తుమ్మలచెరువులో పోడు వివాదం

ABN , First Publish Date - 2021-04-17T05:13:59+05:30 IST

పోడు భూమి చుట్టూ కందకాలు తవ్వుతున్న అటవీ అధికారులను పోడు రైతులు అడ్డుకోవడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పండింది.

తుమ్మలచెరువులో పోడు వివాదం
కందకాలు తవ్వకుండా ఎక్సకవేటర్‌కు అడ్డుపడిన మహిళలు

అటవీ అధికారులు, పోడుదారుల మధ్య వాగ్వాదం 

భారీగా మోహరించిన పోలీసులు

పురుగుల మందు తాగిన గిరిజన మహిళ

భద్రాద్రి జిల్లా తుమ్మలచెరువులో పరిస్థితి ఉద్రిక్తం

అశ్వాపురం, ఏప్రిల్‌ 16 : పోడు భూమి చుట్టూ కందకాలు తవ్వుతున్న అటవీ అధికారులను పోడు రైతులు అడ్డుకోవడంతో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పండింది. అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మలచెరువు, వెంకటాపురం పంచాయతీల పరిధిలోని పోడు భూముల్లో వారం రోజులుగా కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం అటవీ అధికారుల చర్యలను పోడుదారులు అడ్డుకోవటం జరుగుతోంది. అయితే మూడురోజులుగా పోడురైతులు భూముల్లోనే టెంట్‌ వేసుకుని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములు తమకే ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వర్షం పడటంతో శుక్రవారం పోడు దారులు తమ భూముల్లో ఉన్న పత్తికట్టెలను తొలగించుకునేందుకు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ సిబ్బంది పోడుదారులను అడ్డుకుని ట్రెంచ్‌ కొట్టేందుకు ప్రయత్నించగా పోడుదారులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఫారెస్ట్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీక్షా శిబిరం వద్దకు పోలీసులు భారీగా చేరుకుని పోడుదారులను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అయినా గిరిజన మహిళలు పురుగుల మందు డబ్బాలతో ఎక్స్‌కవేటర్‌ ముందు బైఠాయించి పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మలచెరువు గ్రామానికి చెందిన గుండి లక్ష్మి అనే మహిళ తమ భూములు తమకేనంటూ సంఘటనా స్థలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సదరు మహిళను చికిత్స నిమిత్తం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. దీంతో అశ్వాపురం సిఐ సట్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. సుమారు 30మంది పోడుదారులను అదుపులోకి తీసుకుని అశ్వాపురం పోలీస్‌స్టేషకు తరలించారు. 

Updated Date - 2021-04-17T05:13:59+05:30 IST