వారితో జాగ్రత్త : మోదీ

ABN , First Publish Date - 2021-10-12T22:00:36+05:30 IST

మానవ హక్కులను నచ్చినట్లుగా వివరిస్తున్నవారిని ప్రధాన మంత్రి

వారితో జాగ్రత్త : మోదీ

న్యూఢిల్లీ : మానవ హక్కులను నచ్చినట్లుగా వివరిస్తున్నవారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎండగట్టారు. మానవ హక్కుల ఉల్లంఘనలను రాజకీయ లాభ, నష్టాల దృష్టితో చూసేవారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. వీరి వైఖరి మానవ హక్కులకు మాత్రమే కాకుండా దేశానికి కూడా హానికరమన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు. 


మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్ఆర్‌సీ)ని 1993 అక్టోబరు 12న ఏర్పాటు చేశారు. మానవ హక్కుల పరిరక్షణ, అభివృద్ధి దీని లక్ష్యాలు. ఎన్‌హెచ్ఆర్‌సీ మానవ హక్కుల ఉల్లంఘన కేసులను విచారణకు స్వీకరించి, బాధితులకు నష్టపరిహారం సిఫారసు చేస్తుంది. 


ఎన్‌హెచ్ఆర్‌సీ 28వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడారు. ఒకే విధమైన సంఘటనలు జరిగినపుడు, వీటిని మానవ హక్కులుగా చెప్తున్న కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వేర్వేరు విధాలుగా చూస్తున్నారని అన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన పేరుతో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కూడా కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు. 


మరుగుదొడ్లు, వంట గ్యాస్, విద్యుత్తు, గృహాలు వంటి పేదల మౌలిక అవసరాలను తీర్చేందుకు తన ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పేదలు తమ హక్కుల గురించి మరింత అవగాహనను పెంచుకుంటున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ చట్టాన్ని ఆమోదించడం ద్వారా ముస్లిం మహిళలకు కొత్త హక్కులను కల్పించామని చెప్పారు. ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచినట్లు తెలిపారు. అత్యాచారాల నిరోధం కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. మహిళలను సాధికారులను చేయడానికి తన ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 


Updated Date - 2021-10-12T22:00:36+05:30 IST