టీకాలను వృథా చేయొద్దు : మోదీ

ABN , First Publish Date - 2021-04-11T20:53:03+05:30 IST

కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్‌ కోసం జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం

టీకాలను వృథా చేయొద్దు : మోదీ

న్యూఢిల్లీ : కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్‌ కోసం జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమం ‘టీకా ఉత్సవ్’లో టీకాలను వృథా చేయవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సాధ్యమైనంత వరకు అత్యధిక సంఖ్యలో టీకాలను ఇవ్వాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19 మహమ్మారిపై రెండో యుద్ధంగా ఈ ఉత్సవాలను అభివర్ణించారు. 


టీకా ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దేశంలో కరోనా వైరస్ రెండోసారి విజృంభించిన నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమం గురించి ప్రకటించారు. జ్యోతిబా ఫూలే జయంతి నుంచి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వరకు ఈ ఉత్పవాలు జరుగుతాయని మోదీ ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. 


టీకా ఉత్సవాలు కోవిడ్-19పై రెండో యుద్ధానికి నాంది అని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతను పాటించాలన్నారు. మన దేశంలో జన సాంద్రత ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఈ వైరస్ మహమ్మారి వ్యాప్తిపై పోరాడేందుకు మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. సాధ్యమైనంత ఎక్కువమంది అర్హులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, సున్నా వ్యాక్సిన్ అయినా వృథాకారాదని దృఢంగా నిర్ణయించుకోవాలని అన్నారు.  టీకా ఉత్సవ్ జరిగే నాలుగు రోజుల్లో కనీసం ఒక వ్యాక్సిన్ అయినా వృథా కాకపోతే మన వ్యాక్సినేషన్ సామర్థ్యం పెరిగినట్లేనని తెలిపారు. 


ప్రతి ఒక్కరూ మరొకరికి టీకా వేయించాలన్నారు. నిరక్షరాస్యులకు, వృద్ధులకు వ్యాక్సినేషన్‌కు సహాయపడాలన్నారు. వ్యాక్సినేషన్ సదుపాయాల గురించి సమాచారం తెలియనివారికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తనను తాను కాపాడుకోవడంతోపాటు ఇతరులను కూడా కాపాడటం కోసం మాస్క్ ధరించాలని చెప్పారు. ఏదైనా ప్రదేశంలో ఒకరికి కరోనా వైరస్ సోకితే, ఆ ప్రాంతాన్ని మైక్రో కంటెయిన్‌మెంట్ జోన్‌గా ప్రకటించడంలో స్థానికులు సహకరించాలని కోరారు. 


Updated Date - 2021-04-11T20:53:03+05:30 IST