పోడు రైతుల ఆందోళన ఉద్రిక్తం

ABN , First Publish Date - 2022-08-18T06:16:01+05:30 IST

పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.

పోడు రైతుల ఆందోళన ఉద్రిక్తం
కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన పోడు రైతులు

సిరిసిల్ల కలెక్టరేట్‌,  అగస్టు 17 : పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన  ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది.  నాయకులు, రైతులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.   అనంతరం నాయకులను అరెస్ట్‌ చేశారు. సీపీఎం జిల్లా కమిటీతోపాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, పోడు రైతులు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర చేపట్టారు. పట్టణ శివారులోని కలెక్టరేట్‌ వరకు పాదయాత్రగా తరలివచ్చారు.  కలెక్టర్‌ను కలుస్తామంటూ వెళ్లేందుకు యత్నించగా పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో రైతులు, నాయకులు అక్కడే బైఠాయించారు.  కలెక్టర్‌ రావాలంటూ నినాదాలు చేశారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌, జిల్లా కమిటీ సభ్యుడు కోడం రమణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్‌, వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారపు అరుణ్‌కుమార్‌, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎరవెళ్లి నాగరాజు, మనోజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మూషం రమేష్‌  మాట్లాడుతూ జిల్లాలోని పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని, పోడు భూముల్లో ఫారెస్ట్‌ అధికారుల దౌర్జన్యంగా చెట్లు నాటడం ఆపాలని డిమండ్‌ చేశారు.  పోడు రైతులందరికీ హక్కు పత్రాలను అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రకటించి ఇప్పటికి 8 నెలలు అవుతోందని, ఇప్పటికీ అందించలేదని అన్నారు. కోనరావుపేట వీర్నపల్లి మండలాల్లో  ఫారెస్ట్‌ అధికారులు మొక్కలు నాటుతున్నారన్నారు. అడ్డుకున్న రైతులపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. వెంటనే   మంత్రి కేటీఆర్‌తోపాటు  కలెక్టర్‌ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి జివ్వాజి విమల, ఎగమంటి ఎల్లారెడ్డిపేట,  వీర్నపల్లి, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి మండలాలకు చెందిన పోడు రైతులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:16:01+05:30 IST