భారత్‌ అంటే బిజినెస్‌!

ABN , First Publish Date - 2022-05-27T08:13:54+05:30 IST

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘జీ-20 దేశాల కూటమిలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. స్మార్ట్‌ ఫోన్ల డేటా వినియోగంలో

భారత్‌ అంటే బిజినెస్‌!

భారత్‌ నిర్ణయాలు ప్రపంచానికే పాఠాలు

విద్యార్థులు, యువతతోనే సాధ్యమైంది

చిరు వ్యాపారాల్ని ‘గ్లోబల్‌’తో లింక్‌ చేయండి

రిఫార్మ్‌, పెర్ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌.. మీ లక్ష్యం 

కావాలి.. ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో ప్రధాని

దేశాన్ని ఇప్పుడు ప్రపంచం కొత్త కోణంలో చూస్తోంది..

భారత్‌ నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచానికే పాఠాలు

ఐఎస్‌బీ స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ 

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘‘జీ-20 దేశాల కూటమిలో వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. స్మార్ట్‌ ఫోన్ల డేటా వినియోగంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. ఇంటర్‌నెట్‌ వినియోగదారుల్లో, గ్లోబల్‌ రిటైల్‌ ఇండెక్స్‌లో ప్రపంచంలోనే రెండో స్థానం. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్‌ ఎకో సిస్టం ఇక్కడ ఉంది. ప్రపంచంలో మూడో అతి పెద్ద కన్స్యూమర్‌ మార్కెట్‌ మనది. గత ఏడాది దేశానికి ఎఫ్‌డీఐ పెద్ద మొత్తంలో వచ్చింది. అందుకే ఇప్పుడు ప్రపంచం మన దేశాన్ని వ్యాపార దేశంగా చూస్తోంది. వాటి దృష్టిలో ఇప్పుడు ఇండియా అంటే బిజినెస్‌’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను, ఇక్కడి యువతను, ఇక్కడి వ్యాపారాన్ని కొత్త కోణంతో చూస్తోందని చెప్పారు. ఇదంతా కేవలం ప్రభుత్వాల చర్యలతోనే సాధ్యం కాలేదని, ఐఎ్‌సబీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి వచ్చిన యువత భాగస్వామ్యంతో సాధ్యమైందని చెప్పారు. భారత్‌ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచానికి ఓ పాఠంలా మారుతున్నాయని తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని విద్యార్థులను ఉద్దేశించి అరగంటపాటు ప్రసంగించారు. మీ వ్యక్తిగత లక్ష్యాలను దేశాభివృద్ధితో అనుసంధానం చేయాలని వారికి సూచించారు.  ‘‘ఇప్పటి వరకు దేశంలో చిన్న, మధ్యతరహా, అసంఘటిత రంగాల వ్యాపారాల్లో అపజయాలు ఎదుర్కొన్నాం. ఆయా వ్యాపారాలు వృద్ధి చెందేందుకు ఎక్కువ అవకాశాలు కల్పించాలి. టెక్నాలజీ సహకారం అందించాలి. చిన్న వ్యాపారాలను దేశ విదేశాల్లోని మార్కెట్లతో అనుసంధానించేందుకు మద్దతు అందించాలి. ఇలాంటి విషయాల్లో ఐఎ్‌సబీ వంటి విద్యా సంస్థల పాత్ర కీలకంగా మారుతోంది. లక్షలాది చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తే కోట్లాది కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. భవిష్యత్తు వ్యాపారవేత్తలుగా దీనిపై మీరు ఎక్కువ దృష్టి పెట్టాలి. దేశ సేవకు ఇది ఒక మంచి అవకాశం. ఐఎ్‌సబీపై, ఇక్కడి విద్యార్థులపై నాకు చాలా నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఏ పని చేసినా.. దేశం కోసం.. దేశం మరింత స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో చేయండి. అప్పుడు విజయం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది’’ అని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలో ప్రభుత్వం సంస్కరణ (రిఫార్మ్‌)లు తెస్తే.. అధికార గణం సమర్థత (పర్ఫార్మ్‌), ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకత (ట్రాన్స్‌ఫార్మ్‌)ఉంటుందని, ఈ మూడు అంశాలు మీ రంతా పరిశోధన చేయదగ్గ అంశాలని సూచించారు.

మేనేజ్మెంట్‌ పాఠం.. వెనకబడిన జిల్లాలు

‘‘గతంలో దేశంలో వందకుపైగా జిల్లాలు అత్యంత వెనకబడినవి ఉండేవి. వీటి ప్రభావం దేశం మొత్తం అభివృద్ధిపై పడేది. వాటిని పట్టించుకోవడానికి బదులుగా గత ప్రభుత్వాలు విస్మరించాయి. అసమర్థ అధికారులకు శిక్ష పేరిట ఆయా జిల్లాలకు బదిలీ చేసేవారు. వాటి విషయంలో మా ప్రభుత్వం సాధించిన విజయం మేనేజ్మెంట్‌ విద్యార్థులకు పాఠంలాంటిది’’ అని మోదీ అన్నారు. సమర్థులైన అధికారులను నియమించి అక్కడి సమస్యలను పరిష్కరించామని చెప్పారు. ఫలితంగా, ఇప్పుడు ఆయా జిల్లాలు అభివృద్ధి చెందిన జిల్లాల కంటే ముందున్నాయని తెలిపారు. ఇలాంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని తాము రాష్ట్రాలను కోరామని, వెనకబడిన మండలాల్లో సంయుక్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ప్రపంచానికి మన సత్తా చాటిన టీకా

కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్లను దేశంలోనే తయారు చేసుకోవడమే కాకుండా వందకుపైగా దేశాలకు ఎగుమతి కూడా చేశామని మోదీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 190 కోట్ల టీకా డోసులను ప్రజలకు అందించామని తెలిపారు. ఈ పరిణామం మన వైద్య రంగం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని చెప్పారు. ‘‘కరోనా వచ్చిన కొత్తల్లో మన వద్ద పీపీఈ కిట్లు కూడా తయారయ్యేవి కాదు. ఇప్పుడు 1,100 పీపీఈ కిట్ల తయారీదారులున్నారు. 2,500 టెస్ట్‌ ల్యాబ్స్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటైంది’’ అని వివరించారు. వైద్య విద్యలోనూ సంస్కరణలు తెచ్చామని, ఎనిమిదేళ్లలో వైద్య కళాశాలలను 380 నుంచి 600కు, వైద్య విద్య సీట్లను 90వేల నుంచి 1.50లక్షలకు పెంచామన్నారు.

2014 తర్వాతే సంస్కరణల అమలు

‘‘గత ఎనిమిదేళ్ల పాలనను అంతకు ముందున్న పాలనతో పోల్చి చూస్తే.. దేశంలో సంస్కరణల ఆవశ్యకతను గత ప్రభుత్వాలు, మా ప్రభుత్వం ఏ విధంగా చూశాయో మీకు స్పష్టంగా తెలుస్తుంది. రాజకీయ అస్థిరత కారణంగా గత ప్రభుత్వాలు సంస్కరణలను పక్కనబెట్టాయి. 2014 తర్వాత దేశంలో అనేక సంస్కరణలను అమలు చేశాం. 1500 పురాతన చట్టాలను రద్దు చేశాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా వ్యాపారాలను సులభతరం చేశాం. ఇతర పన్నులన్నీ రద్దు చేసి పారదర్శకంగా జీఎస్టీ అమలు చేస్తున్నాం.  స్టార్టప్‌ పాలసీలు సిద్ధం చేశాం. 21వ శతాబ్దానికి అనుగుణంగా జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం. ఈ మార్పులన్నీ యువత కోసమే’’ అని మోదీ వివరించారు. నిజాయితీ, చిత్తశుద్ధితో సంస్కరణలు అమలు చేస్తే ప్రజల మద్దతు పెరుగుతుందని తాము నిరూపించామని, ఇందుకు ఫిన్‌ టెక్‌ (ఆర్థిక) రంగం సరైన ఉదాహరణ అని చెప్పారు. బ్యాంకింగ్‌ సేవలు గగనమైన దేశంలో ఇప్పుడు ‘అందరికీ బ్యాంకింగ్‌’ సామాన్యుల జీవితాలను మారుస్తోందని, ప్రపంచం మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో 40 శాతం మన దేశంలో జరుగుతున్నాయని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఫలితాలు వేగవంతంగా, తప్పకుండా వస్తాయన్న విషయాన్ని వోకల్‌ ఫర్‌ లోకల్‌, ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ ద్వారా గమనించామని చెప్పారు. సమస్యలకు మీరు చూపించే పరిష్కారాల కోసం దేశం యువత పక్షాన నిలబడి ఉందని, ఇక్కడి నుంచి వెళ్లాక అనేక విధాన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని, ఇందుకు రిఫార్మ్‌ (సంస్కరణలు), పర్ఫార్మ్‌ (సమర్థత), ట్రాన్స్‌ఫార్మ్‌ (పారదర్శకత) అత్యంత కీలకమని హితవు పలికారు. 

ప్రపంచానికే నేతృత్వం 

స్టార్ట్‌పలు, సంప్రదాయ వ్యాపారాలు, తయారీ, సేవా రంగాలు.. వ్యాపారం ఏదైనా ప్రపంచానికి నేతృత్వం వహించగలమని మన యువత నిరూపిస్తున్నారని మోదీ చెప్పారు. ‘మీపై నాకు విశ్వాసం ఉంది. మీకు మీపై విశ్వాసం ఉంది కదా..?’ అని విద్యార్థులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఐఎ్‌సబీని 2001లో అప్పటి ప్రధాని వాజపేయి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పటి వరకు ఇక్కడ 50 వేల మంది ఎంబీఏ విద్యను పూర్తి చేయడం విశేషమని అన్నారు. కాగా, ఐఎ్‌సబీ ప్రాంగణంలో ప్రధాని మోదీ మొక్క నాటారు. గతంలో ఇక్కడ పర్యటించిన ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రుల చిత్రాలతో ఉన్న ‘ఐఎ్‌సబీ హిస్టరీ వాల్‌’ను సందర్శించారు. అనంతరం ఐఎ్‌సబీ సీనియర్‌ స్టాఫ్‌ 50 మందితో ప్రధాని గ్రూప్‌ ఫొటో దిగారు. 

Updated Date - 2022-05-27T08:13:54+05:30 IST