న్యాయస్థానాల్లో స్థానిక భాషలను వాడాలి : మోదీ

ABN , First Publish Date - 2022-04-30T21:33:13+05:30 IST

న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ఉపయోగించాలని ప్రధాన మంత్రి

న్యాయస్థానాల్లో స్థానిక భాషలను వాడాలి : మోదీ

న్యూఢిల్లీ : న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ఉపయోగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక భాషలను ఉపయోగిస్తే సామాన్యులకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని, మరింత సన్నిహితమయ్యామనే భావన వారికి కలుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. 


‘‘న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. దీనివల్ల న్యాయ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా తాము మరింత సన్నిహితమయ్యామనే భావన వారికి కలుగుతుంది’’ అని మోదీ చెప్పారు. 


న్యాయం సులువుగా అందడానికి వీలుగా కాలం చెల్లిన చట్టాలను రద్దు చేయాలని ముఖ్యమంత్రులను మోదీ కోరారు. ప్రస్తుత కాలానికి సరిపడని సుమారు 1,800 చట్టాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. వీటిలో 1,450 చట్టాలను రద్దు చేశామన్నారు. అయితే ఇటువంటి 75 చట్టాలను మాత్రమే రాష్ట్రాలు రద్దు చేశాయన్నారు.  

మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోబోతున్న తరుణంలో న్యాయం సులువుగా అందుబాటులో ఉండే న్యాయ వ్యవస్థను సృష్టించడంపై దృష్టి ఉండాలని చెప్పారు. న్యాయం వేగంగా, ప్రతి ఒక్కరికీ అందే విధంగా న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలన్నారు. 


మన దేశంలో రాజ్యాంగ పరిరక్షకురాలి పాత్రను న్యాయ వ్యవస్థ పోషిస్తోందన్నారు. చట్టసభలు ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యంవహిస్తాయన్నారు. ఈ రెండిటి కలయిక సమర్థవంతమైన, నిర్ణీత కాలంలో న్యాయాన్ని అందజేసే న్యాయ వ్యవస్థకు రోడ్‌మ్యాప్‌‌ను సిద్ధం చేస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. 


Updated Date - 2022-04-30T21:33:13+05:30 IST