యువతకు కొత్త మంత్రం చెప్పిన మోదీ

ABN , First Publish Date - 2022-01-13T00:05:14+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని యువతకు నవ

యువతకు కొత్త మంత్రం చెప్పిన మోదీ

పుదుచ్చేరి : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని యువతకు నవ భారత మంత్రాన్ని చెప్పారు. ‘పోటీ పడటం, జయకేతనం ఎగురవేయడం’ ఈ మంత్రమని చెప్పారు. దీనిని అనుసరిస్తూ బలమైన దేశాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ప్రాణత్యాగాలు చేసినప్పటికీ గుర్తింపు పొందలేకపోయిన స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలపై పరిశోధన చేయాలని, వారి చరిత్రలను రాయాలని కోరారు. పుదుచ్చేరిలో స్వామి వివేకానంద జయంత్యుత్సవాలను మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 


యువత సమైక్యంగా నిలవాలని, యుద్ధాలను గెలవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్, పారాలింపిక్స్ పోటీల్లో భారతీయుల ప్రతిభను ప్రస్తావించారు. ఆత్మ విశ్వాసంతో మునుపెన్నడూ లేనివిధంగా పతకాలను సాధించారని తెలిపారు. టీకాకరణ కార్యక్రమంలో యువత భాగస్వాములవుతున్నారని, ఇది వారికిగల గెలవాలనే తపనకు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే భావనకు నిదర్శనమని తెలిపారు.  వారికి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని, అవసరమైన వనరులను సమకూర్చుతోందని చెప్పారు. ‘శ్రేష్ఠ భారత్, ఒకే భారత దేశం’కు గొప్ప ఉదాహరణ పుదుచ్చేరి అని తెలిపారు. యువత నేర్చుకోవడానికి ఇక్కడ చాలా ఉందన్నారు. భారత దేశ జనాభా పడుచుదనంలో ఉందని, భారత దేశ మనసు కూడా యవ్వనంలో ఉందని చెప్పారు. నేడు ప్రపంచం ఎన్నో ఆశలతో భారత దేశంవైపు చూస్తోందన్నారు. భారత దేశాన్ని రేపటి గళంగా పరిగణిస్తోందన్నారు. ఆలోచనలు, చైతన్యం కూడా యవ్వనంలో ఉన్నట్లు తెలిపారు. భారత దేశ యువత జనాభాపరమైన లాభాంశమని చెప్పారు. దేన్నైనా సాధించగలమనే స్ఫూర్తి, చైతన్యం నేటి యువతకు ఉన్నాయని, ఇది ప్రతి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.


పుదుచ్చేరి ఆధ్యాత్మిక, సాహిత్య చరిత్రలో ప్రముఖులైన శ్రీ అరబిందో 150వ జయంతి, మహాకవి సుబ్రహ్మణ్య భారతి 100వ జయంతి సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత దేశ యువతకు శ్రమించే తత్వం ఉందని, తమ భవిష్యత్తు గురించి స్పష్టత ఉందని తెలిపారు. పాత మూస పద్ధతుల భారాన్ని వారు మోయబోరన్నారు. కొత్త సవాళ్ళ ఆధారంగా పరిణామం చెందుతారని చెప్పారు. గతంలో దేశానికి స్వాతంత్ర్యం రావాలనే ఆకాంక్షతో ప్రాణత్యాగాలు చేసేవారని, ఇప్పుడు అలా కాకుండా దేశం కోసం జీవించాలని అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల కలలను నెరవేర్చాలన్నారు. మన యువత ప్రపంచ సౌభాగ్య స్మృతిని లిఖిస్తున్నారన్నారు. 


Updated Date - 2022-01-13T00:05:14+05:30 IST