రాష్ట్రపతిని భూమిపూజకు మోదీ ఆహ్వానించి ఉండాల్సింది: మాయావతి

ABN , First Publish Date - 2020-08-09T20:27:56+05:30 IST

అయోధ్యలో ఈనెల 5న జరిగిన భూమిపూజకు ప్రధాని మోదీ తనతో పాటు రాష్ట్రపతిని తీసుకుని వెళ్లాల్సిందని..

రాష్ట్రపతిని భూమిపూజకు మోదీ ఆహ్వానించి ఉండాల్సింది: మాయావతి

న్యూఢిల్లీ: అయోధ్యలో ఈనెల 5న జరిగిన భూమిపూజకు ప్రధాని మోదీ తనతో పాటు రాష్ట్రపతిని తీసుకుని వెళ్లాల్సిందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి అన్నారు. ఆదివారంనాడు మీడియాతో ఆమె మాట్లాడుతూ, దళిత సాధువులను భూమిపూజకు ఆహ్వానించ లేదని, కనీసం దళిత కమ్యూనిటీకి చెందిన రాష్ట్రపతినైనా ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు. అలా చేసి ఉంటే సమాజానికి ఒక మంచి సందేశం వెళ్లి ఉండేదని పేర్కొన్నారు.


'విశ్వాసాలకు సంబంధించిన అంశం ఇది. దానిని రాజకీయం చేయకూడదు. రామరాజ్యం గురించి మాట్లాడినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. రాముడి ఆదర్శాలను ఆచరణలో చూపాలి. యోగి ప్రభుత్వ హయాంలో యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. రోజు రోజుకూ నేరాల శాతం పెరుగుతోంది. యూపీలో రామరాజ్యం లేదు' అని మాయావతి విమర్శించారు.


సమాజ్‌వాదీ పార్టీపైనా మాయావతి విమర్శలు ఎక్కుపెట్టారు. 'ఇప్పుడు, వారు బ్రాహ్మణ ఓట్లపై దృష్టి పెట్టారు. ఎన్నికల దగ్గరపుడుతున్న తరుణంలో పరశురామ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. ఆ పని వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు. బీఎస్‌పీ ప్రభుత్వం ఏర్పాటయితే పరశురాముడి భారీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. నేతలు, సాధువులు, ఆధ్యాత్మిక గురువులందరి విగ్రహాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం' అని మాయావతి పేర్కొన్నారు. అలాగే, కొత్త ఆసుపత్రులు ఏర్పాటు చేసి, వాటికి అన్ని కులాలు, మతాలకు చెందిన గొప్పగొప్ప సాధువుల పేర్లు పెడతామని చెప్పారు.

Updated Date - 2020-08-09T20:27:56+05:30 IST