చన్నీ, ప్రియాంకలకు మోదీ ఘాటు ప్రశ్న

ABN , First Publish Date - 2022-02-17T21:40:11+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్

చన్నీ, ప్రియాంకలకు మోదీ ఘాటు ప్రశ్న

చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సూటిగా ప్రశ్నించారు. సంత్ రవిదాస్ ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి చెందినవారని, గురు గోవింద్ సింగ్ బిహార్‌లోని పాట్నాకు చెందినవారని, వీరిని కూడా పంజాబ్‌కు రానివ్వరా? అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ అభిమతం అని అడిగారు. ఆయన పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా గురువారం బీజేపీ కూటమి ప్రచార సభలో మాట్లాడారు. 


కాంగ్రెస్ తన బండి నడవడం కోసం ఎల్లప్పుడూ ఒక ప్రాంత ప్రజలను మరొక ప్రాంతంపై ఎగదోస్తూ ఉంటుందని దుయ్యబట్టారు. పంజాబ్ ముఖ్యమంత్రి బుధవారం ఏం చెప్పారో యావత్తు దేశం విన్నదని చెప్పారు. ఢిల్లీ కుటుంబం, చన్నీ యజమాని (ప్రియాంక గాంధీ) చప్పట్లు కొట్టారన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఎవరిని అవమానిస్తున్నారని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్, బిహార్ నుంచి వచ్చిన ప్రజలు చెమటోడ్చి పని చేయని గ్రామం పంజాబ్‌లో ఏదీ లేదన్నారు. 


సంత్ రవిదాస్ జయంతిని బుధవారం జరుపుకున్నామని, ఆయన ఎక్కడ జన్మించారో చెప్పాలని కాంగ్రెస్ నేతలను అడుగుతున్నానని అన్నారు. ఆయన పంజాబ్‌లో జన్మించారా? అని ప్రశ్నించారు. ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో జన్మించారన్నారు. ఆయన పంజాబ్‌లో అడుగుపెట్టకూడదని మీరు అంటారా? అని ప్రశ్నించారు. ఆయన పేరును మీరు తుడిచేస్తారా? అన్నారు. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు? అన్నారు. 


‘‘గురు గోవింద్ సింగ్ ఎక్కడ జన్మించారని అడుగుతున్నాను. ఆయన పాట్నాలో జన్మించారు. కాబట్టి ఆయనను మీరు అగౌరవపరుస్తారా? అని ప్రశ్నించారు. గురు గోవింద్ సింగ్ జన్మించిన గడ్డను మీరు అవమానిస్తున్నారు’’ అని మోదీ అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని కనీసం ఒక క్షణమైనా పంజాబ్‌ను పరిపాలించనివ్వకూడదన్నారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ఓటర్లను ఉద్దేశించి బుధవారం మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, బిహార్, ఢిల్లీల నుంచి ఎవరినీ పంజాబ్‌లో అడుగుపెట్టనివ్వొదని ఆయన ఓటర్లను కోరారు. ఆయన ఈ మాటలు అంటున్నపుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చప్పట్లు కొడుతూ కనిపించారు. 


Updated Date - 2022-02-17T21:40:11+05:30 IST