అతడు
ఉట్టిగనే వెళ్లిపోలేదు
నిలబడ్డ కాడల్లా
అక్షరాలను తాపే అమ్మచెట్టై నిలిచిండు
తుపాను తుమ్మెదలను
గుండెలకు నాటిన
‘అంతర్ముఖుడు’
అతడు
పడవలా వెళ్లిపోలేదు
అలల్లా పోటెత్తే
రన్నింగ్ కామెంటరీని
నిత్యపారాయణంగా నుదుట దిద్దిపోయిన ‘నీటిపుట్ట’
అతడు
పిట్టలా మాయం కాలేదు
జమ్‌జమ్మల్ మర్రి వెయికాళ్ళ జెర్రి
ప్రసిద్ధగీతాల్ని వంటబట్టిచ్చిన ‘గరీబు గీతా’చార్యుడు
అతడు
సాదాసీదాగా వెళ్లిపోలేదు
చేపచిలుకల్ని
కవితాపతాకాలుగా ఎగురేసిన
కవితా అజేయుడు
రహస్యాల్ని ఉగ్గుపాలుగా తాపి
ఎందరికో ఊతకర్రై నిలిచిన
కవితా తాత్వికుడు
కలాన్ని
హలం చేసి
నేలను సాహితీవనం చేశాడు
ఎన్నడు మర్చిపోని
ఎప్పుడూ మారిపోని ఎక్కడ కరిగిపోని
‘గాలిరంగై’ నిలిచిన వాడు దేవిప్రియుడు
వనపట్ల సుబ్బయ్య