అంతా తాలే..!

ABN , First Publish Date - 2022-08-09T03:51:40+05:30 IST

ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దుతిరుగుడు పంట రైతుకు పెద్ద కష్టమొచ్చింది.

అంతా తాలే..!
సాగులో ఉన్న పొద్దతిరుగుడు పంట

వర్షాలతో దెబ్బతిన్న పొద్దుతిరుగుడు పంట

భారీగా తగ్గనున్న దిగుబడి 

పెట్టుబడులూ కష్టమే

లబోదిబోమంటున్న మెట్ట రైతు

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 8: ఆరుగాలం కష్టపడి పండించిన పొద్దుతిరుగుడు పంట రైతుకు పెద్ద కష్టమొచ్చింది. రేయింబవళ్లు కంటికిరెప్పలా కాపాడుకుంటున్న పంట వరుస వర్షాలు, వాతావరణంలో మార్పులతో దెబ్బతినడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. సూర్యరశ్మి లేక పువ్వు కోతకు నెల రోజుల ముందే వాలిపోవడంతో గింజ పుట్టక తాలే మిగిలింది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో పంట పూర్తిగా దెబ్బతినే అవకాశముంది. దిగుబడి ఎకరాకు 2-3 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలని మెట్ట రైతులు లబోదిబోమంటున్నాడు.  

అధికంగా సాగు : మెట్ట ప్రాంతమైన ఉదయగిరి సబ్‌ డివిజన్‌లో అధికంగా ఆరుతడి పంటలే సాగు చేస్తారు. ఆ పంటలు సైతం చేతికందక రైతులు అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు అధికంగా సాగు చేశారు. సబ్‌ డివిజన్‌ పరిధిలోని సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు మండలాలతోపాటు జిల్లాలోని కలిగిరి, ఏఎస్‌పేట, అనంతసాగరం, వింజమూరు, పొదలకూరు, వెంకటగిరి తదితర మండలాల్లో సుమారు 2500 ఎకరాల్లో పంట సాగు చేశారు. పంట సాగు చేసిన రెండు నెలలు బాగానే ఉన్నా నెల రోజుల నుంచి తరుచూ వర్షాలు పడడం, వాతారణంలో మార్పులు ఏర్పడడంతో పంట పూర్తిగా దెబ్బతింది. బూడిద తెగులు అధికంగా వ్యాపించిందని రైతులు వాపోతున్నారు.  

భారీగా తగ్గనున్న దిగుబడి : ఎకరా పొద్దుతిరుగుడు పంట సాగు చేసేందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు ఖర్చవుతుందని రైతులు అంటున్నారు. పంట బాగా అయితే ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం 2-3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాదని, కోత కూలీలు కూడా భారంగా మారుతుందని వాపోతున్నారు. పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఏలా తీర్చాలని ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరుతున్నారు. 

తీవ్రంగా నష్టపోయా

రూ.30 వేలు ఖర్చు చేసి రెండెకరాల్లో పొద్దుతిరుగు పంట సాగు చేశా. వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. పువ్వులో తాలు గింజలు తప్ప గింజే లేదు. వాటిని కోసేందుకు కూలీల భారం కూడా మోయాల్సి వస్తుంది. ప్రభుత్వం ఆదుకోవాలి. 

- మన్నేటి వెంకటేశ్వర్లు, రైతు, గంగిరెడ్డిపల్లి





Updated Date - 2022-08-09T03:51:40+05:30 IST