ఉరుకులు.. పరుగులు !

ABN , First Publish Date - 2022-07-01T06:10:03+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో ప్రసంగించే వేదిక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం వేదిక ఏర్పాట్ల పనులను ప్రారంభించారు.

ఉరుకులు.. పరుగులు !
పెదఅమిరంలో ప్రధాని సభ వద్ద స్టేజీ ఏర్పాట్లు

హడావుడిగా ప్రధాని బహిరంగ సభ వేదిక ఏర్పాట్లు 

ప్రభుత్వ అనుమతుల జాప్యంతో ఈ పరిస్థితి.. 

ఆర్‌అండ్‌బీ శాఖపై తీవ్ర ఒత్తిడి

భీమవరం/క్రైం, జూన్‌ 30 : ప్రధాని నరేంద్ర మోదీ భీమవరంలో ప్రసంగించే వేదిక పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం వేదిక ఏర్పాట్ల పనులను ప్రారంభించారు. ఈనెల 4వ తేదీన ప్రధాని పర్యటన కార్యక్రమం ఇరవై రోజుల కిందటే ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంలోనే జాప్యం జరిగిందని అంటున్నారు.  దీనికి తోడు వర్షం కురవడంతో నాలుగు రోజులుగా జరుగుతున్న పనుల్లో జాప్యం జరిగింది. మబ్బులు వేస్తూ భయపెడుతూనే ఉంది.  బుధవారం నుంచి ఎండలు కాయడంతో పనులు ఊపందుకున్నాయి. పట్టణ శివారులోని కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామం ప్రారంభంలో ఎన్‌ఆర్‌ఐ అనంతకోటిరాజుకు చెందిన 14 ఎకరాల విస్తీరణం కలిగిన భూమిలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. చాలాకాలంగా ఇది వినియోగంలో లేకపోవడంతో స్థలమంతా గుల్లగుల్లగా ఉంది.  ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా మారింది. బోదెలు తవ్వి నీటిని తొలగించి ఎండబెట్టారు. 200 మంది కార్మికులు, 20 బుల్డోజర్‌లతో పనులు చేపట్టారు. రహదారులు భవనాల  శాఖ ఎస్‌ఈ, అధికారుల బృందం పర్యవేక్షిస్తోంది. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి కావల్సి ఉంది. ఈ పనులపై ఆర్‌అండ్‌బీ శాఖ ఒత్తిడికి గురవుతోంది. 

వేదిక 120్ఠ 130 మీటర్ల విస్తీర్ణం

బహిరంగ సభ నిర్వహించే వేదిక పనులు గురువారం ప్రారంభించారు. ఇనుప రాడ్లు, బలమైన అల్యూమినియం స్తంభాలతో పటిష్టంగా 120్ఠ130 మీటర్లు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. వేదిక విశాలంగానే ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ఉన్న విస్తీర్ణం ప్రకారం సుమారు 35 వేల మంది బహిరంగ సభ ఆవరణలో కూర్చునే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణాలకు ప్రహరీ, పడమర వైపున స్టేట్‌ హైవే ఉంది. తూర్పున పొలాలు, రియల్‌ ఎస్టేట్‌ స్థలాలు ఉన్నాయి. 

నాలుగు హెలీప్యాడ్‌లు ఏర్పాటు 

పెద అమిరం వద్ద మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు స్థలంలో నాలుగు ప్రత్యేక హెలీప్యాడ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, కేంద్రమంత్రులు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రానున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్‌ నుంచి సభా స్థలికి మూడు కిలోమీటర్లు దూరం వాహనాలద్వారా ప్రధానిని తీసుకువెళ్ళనున్నారు. జిల్లా ఎస్పీ యూ.రవిప్రకాష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాలు, ఎస్‌పీజీ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు, జిల్లా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. 

వాహనాల మళ్లింపు ఇలా.. : ఎస్పీ 

భీమవరం క్రైం, జూన్‌ 30 :  ప్రధాని మోదీ ఈనెల 4న పెదఅమిరం గ్రామానికి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరం గ్రామం, వేగేశ్న ఫౌండేషన్‌ సమీపంలోని ఆనందరాజు స్థలంలో నిర్వహించే బహిరంగ సభకు వచ్చేవారు కింద తెలిపిన విధంగా రావాలని జిల్లా ఎస్పీ యు. రవిప్రకాష్‌ తెలిపారు. 

గుడివాడ, ముదినేపల్లి, ఉండి, పెదఅమిరం రైల్వే గేట్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, వేదిక 

సింగరాయపాలెం, ఏలూరుపాడు, అయి భీమవరం, ఆకివీడు, వేదిక 

నారాయణపురం, గణపవరం, పెదఅమిరం రైల్వేగేట్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, వేదిక 

 కాళ్ళ, జక్కరం, వాండ్రం, ఉండి, పెదఅమిరం రైల్వే గేట్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, వేదిక

తాడేపల్లిగూడెం, గరగపర్రు, బివిరాజు విగ్రహం, ఎన్టీయార్‌ విగ్రహం, వేదిక 

తణుకు, అత్తిలి, పాలకోడేరు, ఏఎంసీ భీమవరం, భాష్యం స్కూల్‌, బీవీ రాజు విగ్రహం, వేదిక 

 పెనుగొండ, బ్రాహ్మణచెరువు, వీరవాసరం, నరసయ్య అగ్రహారం, భాష్యం స్కూల్‌, వేదిక 

పాలకొల్లు, వీరవాసరం, నరసయ్య అగ్రహారం, కోడవల్లి రోడ్‌, భాష్కం స్కూల్‌, బీవీ రాజు విగ్రహం, వేదిక 

 నరసాపురం, మత్స్యపురి, తాడేరు, గునుపూడి, ప్రకాశంచౌక్‌, మల్టీఫ్లెక్స్‌, వేదిక

 కాళీపట్నం, గంగానమ్మ ఆలయం, పొట్టి శ్రీరాములు విగ్రహం, మల్టీఫ్లెక్స్‌, వేదిక 

 లోసరి, గొల్లవానితిప్ప, అంబేద్కర్‌ సెంటర్‌, మల్టీఫ్లెక్స్‌, జడ్డు బ్రహ్మాజీ కళ్యాణ మండపం, వేదిక (వేగేశ్న ఫౌండేషన్‌)

పై రూట్లలో సభ వద్దకు చేరే వాహనాలు.. బస్సులు 1. అబ్బాయి రాజు కాలనీ ఖాళీ స్థలాలు ఎదురుగా 2. శ్రీరామ ఐస్‌ కోల్డ్‌ స్టోరేజ్‌, భీమాస్‌ హోటల్‌ ఎదురుగా, 3. వెస్ట్‌బెర్రీ స్కూల్‌, 4. రాధాకృష్ణ కన్వెన్షన్‌ సెంటర్‌, 5. ప్లోరింజా లేఅవుట్లు పెదఅమిరం, 6. కేబుల్‌ శ్రీను సిమెంట్‌ రోడ్‌ లేఅవుట్‌, 7. హైద్రాబాద్‌ డీటీసీపీ లేఅవుట్‌, 8. ఎన్టీఆర్‌ విగ్రహం ఓపెన్‌ సైట్‌కు ఎదురుగా, 9. ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల ప్లే గ్రౌండ్‌, 10. ఎస్‌ఆర్‌కేఆర్‌ కళాశాల 

కార్లు 1. వేదిక (వేగేశ్న ఫౌండేషన్‌) కాంపౌండ్‌ వాల్‌ పక్కన వీఐజీ/ప్రభుత్వం, అధికారులు/మీడియా, 2. శ్రీరామ ఐస్‌ కోల్డ్‌ స్టోరేజీ పక్కనగల ఖాళీ స్థలము, 3. కేన్సర్‌ ఆసుపత్రి, 4. చినఅమిరం ఆంజనేయస్వామి ఆలయం వెనుక వైపు, 5. విజ్ఞాన భారతి స్కూల్‌, 6. పెట్రోల్‌ బంక్‌ ఎదురుగా ఉన్న బి స్క్వేర్‌.

మోటార్‌ సైకిళ్లు.. 1. కేన్సర్‌ హాస్పిటల్‌ లేఅవుట్‌లు ఎదురుగా, 2. విజ్ఞాన భారతి స్కూల్‌ స్థలముగా నిర్ణయించారు. బీవీ రాజు విగ్రహం నుంచి గోకరాజు గంగరాజు స్థలం నుంచి వేగేశ్న వారి స్థలం వరకు వాహనాల రాకపోకలకు 4వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించబడవన్నారు. ఈ రోడ్ల నందు ఎటువంటి వాహనాలు పార్కింగ్‌ చేయరాదని ఎస్పీ తెలి పారు. బీవీ రాజు విగ్రహం నుంచి జడ్డు బ్రహ్మాజీ కల్యాణ మండపం, పెదఅమిరం పుంత వైపు వెళ్లే దారిలో వ్యతిరేక దిశలో వచ్చిన వాహనాలు అనుమతించబడవు. జక్కరం నుంచి ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీ, అడ్డవంతెన, బీవీ రాజు విగ్రహం వరకు ఉన్న రోడ్లు పోలీసు వారి ఆధీనంలో ఉంటుందన్నారు. సభా ప్రాంగణానికి చేరు క్రమంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులు ఇచ్చే సలహాలను పాటించాలని ఎస్పీ కోరారు. 


అల్లూరి అందరివాడు : కలెక్టర్‌ ప్రశాంతి 

భీమవరం టౌన్‌, జూన్‌ 30 : భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు అల్లూరి సీతారామరాజు అందరివాడని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్స వంలో భాగంగా సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని గురువారం ప్రకాశం చౌక్‌నుంచి విద్యార్థులతో 125 అడుగల జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జేసీ జేవీ మురళీ, ఆర్డీవో దాసిరాజు, డీఈవో ఆర్‌. వెంకట రమణ, తదితరులు పాల్గొన్నారు. 

పశ్చిమలో అల్లూరి పుట్టడం అదృష్టం : జడ్పీ చైర్మన్‌ శ్రీనివాస్‌

పోడూరు, జూన్‌ 30 : అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరిలో జిల్లాలో పుట్టడం జిల్లావాసుల అదృష్టమని అల్లూరి 125వ జయంతి వేడుకలతో ప్రపంచవ్యాప్తంగా జిల్లా పేరు మార్మోగనుందని జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం పోడూరులో 125 అడుగల జాతీయజెండాతో భారీ ర్యాలీని నిర్వహించారు. సర్పంచ్‌ శెట్టిబత్తుల సువర్ణరాజు జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి పోరాటాలు స్ఫూర్తిదాయకం

నరసాపురం టౌన్‌, జూన్‌ 30: అల్లూరి సీతారామరాజు పశ్చిమలో జన్మించడం మన అదృష్టమని, ఆయన పోరాటాలు, త్యాగాలు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. అల్లూరి 125 జయంతి వేడుకలను పురస్కరించుకుని గురువారం పట్టణంలో 125 అడుగుల జాతీయ జెండా చేతబట్టి భారీ ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి చదివిన టేలర్‌ హైస్కూల్‌ నుంచి ప్రారంభమయైు ప్రదర్శన పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా గాంధీ విగ్రహం వరకు సాగింది. పలు శాఖల అధికారులు, విద్యార్థులు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు సాగారు. 

తణుకులో జాతీయ జెండాతో ర్యాలీ

తణుకు, జూన్‌ 30: మహానుభావుల ప్రాణత్యాగం వల్లే స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని మునిసిపల్‌ కమిషనర్‌ జి. సృజన అన్నారు.  ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 125 అడుగులు భారీ జాతీయ జెండాతో పలు శాఖల ఉద్యోగులతో తణుకు బాలుర ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. ముక్కామల స్కూల్‌ ఉపాధ్యాయుడు కోట రాంప్రసాద్‌ అల్లూరి సీతారామరాజు వేషధారణ ఆకట్టుకుంది. ఎంఈవో శ్రీనివాసరావు, ఇన్‌చార్జి డీవైఈవో ప్రేమజ్యోతి, హెచ్‌ఎం ప్రసాదు, ఉపాధ్యాయుడు టీజే ప్రభువరం, ఎంపీపీ ధనరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:10:03+05:30 IST