ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగింది : మోదీ

ABN , First Publish Date - 2021-10-07T22:41:55+05:30 IST

మన దేశంలో ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగిందని

ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగింది : మోదీ

న్యూఢిల్లీ : మన దేశంలో ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. పీఎం కేర్స్ నిధి క్రింద కొత్తగా 4,000 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.  ఉత్తరాఖండ్‌లోని హృషీకేశ్‌లో ఉన్న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో గురువారం జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 35 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. 


పీఎం కేర్స్ నిధి క్రింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 35 ప్రెజర్ స్వింగ్ అడ్‌సార్‌ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను మోదీ ప్రారంభించారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు భారత దేశం అతి తక్కువ సమయంలో సదుపాయాలను కల్పించిందని, ఇది దేశ సామర్థ్యాన్ని వెల్లడిస్తోందని మోదీ అన్నారు. దేశంలో టెస్టింగ్ ల్యాబ్‌ల సంఖ్య ఒకటి నుంచి 3,000కు పెరిగిందని, మాస్క్‌లు, కిట్లను దిగుమతి చేసుకునే దశ నుంచి వాటిని తయారు చేసే స్థాయికి ఎదిగామని, ఎగుమతిదారుగా వేగంగా దూసుకెళ్తున్నామని చెప్పారు. 


దేశంలోని అన్ని జిల్లాల్లోనూ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పీఎం కేర్స్ నిధి  క్రింద 1,224 పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని పేర్కొంది. వీటిలో 1,100 ప్లాంట్లు ప్రారంభమయ్యాయని, రోజుకు 1,750 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందజేస్తున్నాయని తెలిపింది. 


Updated Date - 2021-10-07T22:41:55+05:30 IST