పోక్సో కోర్టుతో త్వరగా తీర్పులు

ABN , First Publish Date - 2022-01-22T06:19:18+05:30 IST

పోక్సో కోర్టుతో త్వరగా తీర్పులు

పోక్సో కోర్టుతో త్వరగా తీర్పులు
పోక్సో కోర్టు ప్రారంభోత్సవంలో జడ్జి రామకృష్ణ, ఇతర న్యాయమూర్తులు

కోర్టు ప్రారంభోత్సవంలో జిల్లా జడ్జి జి.రామకృష్ణ

వర్చువల్‌గా ప్రారంభించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పీకే మిశ్రా

మచిలీపట్నం టౌన్‌, జనవరి 21 : పోక్సో కోర్టు ఏర్పాటుతో కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని జిల్లా జడ్జి జి.రామకృష్ణ తెలిపారు. చిన్నారుల లైంగిక వేధింపుల నేరాల చట్టం కచ్చితంగా అమలుకు ఈ కోర్టు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన పోక్సో కోర్టును శుక్రవారం ఉదయం హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. అమరావతిలోని హైకోర్టు ప్రాంగణం నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ భట్టు దేవానంద్‌, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా ఈ వర్చువల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బందరులో జరిగిన సమావేశంలో జిల్లా జడ్జి రామకృష్ణ మాట్లాడుతూ అత్యంత హేయమైన నేరాల్లో పిల్లల లైంగిక వేధింపులు ఒకటన్నారు. అటువంటి బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం జరిపేందుకు ఈ కోర్టు ఎంతో దోహదపడుతుందన్నారు. కోర్టు భవనంలో పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, కక్షిదారులు వేచి ఉండే గదిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ కోర్టుకు మొదటి న్యాయమూర్తిగా 9వ అడిషనల్‌ జిల్లా జడ్జి సీతారామకృష్ణారావును నియమించామన్నారు. ఈ కార్యక్రమంలో పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ రామకృష్ణ, ఒకటో అదనపు జిల్లా జడ్జి సీతారామమూర్తి, జిల్లా న్యాయ సేవాఽధికార సంస్థ కార్యదర్శి పి.రాజారామ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్‌ తంటిపూడి కవిత, ముడా చైర్మన్‌ బొర్రా నాగదుర్గా భవానీ, మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.మెహర్‌ ప్రసాద్‌, పీపీ బీవీ వరదరాజులు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T06:19:18+05:30 IST