తామిచ్చిన భూమిలో..

ABN , First Publish Date - 2020-07-04T06:34:30+05:30 IST

భూమిని ఇచ్చినందుకు భూమి పుత్రులు బ్రతుకును పోగొట్టుకున్నారు.. మాట నమ్మి మట్టిని ఇచ్చినందుకు మట్టి మనుషులు మర్యాదనూ....

తామిచ్చిన భూమిలో..

భూమిని ఇచ్చినందుకు 

భూమి పుత్రులు బ్రతుకును పోగొట్టుకున్నారు..

మాట నమ్మి మట్టిని ఇచ్చినందుకు

మట్టి మనుషులు మర్యాదనూ 

పోగొట్టుకున్నారు..


మాట తప్పిన ప్రభుత్వం -

మౌనం వహించిన మంత్రులతో..

పొలాలు ప్రశ్నల నాట్లేసి మాట్లాడుతున్నాయి 

పల్లెల పొలిమేరలు ఉక్కు 

పిడికిల్లెత్తి కొట్లాడుతున్నాయి.


ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో - 

చావు బతుకుల హోరు సాగుతుంది.. 

చేతులు మారిన రాజ్యాధికారం -

మాటలతో కాటేసి మళ్ళీ మళ్ళీ చంపుతూ,

మెతుకుల మెడలకూ ఉరితాళ్లు పేనుతున్నారు..


గ్రామాలు అవమానంతో 

ఆత్మగౌరవం పోగొట్టుకున్నాయి

రైతులు స్వాభిమానంతో 

చివరకూ ఉరి పోసుకుంటున్నారు


ఆ కృషీవలుల కలలు 

కన్నీళ్లుగా కరిగిపోతున్నాయి 

ఆ మెతుకుల జ్ఞాపకాలు 

వెక్కిరింతల్లో విరిగిపోతున్నాయి.. 


తాము చేసినా నేరం -

ఒక్కటే ప్రభుత్వాన్ని నమ్మడం..

అదోక్కటే ప్రభుత్వాన్ని నమ్మడం..


ఈ ప్రభుత్వం -

రైతులకూ ఇచ్చిన గౌరవం

పెయిడ్ ఆరిస్టులుగా -

సైడ్ క్యారెక్టర్స్‌గా గుర్తించడం


దక్కిన ప్రతిఫలం.. 

తనకాలి కింద బీటలు కొడుతున్న 

దుర్మార్గానికి వ్యతిరేకంగా.. 

తామిచ్చిన భూమిలో

తమకోసం తామే ధర్నాగా మొలవడం..


ఈ అవిశ్రాంత రణయజ్ఞంలో 

అన్నదాత కూడబెట్టాలని కాదు.. 

అఖిలాంధ్ర బిడ్డలకూ కూడు పెట్టాలని.. 

తెలుసుకోరా.. తెలుగు బిడ్డ..


– పొట్లూరి హరికృష్ణ

పూర్వ అధ్యక్షులు, జానపద అకాడమీ, 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము

Updated Date - 2020-07-04T06:34:30+05:30 IST