ఉగ్ర మూకల ఆధిపత్యం తాత్కాలికమే : మోదీ

ABN , First Publish Date - 2021-08-20T21:23:33+05:30 IST

విధ్వంసకర శక్తుల ఆధిపత్యం తాత్కాలికమేనని ప్రధాన మంత్రి

ఉగ్ర మూకల ఆధిపత్యం తాత్కాలికమే : మోదీ

న్యూఢిల్లీ : విధ్వంసకర శక్తుల ఆధిపత్యం తాత్కాలికమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గుజరాత్‌లోని సోమనాథ్‌లో వివిధ ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ, భయోత్పాతంతో సామ్రాజ్యాలను ఏర్పాటు చేసే సిద్ధాంతాన్ని అనుసరించేవారు చలాయించే ఆధిపత్యం తాత్కాలికమేనని, వారు మానవాళిని నిరంతరం అణగదొక్కలేరు కాబట్టి వారి ఆధిపత్యం శాశ్వతం కాబోదని తెలిపారు. 


సోమనాథ దేవాలయాన్ని, దానిలోని విగ్రహాలను అనేకసార్లు ధ్వంసం చేశారని, దాని ఉనికిని అంతం చేయడానికి ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ ప్రతి విధ్వంసకర దాడి తర్వాత అది సగర్వంగా మరింత ప్రకాశవంతంగా తిరిగి నిలబడిందని చెప్పారు. ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని తెలిపారు. 


ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతోపాటు వేలాది మంది ప్రజలు దేశం విడిచి పారిపోయారు. అమెరికన్ దళాలకు సహకరించినవారిని తాలిబన్లు శత్రువులుగా భావిస్తూ, వారిని అంతం చేయడం కోసం ప్రతి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. 


తాలిబన్లు 1996-2001 మధ్య కాలంలో పరిపాలించినపుడు మహిళలు, బాలికలపై తీవ్రమైన ఆంక్షలను అమలు చేశారు. బాలికలు పాఠశాలలకు వెళ్ళి, చదువుకోవడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. వ్యభిచారానికి పాల్పడినవారిని రాళ్ళతో కొట్టి చంపేవారు. సంగీతం, టెలివిజన్ ఛానళ్ళను కూడా నిషేధించారు. ఇకపై తమ పరిపాలన విభిన్నంగా ఉంటుందని, బాలికలు, మహిళల హక్కులను గౌరవిస్తామని తాజాగా తాలిబన్లు ప్రకటించారు. కానీ ఈ హామీలు నీటి మూటలేనని ఆఫ్ఘన్లు చెప్తున్నారు. 


Updated Date - 2021-08-20T21:23:33+05:30 IST