PM Modi: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-10-06T02:16:54+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు.

PM Modi: హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికల సమరశంఖాన్ని పూరించిన ప్రధాని మోదీ

సిమ్లా: ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు. భవిష్యత్ విజయాలకు ఇది నాంది అని వ్యాఖ్యానించారు. బిలాస్‌పుర్‌లో జరిగిన బీజేపీ ర్యాలీలో మోదీతోపాటు హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ థాకూర్ కూడా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీపై (Congress) ఆయన విమర్శల దాడి చేశారు. కాంగ్రెస్ నేతలు శంకుస్థాపనలు మాత్రమే చేసేవారని, ఎన్నికల ముగిశాక ప్రాజెక్టులను మర్చిపోయేవారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఆరంభించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 


హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఒక ఎయిమ్స్ హాస్పిటల్‌, ఒక ఇంజనీరింగ్‌ కాలేజీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు 2017లో శంకుస్థాపన చేశామని గుర్తుచేశారు. దేశ రక్షణలో ఎంతోమంది హీరోలను అందించిన రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఎయిమ్స్ ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో కూడా హిమాచల్‌ ముఖ్యభూమిక పోషించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో హిమాచల్‌ప్రదేశ్‌లో కేవలం 3 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, గత 8 సంవత్సరాల్లో మరో 8 మెడికల్ కాలేజీలు, ఒక ఎయిమ్స్‌ను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. కాగా దసరా సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా ఈ ఏడాది చివరిలో హిమాచల్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-06T02:16:54+05:30 IST