న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ప్రపంచం అనుసరించదగినవని, అవి లక్షలాది మందిని బలోపేతం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు రాజ్ ఘాట్‌లో నివాళులర్పించారు. శిరసు వంచి ఆయనకు గౌరవ వందనం చేస్తున్నానని చెప్పారు. ఆయన జీవితం, ఆదర్శాలు దేశంలోని ప్రతి తరానికి ప్రేరణనిస్తాయని తెలిపారు.
మోదీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, జాతి పిత మహాత్మా గాంధీకి ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా తాను గౌరవనీయ గాంధీజీకి శిరసు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. పూజ్య బాపూ జీవితం, ఆదర్శాలు మన దేశంలోని ప్రతి తరాన్ని ప్రేరేపిస్తాయని, కర్తవ్య మార్గంలో నడిచే విధంగా ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రపంచం అనుసరించదగినవని, అవి లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయని అన్నారు.
గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో 1869 అక్టోబరు 2న జన్మించారు.