పీఎం-కిసాన్‌.. పరేషాన్‌!

ABN , First Publish Date - 2022-01-24T08:56:33+05:30 IST

ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం- కిసాన్‌) పథకానికి అన్ని అర్హతలూ ఉన్న చాలా మంది రైతులకు డబ్బులు రావడం లేదు.

పీఎం-కిసాన్‌.. పరేషాన్‌!

  • అన్ని అర్హతులున్న 4.70 లక్షల మంది రైతులకు మొండిచేయి
  • 9 విడతల్లో  రూ.393 కోట్ల నష్టం
  • ‘ఖాతాల’తోనే 3 లక్షల మంది   దూరం                                                                               ఇంకొన్ని చిన్న సమస్యలు.. చొరవ చూపని సాగు అధికారులు 
  • ‘లిబ్‌టెక్‌ ఇండియా’ అధ్యయనంలో వెల్లడి


హైదరాబాద్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం- కిసాన్‌) పథకానికి అన్ని అర్హతలూ ఉన్న చాలా మంది రైతులకు డబ్బులు రావడం లేదు. పథకం మొదలైనప్పటి నుంచి తొమ్మిది విడతల్లో కలిపి రాష్ట్రంలో ఇలాంటి రైతులు 4.70 లక్షల మంది  ఉన్నారు. ఈ విషయాన్ని ‘లిబ్‌టెక్‌ ఇండియా’ తన అధ్యయనంలో వెల్లడించింది. వీరిలో ఖాతాలకు సంబంధించిన సమస్యలతో బ్యాంకుల తిరస్కరణకు గురైన రైతులే 3 లక్షల మంది ఉన్నారని గుర్తించారు. ఇతర కేసుల్లో లబ్ధిదారుల వివరాలకు సంబంధించి ఉన్న చిన్న చిన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్‌లో ఉండే ‘ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ’ విభాగం అధికారులు చొరవ చూపడం లేదని గుర్తించారు. ఈ మేరకు గత తొమ్మిది విడతల్లో రూ. 393 కోట్లను రాష్ట్రంలోని రైతులు నష్టపోయారని తేల్చారు. దేశవ్యాప్తంగా పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీని మెరుగుపరచటానికి ఇంజినీర్లు, సామాజిక కార్యకర్తలు, సామాజిక శాస్త్రవేత్తలంతా ఒక బృందంగా ఏర్పడి ‘లిబ్‌టెక్‌ ఇండియా’ వేదికగా తొమ్మిదేళ్లుగా కృషిచేస్తున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వీరు పనిచేస్తున్నారు. ఈ బృందం తెలంగాణలో  పీఎం- కిసాన్‌ పథకం అమలుతీరుపై తాజాగా ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న తెలంగాణ పీఎం- కిసాన్‌ సమాచారాన్ని తీసుకొని   విశ్లేషించింది.


 రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకంలో నమోదై ఉన్న 38,39,545 మంది రైతుల వివరాలు తీసుకొని...  34,633 మంది రైతుల లావాదేవీలపై విశ్లేషణ చేశారు. రైతుల దరఖాస్తులు ఎందుకు తిరస్కరణకు గురవుతున్నాయి? సాంకేతిక సమస్యలు ఏమిటి? రాష్ట్ర రైతాంగానికి ఏమేరకు నష్టం కలుగుతోంది? అనే కారణాలను ‘లిబ్‌టెక్‌ ఇండియా’ బృందం నోటిఫై చేసింది. ఈ నెలలో ప్రారంభమైన పదో విడత పీఎం- కిసాన్‌ మినహా... గడిచిన 9 విడతల్లో 39,34,691 మంది రైతులకు రూ. 6,558 కోట్ల ఆర్థిక సాయం అందాల్సి ఉంది. అందులో రూ. 6,165 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ అయ్యాయి. పథకంలో నమోదు చేసుకున్నప్పటికీ 4.70 లక్షల మంది రైతులకు డబ్బు పడలేదు. వివిధ కారణాలతో 70వేల మందిని పథకం నుంచి పక్కనబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వమేమో 60వేల మంది రైతుల  వివరాలను పెండింగ్‌లో పెట్టింది. ఆధార్‌ నంబరు ధ్రువీకరించని కేసులు 40 వేలు ఉన్నాయి. పీఎం- కిసాన్‌ పథకంలో నమోదై ఉన్న రైతుల సాంకేతిక సమస్యలను తెలంగాణ వ్యవసాయ కమిషనరేట్‌లోని ఐటీ విభాగం పరిష్కరిస్తే పెండింగ్‌లో ఉన్న విడతలకు సంబంధించిన నిధులు కూడా ఏక కాలంలో రైతుల ఖాతాలకు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి.


పరిష్కరించాల్సిన సమస్యలివీ

రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు కొన్ని తప్పుగా నమోదైనా, చాలాకాలం బ్యాంకు అకౌంట్‌ను ఉపయోగించకపోయినా, ఖాతా ఫ్రీజ్‌ అయినా అకౌంట్లలో డబ్బులు పడటంలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 60వేల దరఖాస్తులను ఏ కారణంతో పెండింగ్‌లో పెట్టారనేది వెల్లడించలేదు. కారణాలు వెల్లడిస్తే... రైతులు తప్పిదాలు ఉంటే సరిచేసుకునే అవకాశం ఉంటుందని ‘లిబ్‌టెక్‌ ఇండియా’ ప్రతినిధులు పేర్కొన్నారు. రైతుల వివరాలు, ఆధార్‌ నంబర్‌తో సరిపోకపోయినా దరఖాస్తులు తిరస్కరించారు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను పురమాయించి సరిచేయిస్తే 40 వేల మంది రైతులకు మేలు కలుగుతుంది.  కొత్తగా నమోదుకు క్యాంపులు ఏర్పాటుచేయాలని ‘లిబ్‌టెక్‌ ఇండియా’ ప్రతినిధులు సూచించారు. 

Updated Date - 2022-01-24T08:56:33+05:30 IST