నీట్‌కు మినహాయింపు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-05-27T13:23:24+05:30 IST

తను అధికారం చేపట్టిన ఏడాది తరువాత తొలిసారిగా వచ్చిన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పలు వినతులు సమర్పించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న

నీట్‌కు మినహాయింపు ఇవ్వండి

- కచ్చాదీవి విముక్తికి చర్యలు చేపట్టండి

- అధికారిక భాషగా తమిళం 

- ప్రధానికి స్టాలిన్‌ వినతి


చెన్నై: తను అధికారం చేపట్టిన ఏడాది తరువాత తొలిసారిగా వచ్చిన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పలు వినతులు సమర్పించారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న ఆదాయాన్ని గుర్తు చేస్తూ.. అందులో రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది అంతంతమాత్రమేనంటూ విడమర్చి లెక్కలు చెప్పారు. స్నేహ హస్తాన్ని అందిస్తామంటూనే.. హక్కుల్ని వదులకునే ప్రసక్తే లేదని, వాటి కోసం నినదిస్తూనే వుంటామని తేల్చి చెప్పారు. స్థానిక నెహ్రూస్టేడియంలో గురువారం సాయంత్రం జరిగిన కొత్త పథకాల ప్రారంభోత్సవం, కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ... తమిళ జాలర్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించే దిశగా కచ్చాదీవికి విముక్తి కల్పించి దానిని తమిళ జాలర్లు చేపలవేటాడే ప్రాంతంగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. నీట్‌ మినహాయింపు బిల్లుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాచీన భాష తమిళాన్ని హిందీతో సమానంగా కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక భాషగా ప్రకటించాలని, మద్రాసు హైకోర్టులో ఆ భాషను అధికారికభాషగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రానికి ఈ నెల 15వ తేదీ వరకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.14వేల కోట్లకు పైగా ఉన్న జీఎస్టీ బకాయిలను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తన డిమాండ్లలో దాగిన సామాజిక న్యాయాన్ని గుర్తించి ప్రధాని తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతుతో డీఎంకే అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలకు అవసరమైన పథకాలను ప్రారంభించేందుకు విచ్చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధిచెందుతోందని, విద్య, వైద్య, ఆర్థిక, వ్యవసాయ, ఎగుమతులు, మానవవనరుల అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం ముందజలో ఉందని చెబుతూ దేశాభివృద్ధిలో రాష్ట్ర భాగస్వామ్యమే అధికమని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికపరంగానే కాకుండా సామాజిక న్యాయం, మహిళాభ్యుదయం, సమానత్వంలోనూ ప్రగతిపథంలో పయనిస్తూ ద్రావిడ మోడల్‌ పాలన అందిస్తోందని తెలిపారు. దేశంలోని స్వదేశీ ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్ర వాటా 9.22 శాతంగా ఉందని, కేంద్రం పొందుతున్న మొత్తం రెవెన్యూలో 6 శాతం వాటాను, దేశంలోని మొత్తం ఎగుమతుల్లో 8.4 శాతం వాటా, జౌళి ఎగుమతుల్లో 19.4 శాతం వాటా, కార్ల ఎగుమతుల్లో 32.5 శాతం వాటా, తోలు వస్తువుల ఎగుమతుల్లో 33 శాతం వాటాను కలిగి ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం పన్నుల రూపంలో పొందుతున్న రెవెన్యూలో రాష్ట్రవాటాగా 1.21 శాతం మాత్రమే లభిస్తోందని వాపోయారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల్లోనూ భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పథకాలల్లో రాష్ట్ర ప్రభుత్వమే అధికంగా నిధు లు కేటాయిస్తోందని, ఉదాహరణ జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రం రూ.18వేల కోట్లకు పైగా నిధులు సమకూర్చుతోందని వెల్లడించారు. ఉమ్మడి పథకాలను ప్రారంభించేటప్పుడు కేంద్రం భారీగా నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించి, ఆ పథకా లు పూర్తయ్యేనాటికి క్రమంగా నిధుల్లో కోత పెడుతుండటం ఆనవాయితీగా మారిందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పినట్లు ‘స్నేహం కోసం చేతులు చాస్తాం... హక్కుల కోసం నినదిస్తాం’ అన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని స్టాలిన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

Updated Date - 2022-05-27T13:23:24+05:30 IST