Shinzo Abe నా ప్రియాతిప్రియమైన మిత్రుల్లో ఒకరు : మోదీ

ABN , First Publish Date - 2022-07-08T22:31:48+05:30 IST

జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే అత్యంత విషాదకరంగా ప్రాణాలు

Shinzo Abe నా ప్రియాతిప్రియమైన మిత్రుల్లో ఒకరు : మోదీ

న్యూఢిల్లీ : జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబే అత్యంత విషాదకరంగా ప్రాణాలు కోల్పోవడంపట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తనకు అత్యంత ప్రియమైన మిత్రుల్లో ఒకరని, ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అబే అంతర్జాతీయ స్థాయిలో శిఖర సమానుడైన గొప్ప నేత అని, అసాధారణమైన నాయకుడని, దక్షతగల పరిపాలకుడని పేర్కొన్నారు. 


పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో షింజో అబేపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను నారా మెడికల్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు దాదాపు ఐదున్నర గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. 


నరేంద్ర మోదీ శుక్రవారం ఇచ్చిన ట్వీట్లలో, ‘‘నా అత్యంత ప్రియ మిత్రుల్లో ఒకరైన షింజో అబే అత్యంత విషాదకరంగా మరణించడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నా విచారాన్ని వ్యక్తం చేయడానికి మాటలు లేవు. ఆయన అంతర్జాతీయ స్థాయిలో శిఖర సమానుడైన గొప్ప నేత, అసాధారణ నాయకుడు, దక్షతగల పరిపాలకుడు. జపాన్, ప్రపంచం మరింత మెరుగ్గా అభివృద్ధి చెందడం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు’’ అని పేర్కొన్నారు. 


షింజో అబేతో తాను కలిసి ఉన్న ఫొటోను ఓ ట్వీట్‌లో మోదీ షేర్ చేశారు. ‘‘నా ప్రియ మిత్రుడు షింజో అబేతో తాజాగా జరిగిన సమావేశం సందర్భంగా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తున్నాను. జపాన్-ఇండియా అసోసియేషన్ చైర్మన్ పదవిని ఆయన చేపట్టారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం గురించి ఆయన ఎల్లప్పుడూ తపిస్తూ ఉంటారు’’ అని పేర్కొన్నారు. 


సుదీర్ఘ కాలం నుంచి స్నేహితుడే

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన కాలం నుంచి తనకు షింజో అబేతో సాహచర్యం ఉందని తెలిపారు. తాను ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత కూడా తమ స్నేహం కొనసాగిందన్నారు. ఆయనకు అంతర్జాతీయ వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ గురించి అపారమైన అవగాహన ఉందని, అది తనపై గాఢ ముద్ర వేసిందని తెలిపారు. 


శనివారం జాతీయ సంతాప దినం 

షింజో అబే గౌరవార్థం శనివారం జాతీయ సంతాప దినంగా పాటించనున్నట్లు మోదీ ప్రకటించారు. భారత్-జపాన్ మధ్య సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్, గ్లోబల్ పార్టనర్‌షిప్ స్థాయికి ఎదిగే విధంగా అబే ఎంతో కృషి చేశారన్నారు. నేడు జపాన్‌తోపాటు యావత్తు భారత దేశం విచారిస్తోందని తెలిపారు. జపనీస్ సోదర, సోదరీమణులకు భారతీయులంతా సంఘీభావం తెలుపుతున్నట్లు చెప్పారు. 


షింజో అబే శుక్రవారం నారా సిటీలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా వెనుక నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ఆయన వెంటనే కుప్పకూలిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు దాదాపు ఐదున్నర గంటలపాటు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయనపై కాల్పులు జరిగినట్లు తెలిసిన వెంటనే ఆయన సతీమణి అకీ అబే హుటాహుటిన రైలులో ప్రయాణించి, నారా ఆసుపత్రికి చేరుకున్నారు.


భారత్‌తో వ్యక్తిగత అనుబంధం : జపాన్ మాజీ రాయబారి

జపాన్‌లో మాజీ భారత రాయబారి సుజన్ చినోయ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, షింజో అబే భారత దేశంతో వ్యక్తిగత అనుబంధం ఏర్పరచుకున్నారని తెలిపారు. జపాన్ రక్షణ, భద్రతలపైనే ఆయన ఎల్లప్పుడూ దృష్టి సారించేవారని తెలిపారు. ఆసియన్ సెక్యూరిటీ డయమండ్ కార్యక్రమం గురించి ఆయన నిత్యం మాట్లాడేవారన్నారు. అదే తదనంతరం ఇండో-పసిఫిక్‌గా మారిందన్నారు. మలబార్ విన్యాసాల్లో జపాన్‌ను ఓ భాగస్వామిగా 2015లో తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇది మోదీ, అబేల దార్శనికత అని చెప్పారు. 


ఇదిలావుండగా, షింజో అబేపై కాల్పులు జరిపారనే అనుమానంతో పోలీసులు టెట్సుయ యమగామి అనే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పోలీసులతో మాట్లాడుతూ, అబే రాజకీయ సిద్ధాంతాలకు తాను వ్యతిరేకం కాదని, ఆయనపై కాల్పులు జరపడానికి కారణం ఆయన రాజకీయ విశ్వాసాలు కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం యమగామి కాల్పులు జరిపిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించలేదు. తుపాకీని క్రింద పడేసి, అక్కడే నిల్చున్నాడు.


షింజో అబే మృతి పట్ల చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. 


Updated Date - 2022-07-08T22:31:48+05:30 IST