ఒలింపిక్స్‌కు వెళ్లే వారు కచ్చితంగా టీకా వేయించుకోవాలి: ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-06-04T01:11:58+05:30 IST

జపాన్‌ వేదికగా మరి కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ కీడ్రా సంరంభంలో పాల్గొనే భారత క్రీడాకారుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

ఒలింపిక్స్‌కు వెళ్లే వారు కచ్చితంగా టీకా వేయించుకోవాలి: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: జపాన్‌ వేదికగా మరి కొద్ది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ కీడ్రా సంరంభంలో పాల్గొనే భారత క్రీడాకారుల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. జపాన్‌కు పయనమయ్యే భారత బృందంతో జులైలో సమావేశమవుతానని పీఎం పేర్కొన్నారు. ఒలింపిక్స్ కోసం జపాన్‌కు వెళ్లేవారందరూ కచ్చితంగా కరోనా టీకా వేసుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా సూచించారు. ‘‘ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జపాన్ వెళుతున్న భారత్ బృందంతో నేను జులైలో సమావేశం అవుతాను. దేశం వారిని చూసి గర్విస్తోంది. 135 కోట్ల ప్రజల ఆశలన్నీ ఈ యువ క్రీడాకారులపైనే ఉన్నాయి. వీరు దేశంలో క్రీడలకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక సంస్కృతిని సృష్టించారు.’’ అని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై మెరిసే ప్రతి క్రీడాకారుడి కారణంగా దేశంలో మరో వేయి మంది యువత క్రీడలవైపు మళ్లుతారని మోదీ వ్యాఖ్యానించారు.


 కాగా.. ఒలింపిక్స్ కోసం దేశంలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులు ప్రధానికి ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. క్రీడాకారులు, వారి సహాయకులు, ఒలింపిక్స్‌కు వెళ్లే భారత అధికారులకు వీలైనంత త్వరగా టీకా వేయాలని ప్రధాని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. టీకాల నుంచి శిక్షణ ఏర్పాట్ల వరకూ క్రీడాకారుల ప్రతి అవసరానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.  ఒలింపిక్స్ సందర్భంగా క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు వీలుగా వారు ప్రతిరోజు తమ స్నేహితులతో, కుటుంబసభ్యులతో వీడియో కాన్ఫరెన్సీంగ్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పిస్తామని అధికారులు మోదీకి వివరించారు.   

Updated Date - 2021-06-04T01:11:58+05:30 IST