కోవిడ్ వేరియంట్లపై పర్యవేక్షణ అనివార్యం: ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు మోదీ సూచన

ABN , First Publish Date - 2021-07-13T22:03:17+05:30 IST

కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేయడంతో పాటు కరోనా వైరస్ మ్యుటేషన్‌పై కఠిన పర్యవేక్షణ..

కోవిడ్ వేరియంట్లపై పర్యవేక్షణ అనివార్యం: ఈశాన్య రాష్ట్రాల సీఎంలకు మోదీ సూచన

న్యూఢిల్లీ: కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేయడంతో పాటు కరోనా వైరస్ మ్యుటేషన్‌పై కఠిన పర్యవేక్షణ తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వర్చువల్ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యుటేషన్, దాని ప్రభావంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు, తగిన చికిత్స కీలకమని అన్నారు. కోవిడ్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాలని అన్నారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యాక్సిన్ తప్పనసరని అన్నారు. అదేవిధంగా టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్‌మెంట్ వ్యూహం అనుసరించాలని,  ఇది విజయవంతమైన వ్యూహంగా నిలిచిందని చెప్పారు.


పర్యాటకం, వ్యాపారాలపై కోవిడ్ ప్రభావం ఉన్న విషయాన్ని ప్రధాని అంగీకరిస్తూనే, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా హిల్‌ స్టేషన్లలో జనం గుమిగూడవద్దని హెచ్చరించారు. థర్డ్ వేవ్ రాకముందే ఎంజాయ్ చేయాలనుకునే వారి వాదనలను ప్రధాని తోసిపుచ్చారు. థర్డ్ వేవ్ తనంత తాను రాదని, ప్రజలే అందుకు కారణమవుతారనే విషయాన్ని ముందు గుర్తించాలని హితువు పలికారు. థర్డ్ వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే అంతా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం, పెద్దఎత్తున జనం గుమిగూడటం వల్లనే కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారని అన్నారు.


అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నందున వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రధాని సూచించారు. కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని అనుకున్న చోట సత్వర వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ప్యాకేజీ ఉపకరిస్తుందన్నారు. అలాగే పడకల సంఖ్య, ఆక్సిజన్ సౌకర్యాలు పెంచడం వంటివి వేగవంతం చేయాలన్నారు. పీఎం కేర్స్ ద్వారా దేశంలో వందలాది ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పీఎం కేర్స్‌తో ఈశాన్య రాష్ట్రాల్లో 150 ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే వీలు కలిగిందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలాగే కోవిడ్ నిరోధక టెస్టులు వేగవంతం చేయాలని, సమష్టిగా కరోనా వ్యాప్తిని ప్రజలు ఎదుర్కోగలరనే నమ్మకం తనకు ఉందని అన్నారు. రాష్ట్రాలకు అవసరమైన సహాయానికి కేంద్రం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అసోం ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2021-07-13T22:03:17+05:30 IST