కోవిడ్-19పై ట్రంప్- మోదీ సుదీర్ఘ మంతనాలు

ABN , First Publish Date - 2020-04-05T01:43:57+05:30 IST

కరోనా కల్లోలం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు...

కోవిడ్-19పై ట్రంప్- మోదీ సుదీర్ఘ మంతనాలు

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ టెలీఫోన్ సంభాషణ జరిపారు. రోజు రోజుకూ విజృంభిస్తున్న కొవిడ్-19ను నిలువరించేందుకు ఇరువురి మధ్యా సుదీర్ఘ మంతనాలు జరిగాయి. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. పరస్పరం భాగస్వామ్యంతో కొవిడ్-19పై పోరాడేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు అంగీకారానికి వచ్చినట్టు ప్రధాని పేర్కొన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో టెలిఫోన్‌లో విస్తృత సంభాషణ జరిపాను. ఇరువురి మధ్య మంచి చర్చ జరిగింది. భారత్-అమెరికా భాగస్వామ్యంతో కోవిడ్-19పై సర్వశక్తులు ఒడ్డేందుకు అంగీకరించాం..’’ అని ప్రధాని పేర్కొన్నారు. 


కోవిడ్-19 మహమ్మారి కారణంగా అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అక్కడ 2.79 లక్షల మంది కరోనా బారిన పడగా.. 7,451 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారత్‌లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3072 మంది కరోనా బారిన పడగా... 80 మందికి పైగా చనిపోయారు. 



Updated Date - 2020-04-05T01:43:57+05:30 IST