కవిత్వం మనుషుల్ని కలిపేదిగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-03T06:25:29+05:30 IST

సాహిత్యపరంగా శిఖామణితో నా పరిచయం ముప్పై అయిదేళ్ళు. శిఖామణి ఆలోచనలు, ప్రణాకల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ కార్యాన్నైనా చిన్నగా ఉండడానికి ఇచ్చగించడు...

కవిత్వం మనుషుల్ని కలిపేదిగా ఉండాలి

సాహిత్యపరంగా శిఖామణితో నా పరిచయం ముప్పై అయిదేళ్ళు. శిఖామణి ఆలోచనలు, ప్రణాకల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ కార్యాన్నైనా చిన్నగా ఉండడానికి ఇచ్చగించడు. భారీగా ఉండేలా వ్యూహరచన చేస్తాడు. సభ నిర్వహించాలనుకున్నపుడు రాజీ పడడు. ఘనంగా ఉండేలా ప్రయత్నిస్తాడు. శిఖామణి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కవిసంధ్య కార్యకలాపాల్ని యానాంకు బదిలీచేసి విస్తృతం చేశాడు. కరోనా క్లిష్ట సమయంలో ఆధునిక అంతర్జాతీయ వేదిక జూమ్‌ ద్వారా అనేక దేశీయ, అంతర్జాతీయ సదస్సులు, చర్చలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేశాడు. తను ఉద్యోగ విరమణానంతరం గొప్ప సాహిత్య స్పృహను ప్రదర్శించాడు. పుస్తకాలు ప్రచురించాడు. శతజయంతులు నిర్వహించాడు. ఊళ్ళు తిరిగాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. అనేక అనుభవాలు మూటగట్టుకున్నాడు. గత ఏడెనిమిదేళ్ళ కాలంలో సాహిత్యమే ఊపిరిగా జీవనసరళిని తీర్చిదిద్దుకున్నాడు. 1987 సరసం అవార్డు నుంచి నేటి అజో-విభొ-కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం వరకు అనేక అవార్డులు పొందాడు. కాకినాడలో జనవరి 8వ తేదీన అజో-విభొ-కందాళం 2022 విశిష్ట సాహితీమూర్తి పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా, శిఖామణితో నా ముఖాముఖి:


మీ బాల్యం, చదువు, ఉద్యోగం గురించి చెప్పండి?

నా బాల్యం యానాంలోని ఆదియాంధ్రపేటలో సాగింది అది తర్వాత కాలంలో అంబేడ్కర్‌ నగర్‌గా మారింది. ఇక చదువు అంటారా నా తొలిగురువు ననుపెంచి పెద్దచేసిన శిఖామణి గారే. నేను నెలల వయసులో వున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి మా నాయన మిత్రుడైన జి. రత్న శిఖామణి గారు నన్ను పెంచడంతో పాటు, మా కుటుంబాన్ని సాకారు. మాది పేద మధ్య తరగతి కుటుంబం. మా తాతలు అమలాపురం దగ్గర క్రాపచింతల పూడి నుండి వలస వచ్చారనీ, మాది చేనేత కుటుంబం అనీ, తన చిన్నప్పుడు ఇంట్లో నేత మగ్గాలు వుండేవని మా నాయన చెప్పేవాడు. పూనా ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో చిరుఉద్యోగిగా వున్న మా నాన్న మా అమ్మ చనిపోయాక, పూనా నుంచి డబ్బులు పంపితే శిఖామణిగారు మమ్మల్ని పెంచారు. 


ఒకసారి మా నాయన తీవ్ర అనారోగ్యం చేసి ఉద్యోగానికి వెళ్లలేకపోయినపుడు యానాంలో శిఖమణి గారు మా కోసం జోలెపట్టి బియ్యం తెచ్చి మమ్మల్ని పోషించారు. నన్ను అమ్మలాపెంచి పెద్దచేసిన శిఖామణి గారి జ్ఞాపకార్థం ఆయన పేరును నా కలం పేరుగా చేసుకున్నాను. ఎం.ఎలో మాస్టారు అత్తలూరి అదేం పేరండీ అంటే, విషయం చెబితే, ఆయన చలించిపోయి, కానివ్వండి అన్నారు.కవిత్వం వైపు మరలడానికి కారణాలేమిటి?


శిఖామణి గారు ఉదయం మొహం కడుక్కుని, మా చావడి వెనకగడప మీద కూచుని బైబిలులోని రెండు వచనాలు చదువు కునే వాడు. నాకూ అది అలవాటయ్యింది. భారతీయులకు రామా యణంలాగ, పాశ్చాత్యులకు బైబిలు ఆదికావ్యం. ఆ వచనం నిండా గొప్ప కవిత్వం కనిపించేది. వీటితో పాటు శిఖామణి గారు చందమామ, అభిసారిక, కాగడా వంటి పత్రికలు తెప్పించి చదివేవాడు. ఆ రోజుల్లో అవి ఆయన ఎలా సంపాదించాడో ఇప్పటికీ ఆశ్చర్యం. 


కొన్ని పత్రికలు ఆయన చూడకుండా దొంగ చాటుగా చదివేవాణ్ణి. మదురు సుబ్బారాయుడు, బిట్రగొంతమ్మ, గుర్రపు మోహనరావు వంటివారు ఇంటికి వచ్చి కథలు చెప్పడం చదివి వినిపించడం వంటివి చేసేవారు, గణపతి నవరాత్రుల్లో ఆడే నాటకాలు, యానాం వెంకన్న తీర్థంలోని భోగం మేళాలు, సన్‌ థియేటర్‌లోని నలుపు తెలుపు సిన్మాలు, అంతకు మించి శిఖామణి గారు కాకినాడ సుకెళ్లి చూపించిన జెమినీ సర్కస్‌లు, మేరానామ్‌ జోకర్‌ వంటి సిన్మాలు, అప్పట్లో జీవితం ఒక రంగుల ఉత్సవం. ఈ వాతావరణంలో పుట్ట్టి పెరిగిన వాడెవడైనా కవీ, రచయిత కాకుండా ఎలా వుండగలడు.  


కవికి నిబద్ధత అవసరమా? మీ నిబద్ధత ఏమిటి?

తప్పకుండా అవసరం. అయితే 70 దశకంలో ప్రచారంలోవున్న నిబద్ధతే కానవసరం లేదు. నిబద్ధత అంటే నమ్మిన దానికి కట్టుబడి వుండటం అనుకుంటాను. భావకవిత్వం నుండి ఇటీవలి అస్తిత్వ ఉద్యమాల వరకూ ఆయా కవులు నిబద్ధతనే రాసారు. అయితే అన్నీ నిబద్ధతలూ ఒకటి కావు. 


నిబద్ధత అనగానే ఎలా చెప్తున్నావు అనే దానికంటే ఏం చెబుతున్నావు అనే దాని మీద దృష్టి కేంద్రీకృతమౌతుంది. నిబద్ధతకు నేను ఒకటే కొలమానం అనుకుంటాను. అది ఏ ఉద్యమమైనా సరే, ఉద్యమ అవసరం తీరిపోయాక కూడా అది సాహిత్య రచనగా మిగలాలి. ఇక నా నిబద్ధత మీకు అందరికీ తెలిసిందే. అనుభూతి కవిగా లేదా మానవ వాద కవితా ప్రయాణం ప్రారంభించిన నేను, దళిత కవిగా అశుద్ధ మానవుడు (1988) కవితతో రంగం మీదకొచ్చినపుడు వచ్చిన నిరసనలు నేను ఆయా సందర్భాల్లో నా కవితా సంపుటుల ముందుమాటల్లో నమోదు చేసివున్నాను. మనవాళ్లకు జీవకారుణ్యం మీద వున్న శ్రద్ధ మానవ కారుణ్యం మీద లేదు. మానవ హక్కుల ఉద్యమంలో దళిత మానవులు స్త్రీలు చాలా కాలం భాగం కాకపోవడం విచార కరం. ఇప్పటికైనా తెలుగు సాహిత్యం అమూర్త వర్గ దృక్పథం నుండి వాస్తవిక దళిత స్త్రీ దృక్పథం వైపు మళ్లవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం నా నిబద్ధత అనుభూతి, మానవతావాదం దళిత వాదం దాటుకుని ‘మనిషిని’ అన్వేషించే విశ్వమానవతావాదం.


రాష్ట్ర విభజన తెలుగు సాహిత్యంపై ఎట్లాంటి ప్రభావాన్ని చూపింది?

రాష్ట్ర విభజన చాలా సున్నితమైన అంశం. గౌరవప్రదంగా విడిపోవాల్సిన రాష్ట్రం చాలా అవమానకరంగా విడిపోయింది. ఆ ప్రతిఫలనలు సాహిత్యంలోనూ అంతే మోటుగా నమోదు అయ్యాయి. కొంత మంది విభజనను అద్దం మీద దుమ్ముతో పోల్చారు. కానీ రాష్ట్ర విభజన కళాయి రాలిపోయిన అద్దం వంటిదిగా నేను భావిస్తున్నాను. అది రాష్ట్రం అయినా, దేశం అయినా, ఖండం అయినా కవిత్వం మనుషుల్ని కలిపేదిగా ఉండాలి గానీ విడగొట్టేదిగా ఉండకూడదు అని నా విశ్వాసం. తెలంగాణ వడ్డించిన విస్తరి అయితే, ఆంధ్రప్రదేశ్‌ కుక్కలు చింపిన విస్తరిగా మిగిలిపోయింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని నినదించిన తెలంగాణ సాహితీ ప్రపంచం, (ఒకరిద్దరు మినహా) ప్రజాపక్షం, ప్రతిపక్షంగా వున్న వారంతా ఏకంగా ప్రభుత్వ పక్షంలో చేరిపోయారు. 



నిఖిలేశ్వర్‌ గారి ‘అమ్ముడు పోవడం’ వ్యాఖ్య వెనకవున్న అంతరార్థం ఇదే అయివుంటుంది. ఆంధ్రా, తెలంగాణ ప్రభుత్వాలు రెండింటికి, ఒక విద్యావిధానం, భాషా సాంస్కృతిక విధానం లేకపోవడం... చరిత్రలో ఇంతకు ముందెప్పుడు ఇంత శూన్యం లేదు. ఇలాంటి జాతికి ఏం అభివృద్ధి వుంటుంది. 


‘కవిసంధ్య’ ద్వారా మీరు సాధించే లక్ష్యాలేమిటి? ఆధునిక కవిత్వంలో అది నిర్వహించిన పాత్ర ఏమిటి ?

దక్షిణాది భాషల్లో తమిళం, కన్నడం ముందుగా ప్రాచీన భాషా హోదా పొందాయి. మన తెలుగుకు సోదరభాషల వాళ్లు మోకాలు అడ్డంపెట్టారు. దానికి న్యాయస్థానాల్లో పెద్ద పోరాటమే చెయ్యవలసివచ్చింది. భాషాభివృద్ధి తానంతట అది జరుగదు. అందులో గొప్ప సృజన జరగాలి. సృజనను పత్రికలు ప్రచురించాలి. దురదృష్టవశాత్తు మన పత్రికలు రచనలు అచ్చెయ్యటం భాషా సాహిత్య సేవగా భావించకుండా, మేం రచయితలను ప్రమోట్‌ చేస్తున్నాం అనే మానసిక స్థాయికి దిగజారిపోయాయి. పైగా పత్రికల కొరత. ఆర్థిక పరిపుష్ఠి కలిగిన సంస్థలు కూడా పత్రికలు మూసివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కవిసంధ్య’ కవిత్వం కోసం స్థాపించబడింది. అయిదేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని పురోగమిస్తుంది. ఈ సందర్భంగా పత్రికకు అండగా నిలిచిన అందరికీ శిరస్సు వొంచి నమస్కరిస్తున్నాను.


కవిసంధ్య కేంద్రంగా మీరు యానాంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏమిటి?

కవిసంధ్య యానాం తరలివెళ్లి పోయాక, ఒక వార్షిక సాహిత్య క్యాలండర్‌ రూపొందించుకుని కార్యక్రమాలను అమలుచేస్తుంది. అందులో ప్రముఖ కవుల శతజయంతులు నిర్వహించడం, కవిసంధ్య గ్రంథమాల ద్వారా సాహిత్య గ్రంథాల ముద్రణ, మార్చి 21 అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా కవితల పోటీలు, కవిత్వ సదస్సులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య, పర్యాటక కేంద్రంగా వున్న యానాంను ఒక సాహితీ చలివేంద్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో 2016లో యానాం కవితా ఉత్సవం దాదాపు 300 మంది కవులు రచయితల కళాకారులతో నిర్వహించడం జరిగింది. 


మీ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

నా దగ్గర నాలుగైదు ప్రణాళికలు వున్నాయి. అందులో ప్రథమ ప్రాధాన్యం అంబేడ్కర్‌ మీద తెలుగులో వచ్చిన పద్య, గేయ, వచన కవిత రచనల బృహత్‌ సంకలనం. అయిదేళ్ళ క్రితమే అంబేడ్కర్‌ శకం పేరుతో సంకలనం చేసాను. దళిత మేధావి శ్రీ బొజ్జా తారకం గారు ముందు మాట రాసారు. దాన్ని వెంటనే ముద్రించాలి. అలాగే దళిత సాహిత్య కోశం, దళిత వైతాళికులు వంటి గ్రంథాలు తయారీలో ఉన్నాయి. వీటికి మేడిశెట్టి తిరుమల కుమార్‌ వంటి గౌరవ మిత్రుల ముద్రణా సౌజన్యం ప్రకటించివున్నారు. నాదే ఆలస్యం- వీటితో పాటు వచన కవితా పితామహుడు కందుర్తి ఆంజనేయులు శతజయంతి సదస్సును నిర్వహించడం ‘వందేళ్ల కుందుర్తి’ పేరుతో వ్యాస సంకలనం ముద్రించడం, వచన కవితా వార్షికోత్సవాలు చేయడం సంకల్పాలు. కాలం  అనుమతి ఇవ్వాలి. 

దాట్ల దేవదానం రాజు

94401 05987


Updated Date - 2022-01-03T06:25:29+05:30 IST