Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొదిలి ‘రెవెన్యూ’కు ఇన్‌చార్జిలే దిక్కు

పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో సాగని పనులు

సకాలంలో పనులు కాక అల్లాడిపోతున్న అవసరార్థులు

భూఅక్రమాలపై గతంలో తహసీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వో సస్పెన్షన్‌

ఇక్కడికి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్న అధికారులు


పొదిలి, నవంబరు 26 : పొదిలి మండల రెవెన్యూ కార్యాలయంలో అవసరార్థులకు పనులు మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి జరుగుతున్నాయి. సకాలంలో ఎవరికీ ఎపని కావడంలేదన్న విమర్శలున్నాయి. పలు కీలక స్థానాల్లో ఇన్‌చార్జులు కొనసాగుతుండడమే అందుకు కారణంగా తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేరు. గతంలో పనిచేసిన ఏవీ హనుమంతరావు ఉద్యోగ విరమణకు రెండురోజుల ముందు సస్పెండ్‌ అయ్యారు. మూడు మాసాల క్రితం డిప్యూటీ తహసీల్దార్‌ రఫీకి తహసీల్దార్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ఈ నెలాఖరు వరకు సెలవుపై వెళ్లారు. దీంతో దర్శి డిప్యూటీ తహసీల్దార్‌ దేవప్రసాద్‌ను ఇన్‌చార్జి తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. అడహక్‌ ప్రమోషన్‌ కావడం వల్ల పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించే వీలులేనట్లు తెలిసింది. దీంతో సిబ్బందికి ఈనెల జీతాలు వచ్చే అవకాశాలు లేకుండా పోయింది. విద్యార్థులకు, రైతులకు అవసరమైన ధ్రువపత్రాలు, పాసుపుస్తకాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఇదిలా ఉండగా పొదిలిలో ఆక్రమణలు అరికట్టలేకపోయారనే ఆరోపణలతో తహసీల్దార్‌, ఆర్‌ఐ, కంభాలపాడు వీఆర్వోను మూడు మాసాల క్రితం కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. దీంతో ఇక్కడికి రావడానికి ఎవరూ ఇష్టం చూపించడం లేదని తెలుస్తోంది. ఆర్‌ఐలు లేకపోవడంతో మూగచింతల వీఆర్వో సుబ్బారావుకు తాత్కాలికంగా ఆర్‌ఐ బాధ్యతలు అప్పగించారు. సిబ్బంది కొరతతో రెవెన్యూ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి జిల్లాలో కీలకమైన పొదిలి మండలానికి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement