పేదలకు రూ.1 లక్ష కోట్లు ఇచ్చాం : మోదీ

ABN , First Publish Date - 2021-10-06T01:05:32+05:30 IST

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం క్రింద పేదల

పేదలకు రూ.1 లక్ష కోట్లు ఇచ్చాం : మోదీ

లక్నో : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం క్రింద పేదల బ్యాంకు ఖాతాలకు రూ.1 లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పీఎంఏవై-అర్బన్ పథకం క్రింద ఉత్తర ప్రదేశ్‌లోని 75 జిల్లాల్లో 75 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ళను మంగళవారం డిజిటల్ విధానంలో అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 


‘‘స్వాతంత్ర్యం@75-నూతన పట్టణ భారతం : పరివర్తన చెందుతున్న పట్టణ దృశ్యం’’ సదస్సు, ఎక్స్‌పోను మంగళవారం మోదీ ప్రారంభించారు. స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్) పథకాల క్రింద ఉత్తర ప్రదేశ్‌లో 75 పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. లక్నో, కాన్పూరు, వారణాసి, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్, ఝాన్సీ, ఘజియాబాద్  నగరాలకు  FAME-II క్రింద 75 బస్సులను ప్రారంభించారు. ఇళ్ళ లబ్ధిదారులతో వర్చువల్ విధానంలో మాట్లాడారు. 


ఇళ్ళు పొందిన 75 వేల మంది తమ కొత్త ఇళ్ళలో దసరా, దీపావళి, ఈద్ పండుగలను ఆనందంగా జరుపుకుంటారన్నారు. ఈ లబ్ధిదారుల్లో 80 శాతం మంది మహిళలే కావడం తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ను పరిపాలించిన గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళను నిర్మించాలని కోరుకోలేదన్నారు. 2017కి పూర్వం ఉత్తర ప్రదేశ్‌లో పీఎంఏవై పథకం క్రింద ఇళ్ళ నిర్మాణానికి రూ.18,000 కోట్లు మంజూరుకు ఆమోదించినట్లు తెలిపారు. అయినప్పటికీ 18 ఇళ్ళనైనా నిర్మించలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం 9 లక్షల ఇళ్ళను నిర్మించిందన్నారు. మురికివాడల్లో నివసించే 3 కోట్ల కుటుంబాలు పక్కా ఇళ్ళు పొందడంతో, ఒకే ఒక పథకంతో లక్షాధికారులయ్యారన్నారు. 


Updated Date - 2021-10-06T01:05:32+05:30 IST