'Warm wishes...': ఇజ్రాయెల్ నూతన ప్రధాని కోసం హిబ్రూలో ట్వీట్ చేసిన మోదీ

ABN , First Publish Date - 2022-07-01T22:59:29+05:30 IST

ఇజ్రాయెల్ నూతన ప్రధాన మంత్రిగా గురువారం రాత్రి బాధ్యతలు

'Warm wishes...': ఇజ్రాయెల్ నూతన ప్రధాని కోసం హిబ్రూలో ట్వీట్ చేసిన మోదీ

న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ నూతన ప్రధాన మంత్రిగా గురువారం రాత్రి బాధ్యతలు చేపట్టిన యయిర్ లపిడ్‌ (Yair Lapid)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారం అభినందించారు. మాజీ ప్రధాన మంత్రి  నఫ్తలి బెన్నెట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్లను ఇంగ్లిష్, హిబ్రూ భాషల్లో ఇచ్చారు. 


నఫ్తలి బెన్నెట్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆధిక్యతను కోల్పోవడంతో, సాధారణ ఎన్నికలను నిర్వహించేందుకు Israel పార్లమెంటును రద్దు చేయడానికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం  ఇజ్రాయెల్ 14వ ప్రధాన మంత్రిగా యయిర్ లపిడ్ గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు. నవంబరు 1 ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఆయన పదవీ కాలం  తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. 


యయిర్ లపిడ్‌ను అభినందిస్తూ శుక్రవారం మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ సంపూర్ణ దౌత్య సంబంధాలను ఏర్పరచుకుని 30 సంవత్సరాల సంబరాలను జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. 


ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగిన నఫ్తలి బెన్నెట్‌కు ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశానికి నిజమైన మిత్రునిగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘మన మధ్య జరిగిన విజయవంతమైన సంభాషణలను నేను గుర్తుంచుకుంటాను, మీ నూతన పాత్రలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. 


యయిర్ లపిడ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అభినందించారు. బైడెన్ త్వరలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలలో పర్యటించబోతున్నారు. . 


లపిడ్ గురువారం మాట్లాడుతూ, యూదు, ప్రజాస్వామిక దేశం కోసం తాము చేయగలిగినదంతా చేస్తామని చెప్పారు. ఈ కర్తవ్యం తమ అందరి కన్నా పెద్దదని చెప్పారు. ఆయన ఆదివారం తన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Updated Date - 2022-07-01T22:59:29+05:30 IST