మధుర, ఇండోర్ దుర్ఘటనలపై మోదీ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2022-05-07T20:25:43+05:30 IST

ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 14 మంది

మధుర, ఇండోర్ దుర్ఘటనలపై మోదీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో జరిగిన ప్రమాదాల్లో దాదాపు 14 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి Narendra Modi తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 


PMO ఇచ్చిన ఓ ట్వీట్‌లో, Uttar Pradeshలోని మధురలో జరిగిన రోడ్డు ప్రమాదం హృదయ విదారకమని మోదీ తెలిపారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి మృతి పట్ల తాను తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు. 


Madhya Pradeshలోని ఇండోర్‌లో అగ్ని ప్రమాదం జరగడం తీవ్ర విచారకరమని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గాయపడినవారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో యమున ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీరు హర్దోయిలో ఓ వివాహానికి హాజరై తిరిగి నోయిడా వెళ్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు, వేరొక వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. గాయపడిన ఓ చిన్నారిని, ఓ పురుషుడిని ఆసుపత్రికి తరలించారు. 


మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ నగరం, విజయ్ నగర్ కాలనీలో రెండు అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని పోలీస్ కమిషనర్ హెచ్ఎన్ మిశ్రా చెప్పారు. ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారన్నారు. కొందరు భవనంపై నుంచి క్రిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నట్లు తెలిపారు. ఈ భవనంలో ఇరుకు ఇరుకుగా 10 ఫ్లాట్స్ ఉన్నాయని, ఊపిరి ఆడకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. 


మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి కారణం విద్యుదాఘాతమని తెలుస్తోంది. 


యమున ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి Yogi Adityanath తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి రాష్ట్ర ప్రభుత్వం చికిత్స చేయిస్తుందని తెలిపారు. 


Read more