PM Modi made a late night call: అర్ధరాత్రి కాల్ చేసిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-09-24T02:19:38+05:30 IST

న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు 2016లో ఓ అర్ధరాత్రి ఫోన్ చేసిన ఘటనను విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పంచుకున్నారు.

PM Modi made a late night call: అర్ధరాత్రి కాల్ చేసిన ప్రధాని మోదీ

న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు 2016లో ఓ అర్ధరాత్రి ఫోన్ చేసిన ఘటనను విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పంచుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన మోదీ ఎట్ 20, డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం చెప్పారు. జై శంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.  ఆఫ్ఘనిస్థాన్‌ మజర్ ఎ షరీఫ్‌లోని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడి జరిగిన అర్ధరాత్రి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసి మెలకువగా ఉన్నారా అని అడిగారని జై శంకర్ గుర్తు చేసుకున్నారు. నాడు విదేశాంగ కార్యదర్శి పదవిలో ఉన్న తాను ప్రధానికి ఘటన వివరాలు చెప్పానని జై శంకర్ తెలిపారు. అంతేకాదు భారత్ నుంచి సాయం కోసం ప్రయత్నిస్తున్నామని ఇందుకు రెండు, మూడు గంటల సమయం పడుతుందని, పని పూర్తయ్యాక ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేస్తానని ప్రధానికి చెప్పినట్లు జై శంకర్ వివరించారు. అయితే అప్పుడు పని పూర్తయ్యాక నేరుగా తనకే ఫోన్ చేయమని ప్రధాని చెప్పారని జై శంకర్ తెలిపారు. ప్రధాని మోదీలోని అసాధారణ నాయకత్వ లక్షణానికి ఇదొక ఉదాహరణ అని ఆయన కీర్తించారు. క్లిష్ట సమయాల్లో ప్రధాని ఎల్లప్పుడూ వెంటే ఉంటారని విదేశాంగ మంత్రి చెప్పారు.  


సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు జై శంకర్ విదేశాంగ కార్యదర్శిగా ఉండేవారు. సుష్మా స్వరాజ్ కన్నుమూయడంతో ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి పదవికి జై శంకర్‌ను ఎంపిక చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. ఏ మాత్రం రాజకీయాలతో సంబంధంలేని ఓ అధికారిని విదేశాంగ మంత్రిగా చేయడం ప్రధాని మోదీకే చెల్లింది. జై శంకర్ కూడా ప్రధాని తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత వాణిని విజయవంతంగా వినిపిస్తున్నారు. క్లిష్టమైన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా సమాధానాలు చెప్పే జై శంకర్ అంతర్జాతీయ వేదికలపై అనేకమంది నోరుమూయించారు. ఉక్రెయిన్‌తో యుద్ధవేళ రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేయడాన్ని యూరప్ దేశాలు ప్రశ్నించినప్పుడు జై శంకర్ ఇచ్చిన సమాధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. యూరప్ దేశాలు ఒకరోజు దిగుమతి చేసుకునేంత చమురును భారత్ ఒక నెల కోసం దిగుమతి చేసుకుందని గుర్తు చేశారు. ముందు యూరప్ దేశాల వైఖరి గురించి మాట్లాడి తర్వాత భారత్ విషయానికి రావాలని జై శంకర్ సూచించడం ప్రకంపనలు రేపింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జై శంకర్ నిర్ణయాన్ని నిరంతరం పొగుడుతుంటారు. బహిరంగసభల్లో స్క్రీన్‌లు పెట్టి మరీ జై శంకర్ మాట్లాడిన దృశ్యాలను ఇమ్రాన్ తన పార్టీ కార్యకర్తలకు తరచూ చూపిస్తూ ప్రశంసలు కురిపిస్తుంటారు. భారత విదేశాంగ విధానం స్వేచ్ఛగా, కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని ఇమ్రాన్ కీర్తిస్తుంటారు. 


Updated Date - 2022-09-24T02:19:38+05:30 IST