్యమాల ఉరవడిలో తనూ లోప లికి చూసుకోక తప్పలేదు. ‘‘రంజానంతా నాకు/ ఖసీదాలు పాడుకుంటూ/ తప్పెట వాయించుకుంటూ/ తొలి వెలుగు కంబలి కప్పుకుని/ మా అమ్మమ్మ ఇచ్చే హిదియా కోసం వేచి వుండే ఫకీరు’’ నుండి 1990ల నాటి బాబ్రీ విధ్వంసం తర్వాత ‘‘బాబ్రీ మసీదు/ ఇప్పుడొక రెక్కలు విరిచిన ప్రాంతం/ కుప్పకూలిన చోటే కునారిల్లుతున్న/ శతాబ్దాల శిథిల శకలాలు/ రాజకీయ చరిత్రగా మారిన/ ఆధ్యాత్మిక పరంపర’’ అనడం ఆయనలోని రాజకీయ చైతన్యానికి ప్రతీక. శ్రీశ్రీ తర్వాత కవిత్వంలో అన్ని ప్రయోగాలు చేసింది దేవి ప్రియే!


గరీబు గీతాలు, సమాజానంద స్వామి, ఇన్షా అల్లా వంటి రచనలు చేయడానికి సామాజిక నిబద్ధతతోపాటు, భాష మీద అధికారం కూడా ఒక కారణం. తెలుగులో దేవిప్రియ పని చేయని దినపత్రిక లేదు. పని చేసిన చోటల్లా తన ప్రత్యేకమైన ముద్ర చూపించేవాడు. ఉదయం దినపత్రిక, ఆ తర్వాత అనేక పత్రికల్లో ఆయన రాసిన రన్నింగ్‌ కామెంటరీ ఎప్పటికీ గొప్ప పొలిటికల్‌ డాక్యు మెంటేషన్‌! ఆధునిక వచన కవిత్వంలో దాదాపు 10 సంకలనాల కవి దేవి ప్రియకు చాలా ఆలస్యంగా ‘గాలిరంగు’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ప్రతి కవికి, రచయిత వెనక ఒక చోదక శక్తి ఉన్నట్టే దేవిప్రియకూ ఉంది. ఆ శక్తి పేరు ప్రేమ. ఆ ప్రేమ పేరు రాజ్యలక్ష్మి. దేవిప్రియ వెలుగు నీడల్లో అంతటా తానే అయి ఆయన శిరసు మీద తల్లి కొంగులా నీడపట్టిన సహచరి ఆమె. ‘‘ఇంటి దీపానివి కాదు/ నువ్వు నా జీవిత విద్యుత్‌ కేంద్రాన్ని/ సాగుచేయడానికి ప్రవహించవలసిన వాగువి’’ అని అప్పట్లోనే భావించాడు. ఆ వాగు మొన్న ఆగిపోయింది. ఈ విద్యుత్‌ ఈ రోజు వెలుగారిపోయింది. అలాంటి తోడు తన నుంచి దూరమయ్యాక, ఆ తలపుల నుంచి రాసిన కవిత్వం సంపుటి చివరిదవటం విషాదం. 


దేవిప్రియ తన ఆత్మీయ మిత్రుడు కె. శివారెడ్డిని ప్రేమగా ‘శివుడూ’ అని పిలిస్తే చాలామంది యవ్వనోత్సాహులు తాము కూడా ‘శివుడూ’ అనడం అందరం ఎరిగిందే! అలా అని శివారెడ్డిలా మనమూ ‘దేవుడూ!’ అనగ లమా! ఇప్పుడు ఆ దేవుడు మన మధ్య లేడు. 


‘‘ఆకలిదప్పులు ఉండని లోకమొకటి కావలెనని

లోపల ఏదో వ్యాకులస్వప్నం ఇంకా

ఈ కవి మదిని వీడలేదు!’’

 ఇదీ దేవిప్రియ స్వప్నం. ఈ స్వప్నం సాకారం చేయడానికి దేవిప్రియ కవిత్వాన్ని అభిమానించే సమస్త సారస్వత ప్రియులు ప్రయత్నించడమే ఆ కవికి నిజమైన నివాళి!

శిఖామణి, 98482 02526



చివరికి చిక్కింది జింక!

వాన కురిస్తే

నాలో కూడా కురిసేది.

ఉరుము ఉరిమితే

నాలోపల కూడా ఉరిమేది.

మెరుపు మెరిస్తే

నా లోపల కూడా మెరిసేది.



వాగులూ వంకలూ

ఉన్మాదంగా ఊగుతున్న చెట్లూ

చీకటి మూసిన ఆకాశాలూ

తళ తళ మిరుమిట్లూ

ఫెళ ఫెళ భగ్నతరు విస్ఫోటనలూ

అన్నీ నా లోపల కూడా

ప్రజ్వలించేవి ప్రతిధ్వనించేవి



అపుడు నేను వేరు

తాను వేరూ కానట్టుండేది

ఇపుడేమిటి ఇలా?

ఏరు ఎవరోలా అనిపిస్తోంది

ఎవరో ఏరులా కనిపిస్తుంది.



ఎడమ పాదం మీద

ఎంతో అమాయకంగా

ఉదయించిన కొనగోరంతటి

చిట్టి చంద్రవంక అటుసాగి,

ఇటు సాగి, అటు ఎగిరి ఇటు ఎగిరి,

ఇటు పొరిలి అటు పొరిలి,

ఇటు లేచి అటు లేచి

పాదపదపదపత్రతతినొక

భయదకానన హేల చేసి

దష్ట దహనపుకీల చేసి

కాలినిండా కణకణానా

ఢమరుకాలై త్రిశూలాలై

జివ్వు జివ్వున రివ్వు రివ్వున

నొప్పికణికలు చిందుతుంటే

ఏకమై ఆ ఇనుడు భానుడు

కారు చిక్కని ఏ నిశీధిలో

చిక్కుకున్నారో.



అంకుశ పీడిత పీడ

మృత్యు సన్నిభ ‘అడుగడుగు జాడ’.

బాధవయసు యేమో కానీ

డెబ్బయ్యేళ్ళ అనుభవాల

ఈ ముళ్ళకంప కొట్టుకొచ్చి

‘నా తల్లి’ ఇంటికి, అరవై రోజులు.

మిగిలిందేమున్నది ఇంక,

పులి నోటికి పూర్తిగా

చిక్కినట్టే ఉంది ఈ జింక! 
            దేవిప్రియ

    (అముద్రిత ఆఖరు కవిత)

Updated Date - 2020-11-23T06:46:17+05:30 IST