Abn logo
Oct 17 2020 @ 00:29AM

మోదీ సాహసోపేత సంస్కర్తేనా?

స్థూలదేశీయోత్పత్తి పెరుగుదల రేటును అధికం చేయడంతో పాటు ఆ వృద్ధిని వేగవంతంగా సాధించిందా లేదా అన్నదే ఒక సంస్కరణకు అంతిమ పరీక్ష. ఈ నిరాక్షేపణీయ ప్రమాణం ప్రకారం డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం భారత ఆర్థికవ్యవస్థకు బాగా కలిసొచ్చిన కాలం. ఆ అభివృద్ధి సాధన ఆయనను ఉత్తమ సంస్కర్తగా నిలబెడుతుంది. నరేంద్ర మోదీ గారూ, మీరు గొప్ప ఆర్థిక సంస్కర్తల శ్రేణిలో ఒకరుగా వెలుగొందాలని ఆరాటపడుతున్నారు. ఇదేమీ ఆక్షేపణీయం కాదు. మీరు ఆ ప్రశస్త ప్రఖ్యాతిని ఆకాంక్షించే ముందు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగిన అభివృద్ధిని అందించండి. 


మనమందరమూ తప్పక ఏకీభవించే విషయం ఒకటి ఉంది. మన ప్రస్తుత పాలకుల స్వోత్కర్షే ఆ అంశం. తమ ప్రభుత్వ భావాలు, విధానాలు, చర్యల గురించి ఘనంగా ప్రచారం చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వంలా మరే పాలక పక్షం ప్రభుత్వం విజయవంతం కాలేదు. అంతేకాదు, సొంత ఘనత (లేనప్పటికీ) చాటుకోవడం కోసం ఎంత ధనమయినా ఖర్చు పెట్టడానికి, మిత్రులను సతాయించడానికి, ప్రత్యర్థులను బెదిరించడానికి, రాజ్యాంగ సంస్థలను లొంగదీసుకోవడానికి కూడా బీజేపీ, మోదీ సర్కార్ వెనుదీయవు. ఈ విషయాలలో వీటికి సాటి రాగల పాలక పక్షం ప్రభుత్వం మరేదీ లేదు. 


అతిశయోక్తి మన పాలకుల సహజ భాషణ. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ‘ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ మన దేన’ని పాలకులు పదేపదే చెబుతూ వచ్చారు. కానీ వాస్తవమేమిటంటే, మన ఆర్థికవ్యవస్థ అంతకంతకూ అంతులేని అగాధంలోకి అత్యంత వేగంగా జారిపోతూనే ఉంది. మరి అభివృద్ధి గురించి అంతగా ఊదరగొట్టడం ఎందుకు? ఆ పటాటోప ప్రచార ఏకైక లక్ష్యం నరేంద్రమోదీని భారతదేశ మహోన్నత నాయకుల శ్రేణిలో చేర్చడమే సుమా! 


ఇటీవలి దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా మన ఆర్థికవ్యవస్థ పనితీరు అధ్వాన్నమైపోయింది. వరుసగా ఎనిమిది త్రైమాసికాలలో మన వృద్ధిరేటు పడిపోతూ 2020-–21 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో మహా ఘోరంగా 23.9 శాతానికి దిగజారిపోయింది. అయినప్పటికీ నరేంద్ర మోదీని ఒక సాహసోపేత సంస్కర్తగా నిలబెట్టేందుకు ప్రస్తుత పాలకులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మోదీకి సరికొత్తగా కీర్తి హారతి పట్టిన వారిలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అరవింద్ పనాగరియా ఒకరు. ‘ఒక సంస్కర్తగా నరేంద్ర మోదీ తన యోగ్యతలను తిరుగులేని విధంగా నిరూపించుకున్నారు. సంస్కరణలతో దేశ ఆర్థికవ్యవస్థకు వినూత్న జవసత్వాలు సమకూర్చడంలో నరేంద్ర మోదీది పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయిలతో సమస్థానం’- అని ఆయన ప్రస్తుతించారు. మహాసంస్కర్తలుగా ఆయన పేర్కొన్న జాబితాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు లేకపోవడం గమనార్హం. పనాగరియా తన వాదనను సమర్థించుకోవడానికి ఐదు సంస్కరణలను పేర్కొన్నారు.


అవి:

(1) దివాలా చట్టం: 2008లో రఘురామ్ రాజన్ నివేదికలో ఈ చట్టానికి సంబంధించిన తొలి భావనలు అంకురించాయి. 2013లో కేంద్ర ప్రభుత్వ కార్యదర్శుల కమిటీ వాటిని అభివృద్ధి పరిచింది. 2013–-14లో అవి ఒక ముసాయిదా బిల్లు రూపాన్ని సంతరించుకున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం నేతృత్వంలో దివాలా చట్టం అమలులోకి వచ్చింది. ఆ చట్టంలో పలు లొసుగులు ఉన్నాయి. సవరణలతో వాటిని తొలగించి చట్టాన్ని మెరుగుపరిచే ప్రయత్నాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాల ఫలితాలు సంతృప్తికరంగా లేవు. వీటి మంచి చెడుల ఘనత పూర్తిగా మోదీదేననడంలో సందేహం లేదు.


(2) కార్మిక చట్టాల సంస్కరణలు: చట్టాల క్రోడీకరణ పరిపాలనాపరమైన చర్యేగానీ కొత్తపుంతలు తొక్కే సంస్కరణ కాదు. తమ ఇష్టానుసారం కార్మికులను నియమించుకోవడం, తొలగించేందుకు యాజమాన్యాలకు ఈ సంస్కరణలు తగు స్వేచ్ఛ నిచ్చాయి. శక్తిమంతమైన కార్మిక సంఘాలు ఉన్న సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో సైతం ఒక ‘మంచి కారణానికి’ మినహా కార్మికులు ఎవరినీ తొలగించడానికి వీలులేదు. కార్మికుల విషయంలో యాజమాన్యాల నిర్హేతుక చర్యలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తప్పక పోరాడుతాయి. మరి మన దేశంలో సంఘటితమైన కార్మికుల సంఖ్య చాలా తక్కువ. చట్టమే వారికి రక్షణ. ఇప్పుడు కూడా ఒక కార్మికుడికి ఒక సహేతుకమైన కారణంతో ఉద్వాసన చెప్పవచ్చు. కొత్త కార్మిక చట్టాల వల్ల కార్మికులు, కాంట్రాక్టు కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే ధోరణులు బలపడుతాయి. యాజమాన్యాలకే లబ్ధిని సమకూర్చే మార్పు ఇది. ఉద్యోగ భద్రత అనేది కార్మికుని నైపుణ్యం, సమర్థతకు ఒక శక్తి మంతమైన ప్రోత్సాహకమవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థకు మొత్తంగా మేలు జరుగుతుంది. కొత్త కార్మిక చట్టాలు కార్మికుల ఉద్యోగ భద్రతను తీవ్రంగా దెబ్బ కొట్టాయి. కనుకనే భారతీయ మజ్దూర్ సంఘ్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అనుబంధ సంస్థ) సైతం ఈ కొత్త చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చిత్తశుద్ధితో కూడిన సిసలైన కార్మిక సంస్కరణలను  రూపొందించాలంటే కార్మిక సంఘాలు, కార్మికులను విశ్వాసంలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.


(3) వ్యవసాయ చట్టాలు: కొత్త వ్యవసాయ చట్టాల గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. వ్యవసాయ ఉత్పత్తులను సేకరించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతులు అనేక సమస్యలకు తావిస్తున్నాయి. వాటిని సంస్కరించవలసిన అవసరమున్నది. అయితే మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవపాయ చట్టాలు రోగం కంటే మందులు మరింత ప్రమాదమైనవి అయిన చందంగా ఉన్నాయి. మండి వ్యవస్థలో అనేక లొసుగులు ఉన్నాయనడంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు. అయితే ఆ వ్యవస్థను బలహీనపరచడమనేది సమస్యకు పరిష్కారం కాదనే నా సునిశ్చిత అభిప్రాయాన్ని పునరుద్ఘాటిస్తున్నాను. మరి పరిష్కారమేమిటి? పెద్ద గ్రామాలు, చిన్న పట్టణాలలో వేలాది రైతుల మార్కెట్లను సృష్టించడమే. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఉత్పత్తిదారుకు అందే విధంగా క్రయవిక్రయాలు సాగాలి. ఈ ప్రక్రియను చట్టబద్ధం చేయాలి. కార్పొరేట్ కంపెనీల ప్రవేశానికి అనుమతి ఇవ్వడం, పూర్తిగా అనియంత్రిత వ్యాపార వాతావరణాన్ని కల్పించడం ‘సంస్కరణ’ ఎంత మాత్రం కాదు. అరవింద్ పనాగరియా వాదనను ఒప్పుకోవడానికి మేము సిద్ధమే. అయితే ఆయన ముందు ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలి. మనదేశంలో అత్యధిక దిగుబడులు సాధించే రైతులు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందినవారే కదా. మరి వారే కొత్త వ్యవపాయ చట్టాలకు వ్యతిరేకంగా వీథుల్లో ఎందుకు ఉద్యమిస్తున్నారు?


(4) వైద్య విద్యా సంస్కరణలు: భారత వైద్యమండలి (ఎం‌సిఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎం‌సి)ను ఏర్పాటుచేయడంలో మౌలిక సంస్కరణ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఎం‌సిఐ చాలా సంవత్సరాల పాటు మోదీ సన్నిహిత మిత్రుడి నియంత్రణలో ఉన్నదనేది ఒక వాస్తవం. ఎం‌సిఐ స్థానంలో ఒక కొత్త సంస్థను నెలకొల్పాలనే భావన యూపీ ఏ ప్రభుత్వాల హయాంలోనే అంకురించింది. ఎన్‌ఎంసి తన విధులను రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించగలిగితేనే వైద్య విద్యారంగానికి మేలు జరగుతుంది. ఎన్‌ఎంసి సైతం ఏదో ఒక విధంగా బీజేపీ నియంత్రణలోకి వెళ్ళే ప్రమాదముందని పలువురు ఇప్పటికే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వివిధ విశ్వవిద్యాలయాలతో సహా పలు ఉన్నత విద్యాసంస్థల వ్యవహారాలలో బీజేపీ ఇప్పటికే తన మాటను నెగ్గించుకుంటున్నది కదా.


(5) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సరళీకరణ: పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలో ఎఫ్డిఐ సరళీకరణను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. 1997లో బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలు, విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకై నేను 1997లో పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టాను. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం పట్ల పక్షపాతం ఉంది. అయితే దాని విషయంలో ఆయన జాగరూకతతో వ్యవహరించే నాయకుడు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఆరంభదశలో ఉన్న గుత్తాధిపత్యాలను ఆయన సమర్థిస్తున్నారు. సాహసోపేత సంస్కరణలను తీసుకురావాలని మోదీ ఆశిస్తుంటే వాటిని ఆయన నిజంగా అమలుపరచగలరు. ఎందుకంటే లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. అటువంటి వెసులుబాటు నరసింహారావుకు గానీ, మన్మోహన్‌సింగ్‌కు గానీ లేదు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరుగుదల రేటును అధికం చేయడంతో పాటు ఆ వృద్ధిని వేగవంతంగా సాధించిందా లేదా అన్నదే ఒక సంస్కరణకు అంతిమ పరీక్ష. ఆ సంస్కరణ సాఫల్యతకు అదే సరైన గీటురాయి. ఈ నిరాక్షేపణీయ ప్రమాణం ప్రకారం డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాం భారత ఆర్థిక వ్యవస్థకు బాగా కలిసొచ్చిన కాలం. ఆ అభివృద్ధి సాధన ఆయనను ఉత్తమ సంస్కర్తగా నిలబెడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నరేంద్ర మోదీ గారూ, మీరు గొప్ప ఆర్థిక సంస్కర్తల శ్రేణిలో ఒకరుగా వెలుగొందాలని ఆరాటపడుతున్నారు. ఇదేమీ ఆక్షేపణీయం కాదు. అయితే మీరు ఆ ప్రశస్త ప్రఖ్యాతిని ఆకాంక్షించే ముందు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగిన అభివృద్ధిని అందించండి.పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Advertisement
Advertisement
Advertisement